సీబీఐకి యరపతినేని అక్రమ మైనింగ్‌ కేసు

CBI Charges Yarapathineni Srinivasa Rao For Illegal Mining - Sakshi

ఆయనతో పాటు మరో 15 మందిపై దాఖలైన 18 కేసులు సీబీఐకి అప్పగిస్తూ నోటిఫికేషన్‌

ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ సెక్షన్‌ 6 ప్రకారం రాష్ట్ర సర్కారు నిర్ణయం

టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని ఆధ్వర్యంలో సాగిన అక్రమ మైనింగ్‌ దందా

గుంటూరు జిల్లా కేసనుపల్లి, కోనంకి, నడికుడి గ్రామాల్లో అక్రమ మైనింగ్‌పై నమోదైన కేసులు

సాక్షి, అమరావతి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, మరో 15 మందిపై నమోదైన అక్రమ మైనింగ్‌ కేసుల విచారణను సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(సీబీఐ)కి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు యరపతినేని, ఆయన అనుచరులు అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారనే అభియోగాలు రావడం తెలిసిందే. అయినప్పటికీ ఆయనపై గత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో యరపతినేనిపై చర్యలు తీసుకోవాలంటూ టీజీవీ కృష్ణారెడ్డి 2016లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అనంతరం 2018లో గుంటూరు జిల్లా దాచేపల్లి, కొండమోడు, పిడుగురాళ్ల, నడికుడి, అమరావతి ప్రాంతాలకు చెందిన మరో 15 మందిపై 17 కేసులు నమోదయ్యాయి.

వీరిలో వేముల శ్రీనివాసరావు, తిప్పవజుల నారాయణశర్మలపై రెండేసి కేసులు, మరో 13 మందిపై ఒక్కో కేసు రిజిస్టర్‌ అయ్యాయి. యరపతినేనితో కలిపి 16 మందిపై మొత్తం 18 కేసులు నమోదయ్యాయి. పిడుగురాళ్ల మండలం కేసనుపల్లి, కోనంకి గ్రామాల్లో సున్నపురాయి అక్రమ తవ్వకం, రవాణా, దాచేపల్లి మండలం నడికుడి గ్రామాల్లో అక్రమ మైనింగ్‌ జరిగినట్టు గుర్తించారు. కోనంకిలో 690, 691, 692 సర్వే నంబర్‌లోను, కేసనుపల్లిలోని 324/ఎ, 336/1బి, 336/5, 336/6లోను, నడికుడిలోని 17/4, 17/5, 17/6, 17/7, 15 సర్వే నంబర్లలో జరిగిన అక్రమ మైనింగ్‌ను నిర్ధారించారు.

ఇందుకు సంబంధించి ఐపీసీ, ప్రివెన్షన్‌ ఆఫ్‌ డేమేజీ పబ్లిక్‌ ప్రాపర్టీ(పీడీపీపీ) యాక్ట్, మైన్స్‌ అండ్‌ మినరల్స్‌(ఎంఎం) యాక్ట్, ఆంధ్రప్రదేశ్‌ మైనర్‌ మినరల్‌ కన్సెషన్‌ రూల్స్‌ ప్రకారం పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనిపై సీఐడీ విచారణకు గత ప్రభుత్వం ఆదేశించింది. దర్యాప్తు పూర్తి చేసిన సీఐడీ తన నివేదికను సర్కారుకు అందజేసింది. అయితే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ కొనసాగడంతో సీబీఐ దర్యాప్తు అంశం ప్రస్తావనకు వచ్చింది. అక్రమ మైనింగ్‌లో అనేక కీలక అంశాలకు సంబంధించి విçస్తృత స్థాయి దర్యాప్తు అవసరమని సీఐడీ సైతం హైకోర్టుకు నివేదించగా, పిల్‌ దాఖలు చేసిన టీజీవీ కృష్ణారెడ్డి కూడా సీబీఐ దర్యాప్తును కోరారు. ప్రభుత్వం అనుకుంటే సీబీఐ దర్యాప్తునకు చర్యలు తీసుకోవచ్చు కదా అంటూ హైకోర్టు కేసు విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది.

యరపతినేని, ఆయన అనుచరులపై
►నమోదైన కేసులివీ..
►యరపతినేని శ్రీనివాసరావు–హైకోర్టు పిల్‌ 170/2016, మీనిగ అంజిబాబు– 308/2018,
►తిప్పవజుల నారాయణశర్మ–309/2018,
►గ్రంధి అజయ్‌కుమార్‌–310/2018,  
►తిప్పవజుల నారాయణశర్మ–311/2018,
►రాజేటి జాకబ్‌–312/2018, గుదె వెంకట
►కోటేశ్వరరావు–313/2018,
►వర్సు ప్రకాశ్‌–314/2018,
►వర్ల రత్నం దానయ్య–315/2018,
►నంద్యాల నాగరాజు–316/2018,
►నీరుమళ్ల శ్రీనివాసరావు–317/2018,
►ఆలపాటి నాగేశ్వరరావు–318/2018,
►వేముల శ్రీనివాసరావు–181/2018,
►వర్సు వెంకటేశ్వరరావు–182/2018,
►వేముల ఏడుకొండలు–183/2018,
►ఈర్ల వెంకటరావు–184/2018, బి. నరసింహా
►రావు–185/2018, వి. శ్రీనివాసరావు–186/2018

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top