విషం..నిగనిగ

Carbaid Fruits In Kurnool Markets - Sakshi

మార్కెట్‌ను ముంచెత్తుతున్న కార్బైడ్‌ మామిడి  

శ్రుతిమించుతున్న వ్యాపారుల ఆగడాలు

మసకబారుతున్న బంగినపల్లి ఖ్యాతి  

రంగు చూసి మోసపోతున్న కొనుగోలుదారులు  

ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం    

మొద్దు నిద్రలో అధికారులు   

కర్నూలు(అగ్రికల్చర్‌): మార్కెట్‌లో ఆకర్షణీయమైన రంగులో మామిడి పండ్లు నోరూరిస్తున్నాయా? అయితే..వాటిని కొనే ముందు, తినే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. అది స్వచ్ఛమైనదా? లేక ‘కార్బైడ్‌’ పండా అనే విషయం తెలుసుకోండి. లేదంటే అనారోగ్యాన్ని డబ్బు పెట్టి కొనుకున్నట్లే. కొద్ది రోజులుగా పెనుగాలుల తీవ్రతకు మామిడి కాయలు భారీగా నేలరాలుతున్నాయి. వీటిని కార్బైడ్‌తో కృత్రిమంగా మాగబెడుతూ.. అకర్షణీయమైన రంగు తెప్పించి మార్కెట్‌లోకి తెస్తున్నారు. జిల్లాలో కాపు కాసే  తోటలు 12వేల హెక్టార్లలో ఉన్నాయి. ప్రధానంగా మామిడి తోటలు వెల్దుర్తి, బనగానపల్లె, బేతంచెర్ల, డోన్, ప్యాపిలి, ఓర్వకల్లు, తుగ్గలి, కల్లూరు తదితర మండలాల్లో విస్తరించి ఉన్నాయి. జిల్లాలోని దిగుబడి 60 శాతం వరకు హైదరాబాద్‌కు తరలిస్తుండగా, మిగిలిన 40 శాతంలో ఎక్కువ భాగం కర్నూలులోని గడియారం ఆసుపత్రి దగ్గర నిర్వహించే పండ్ల మార్కెట్‌కు వస్తోంది.

కార్బైడ్‌ వాడకం ఏడాది పొడవునా ఉన్నా.. మామిడి సీజన్‌లో మరీ ఎక్కువవుతోంది. సాధారణంగా కాయ పక్వానికి వచ్చేందుకు కనీసం వారం, పది రోజులు పడుతుంది. దీంతో వ్యాపారులు రెండు, మూడు రోజుల్లో మాగబెట్టేందుకు నిషేధిత కార్బైడ్‌ను యథేచ్ఛగా వాడుతున్నారు. అరటి, సపోట, యాపిల్‌ తదితర వాటిని కూడా ఇదే పద్ధతిలోనే మాగబెడుతున్నారు. చివరికి నిమ్మ కాయలకు కూడా ఆకర్షణీయమైన రంగు తెప్పించేందుకు కార్బైడ్‌ను వాడుతుండటం గమనార్హం.  బంగినపల్లి మామిడికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఈ రకం పండుకు ఇప్పటికే భౌగోళిక గుర్తింపు కూడా లభించింది. అయితే.. ఈ పండ్లను సైతం మాగించడానికి కార్బైడ్‌ను వినియోగిస్తుండటంతో ప్రతిష్ట మసకబారే ప్రమాదం ఏర్పడింది.

తనిఖీలు నామమాత్రమే
ప్రజలకు సురక్షితమైన పండ్లు అందేలా చూడాల్సిన బాధ్యత ఆహార పరిరక్షణ, ప్రమాణాల అమలు విభాగం అధికారులపై ఉంది. ఈ విభాగంలో సిబ్బంది కొరత వేధిస్తుండటం, ఉన్న వారు పట్టించుకోక పోవడంతో విషతుల్యమైన పండ్లను ప్రజలు తినాల్సిన దుస్థితి దాపురించింది. జిల్లాలో అసిస్టెంటు ఫుడ్‌ కంట్రోలర్‌ పోస్టు ఖాళీగా ఉండటంతో అనంతపురం జిల్లా అధికారి ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. మొన్నటి వరకు గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టు ఖాళీగా ఉండగా మూడు రోజుల క్రితమే భర్తీ అయింది. ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు 4 ఉండగా, ఇందులో 2 ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం విధులు నిర్వర్తించే అధికారులకు వాహన సదుపాయం కూడా లేకపోవడంతో తనిఖీలు నామమాత్రంగా ఉన్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 65 శ్యాంపిల్స్‌ తీశారు. ఇందులో 6 శ్యాంపిల్స్‌ సురక్షితం కాదని, మరో మూడు శ్యాంపిల్స్‌ మిస్‌ బ్రాండ్‌ అని తేలింది. మరో 2  నాసిరకంగా ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన వాటికి సంబంధించిన నివేదిక రావాల్సి ఉంది.  

