‘హెరిటేజ్’ తూకాల్లో తేడాలపై కేసు | case filed on heritage | Sakshi
Sakshi News home page

‘హెరిటేజ్’ తూకాల్లో తేడాలపై కేసు

May 6 2014 12:36 AM | Updated on Sep 4 2018 5:07 PM

పాలు, పాల ఉత్పత్తుల తూకాల్లో తేడాలు ఉండటంతో హెరిటేజ్ మిల్క్ డెయిరీతో సహా మొత్తం ఆరు సంస్థలపై కేసులు నమోదు చేశామని తూనికలు-కొలతల శాఖ కంట్రోలర్, అదనపు డీజీ ఎస్.గోపాల్‌రెడ్డి సోమవారం తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: పాలు, పాల ఉత్పత్తుల తూకాల్లో తేడాలు ఉండటంతో హెరిటేజ్ మిల్క్ డెయిరీతో సహా మొత్తం ఆరు సంస్థలపై కేసులు నమోదు చేశామని తూనికలు-కొలతల శాఖ కంట్రోలర్, అదనపు డీజీ ఎస్.గోపాల్‌రెడ్డి సోమవారం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నిర్వహించిన దాడుల్లో ఈ అక్రమాలు బయటపడ్డాయని వెల్లడించారు. హెరిటేజ్, జెర్సీ, తిరుమల, శకుంతల, కర్నూలు, వర్ధన్నపేట స్వకృషి ఉమెన్స్ కోపరేటివ్ డెయిరీలు, తయారీ యూనిట్లలో ఈ తనిఖీలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. తూకాల్లో అవకతవకలకు సంబంధించి హైదరాబాద్‌లో 9, ఏలూరులో 4, నిజామాబాద్‌లో 1, కర్నూలులో 3, విశాఖపట్నంలో 2, విజయవాడలో 2, కరీంనగర్‌లో 2, వరంగల్‌లో ఒక కేసు నమోదు చేశామన్నారు.
 
 రెండు ప్లాంట్లలోనే తేడాలు: హెరిటేజ్ ఫుడ్స్
 
 తూనికలు-కొలతల శాఖ దాడులకు సంబంధించి హెరిటేజ్ పా‘పాలు’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్ ఎం.సాంబశివరావు లిఖిత పూర్వక వివరణ ఇచ్చారు. తూనికలు-కొలతల శాఖ అధికారులు శనివారం బయ్యవరం (విశాఖపట్నం), బొబ్బిలి (విజయనగరం), పామర్రు (తూర్పుగోదావరి), నార్కెట్‌పల్లి (నల్లగొండ), ఉప్పల్ (హైదరాబాద్)ల్లో ఉన్న తమ ప్లాంట్లలో తనిఖీలు చేశారని అంగీకరించారు. మూడింటిలో తూకాలు పక్కాగా ఉండగా... రెండింటిలో మాత్రమే తేడాలు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారని పేర్కొన్నారు. మరోపక్క తమ ఉత్పత్తులపై కేరళ ప్రభుత్వం నిషేధం విధించిన మాట వాస్తవమే అన్న ఆయన... అది తాత్కాలికమైందని, ఆపై తామిచ్చిన సాంకేతిక వివరణతో సంతృప్తి చెంది నిషేధాన్ని ఎత్తివేశారని సాంబశివరావు పేర్కొన్నారు.

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement