విధి వంచితుడు

Carpenter Suffering With Strange disease In Anantapur - Sakshi

వింతవ్యాధి బారిన కార్పెంటర్‌

స్పర్శ లేక ఎడమకాలు తొలగింపు

కుడి కాలుకు కూడా త్వరలో అదే పరిస్థితి

వికలత్వ పింఛన్‌ మంజూరు చేయని ప్రభుత్వం

భారమైన పోషణ.. కనికరం చూపాలంటున్న కుటుంబం

సాఫీగా సాగిపోతున్న కార్పెంటర్‌ను విధి చిన్నచూపు చూసింది. వింతవ్యాధి అతడిని వికలాంగుడిని చేసింది. కుటుంబ పోషణ భారమైన అతడికి వికలత్వ పింఛన్‌ మంజూరు చేసి ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్దయగా వ్యవహరించింది. పిల్లల చదువు, కుటుంబ పోషణ భారమై ఆ కుటుంబం ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది.

మడకశిర: మడకశిర పట్టణంలోని పాత ఎస్సీ కాలనీకి చెందిన మచ్చయ్య కుటుంబం దీన స్థితిలో కొట్టిమిట్టాడుతోంది. ఇతను ఒకప్పుడు మంచి కార్పెంటర్‌. ఎంతో గౌరవంగా జీవనం సాగిస్తున్న ఈ కుటుంబాన్ని వింతవ్యాధి కష్టాల్లోకి  నెట్టింది. మచ్చయ్యకు భార్య సుమంగళి, కుమారుడు సూర్యప్రకాశ్, కుమార్తె అనుశ్రీ ఉన్నారు. ఈ పిల్లలిద్దరూప్రభుత్వ పాఠశాలలో 6, 4వ తరగతి చదువుకుంటున్నారు. మచ్చయ్యకు తల్లి నారాయణమ్మ కూడా ఉంది. తండ్రి జూలప్ప కొన్నేళ్ళ క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు.

వింతవ్యాధితో కాలు తొలగింపు..
కుటుంబ పెద్ద అయిన మచ్చయ్యకు ఏడాది క్రితం వింత వ్యాధి సోకింది. ఎడమ కాలు స్పర్శ కోల్పోయింది. దీంతో కుటుంబసభ్యులు డాక్టర్లను సంప్రదించారు. గత ఏడాది మే నెలలో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఇతని ఎడమ కాలు తొలగించారు. కుడి కాలు కూడా క్రమేణా స్పర్శ కోల్పోతోంది. ఈ కాలును కూడా తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఇదే సందర్భం లో మచ్చయ్య తల్లి నారాయణమ్మ కడుపులో కణితి ఏర్పడి అనారోగ్యానికి గురైంది. 11.50 కిలోల కణితిని హిందూపురంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో తొలగించా రు. ఆరోగ్యశ్రీ వర్తించకపోవడంతో వైద్యానికి రూ.60 వేలు వెచ్చించాల్సి వచ్చింది.

కుటుంబ పోషణంతా భార్యపైనే..
ప్రస్తుతం మచ్చయ్య కుటుంబ పోషణంతా భార్య సుమంగళిపై పడింది. ఈమె పరిగిలోని ఓ గార్మెంట్‌ పరిశ్రమకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తోంది. నెలకు వచ్చే రూ.6 వేలతో కుటుంబాన్ని పోషిస్తోంది. ఈ కుటుంబానికి వ్యవసాయ భూమి కూడా లేదు. వైఎస్‌ఆర్‌ హయాంలో ఇల్లు మంజూరైంది. తమ పరిస్థితిని అర్థం చేసుకుని మచ్చయ్యకు వికలత్వ పింఛన్‌ మంజూరు చేసి ఆదుకోవాలని భార్య సుమంగళి, తల్లి నారాయణమ్మ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

90శాతం వికలాంగత్వం..అయినా అందని పింఛన్‌
మచ్చయ్యకు 90శాతం వికలత్వం ఉంది. డాక్టర్లు కూడా సర్టిఫికెట్‌ ఇచ్చారు. అయినా ప్రభుత్వం ఇంత వరకు పింఛన్‌ మంజూరు చేయలేదు. పింఛన్‌ కోసం పలుసార్లు దరఖాస్తు చేసుకున్నాడు. మున్సిపల్‌ కార్యాలయం చుట్టూ తిరిగినా ఎలాంటి ఫలితమూ లేదు. అదిగో ఇదిగో అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top