కార్బైడ్‌ నిషేధం.. కాగితాలకే పరిమితం
కార్బైడ్‌తో మాగించిన ఫలాలు తిని వినియోగదారులు వ్యాధుల బారిన పడుతుండటంతో   ప్రభుత్వం 2012 మార్చి 19న కార్బైడ్‌ వాడకాన్ని నిషేధించింది. ఈ మేరకు జీవో ఆర్‌టీ నెంబర్‌ 288ని జారీ చేసింది. ఈ జీవోను అమలు చేయడానికి ప్రత్యేక చర్యలు లేకపోవడంతో నిషేధం కాగితాలకే పరిమితమైంది.  సంబంధిత అధికారులు అడపాదడపా శ్యాంపిల్స్‌ సేకరించి ల్యాబ్‌కు పంపడం మినహా ఎలాంటి చర్యలూ లేవు. రైతులు, వ్యాపారులకు కార్బైడ్‌ వాడకంతో కలిగే అనర్థాలను వివరించి, ప్రత్యామ్నాయ పద్ధతులపై అవగాహన కల్పించాల్సిన అధికారులు ఆ దిశగా  చర్యలు తీసుకోవడం లేదు.  

నేడు జేసీ ప్రత్యేక సమావేశం
మార్కెట్‌లో కార్బైడ్‌తో మాగించిన పండ్లు విక్రయిస్తున్నారని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తుండటంతో జాయింట్‌ కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. మలాయి చికెన్‌ వ్యాపారుల దందాపైనా ఈ సమావేశంలో చర్చించన్నారు.  

స్వచ్ఛమైన పండ్లు ఇలా ఉంటాయి.
పుసుపు, లేత ఆకు పచ్చ రంగు కలిగి లోపల పండు మొత్తం పరిపక్వంగా ఉంటుంది.  
పండు మెత్తగా ఉండి, ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. తగినంత చక్కెర శాతం కలిగి ఉంటుంది.
తియ్యగా, రుచిగా ఉండడంతో పాటు మంచి వాసన కొద్ది దూరం వరకు వస్తుంది.    

కార్బైడ్‌తో మాగించిన పండ్లు ఇలా ఉంటాయి..
పండు మొత్తం కాంతివంతమైన లేత పసుపు రంగు కలిగి ఉంటుంది.
పైకి మాగినట్లుగా కనిపించినా లోపల అపరిపక్వంగా, రుచి పుల్లగా ఉంటుంది.  
పండును ముక్కు దగ్గర ఉంచినపుడు మాత్రమే మామిడి పండు వాసన వస్తుంది.  
పండు తొక్క మడతలు లేకుండా ఉండి, గట్టిగా ఉంటుంది. పండ్లు త్వరగా పాడైపోతాయి.  
తొక్కపై నల్లని మచ్చలు ఏర్పడతాయి.  

కాల్షియం కార్బైడ్‌వాడకంతో అనర్థాలు  
క్యాన్సర్, అల్సర్, కాలేయం, మూత్రపిండ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.  
కాల్షియం కార్బైడ్‌ ద్వారా వెలువడే ఎసిటిలీస్‌ వాయువు నాడి వ్యవస్థ మీద ప్రభావం చూపడంతో  తలనొప్పి, దీర్ఘకాలిక మత్తు, జ్ఞాపిక శక్తి కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.   
చిన్నపిల్లలకు శ్వాస సంబంధిత వ్యాధులు, అధిక విరేచనాలు అవుతాయి.
గర్భిణులకు అబార్షన్‌ అయ్యే ప్రమాదం ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top