‘సాక్షి’కి ప్రకటనల జారీలో ప్రభుత్వ వివక్ష... | CAG Fires On creating big business for those both the news papers | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి, ఆయన కార్యాలయం ఆదేశాల మేరకే..

Feb 28 2019 4:03 AM | Updated on Feb 28 2019 11:00 AM

CAG Fires On creating big business for those both the news papers - Sakshi

సాక్షి, అమరావతి: సాక్షి దినపత్రికకు ప్రచార ప్రకటనల జారీలో రాష్ట్ర ప్రభుత్వం వివక్షకు పాల్పడడాన్ని కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తప్పుపట్టింది. ఆ రెండు పత్రికలకు (ఈనాడు, ఆంధ్రజ్యోతి) అత్యధిక బిజినెస్‌ను కల్పించారని, అయితే భారీ సర్క్యులేషన్‌ గల సాక్షి పత్రికకు మాత్రం అతి తక్కువ బిజినెస్‌ను కల్పించారని, ఇందులోనే వివక్ష కళ్లకు కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని పేర్కొంది. ఇందుకు కారణాలు ఏమిటో తెలియజేయాలని, ఒక విధానం లేకుండా ప్రచార ప్రకటనలు ఎలా జారీ చేశారో సమాధానం చెప్పాల్సిందిగా సమాచార శాఖను కాగ్‌ కోరింది. దీనిపై సమాచార శాఖ కమిషనర్‌ కాగ్‌కు లిఖిత పూర్వక సమాధానమిస్తూ.. ముఖ్యమంత్రి, ఆయన కార్యాలయం ఆదేశాల మేరకే ఆ రెండు పత్రికలకు ఎక్కువ బిజినెస్‌ కల్పించామని, సాక్షికి తక్కువ కల్పించడానికి కూడా వారి ఆదేశాలే కారణమని స్పష్టం చేశారు. దీనిపై సంతృప్తి చెందని కాగ్‌.. సరైన సమాధానం చెప్పాల్సిందిగా మరోసారి కోరింది. దీనిపై కూడా సమాచార శాఖ కమిషనర్‌ లిఖిత పూర్వకంగా సమాధానం ఇస్తూ సీఎం, ఆయన కార్యాలయం ఆదేశాల మేరకే పనిచేశామని, అంత పెద్దస్థాయిలో ఆదేశాలను అమలు చేయడం తప్ప చేసేదేమీ ఉండదని పేర్కొన్నారు.

2015–16 ఆర్థిక సంవత్సరం నుంచి 2017–18 వరకు సమాచార శాఖ జారీ చేసిన ప్రచార ప్రకటనలపై కాగ్‌ నివేదికను రూపొందించింది. మూడేళ్లలో సమాచార శాఖ ప్రచార ప్రకటనలకు 125.42 కోట్ల రూపాయలను వ్యయం చేసిందని, ఇందులో 44 శాతం అంటే 54.04 కోట్ల రూపాయల మేర ఆ రెండు పత్రికలకే (ఈనాడు, ఆంధ్రజ్యోతి) ప్రయోజనం కలిగించిందని కాగ్‌ ఎత్తి చూపింది. అత్యధిక సర్క్యులేషన్‌ గల సాక్షి పత్రికకు కేవలం 8.99 కోట్ల రూపాయల బిజినెస్‌ను మాత్రమే ఇచ్చారని, తక్కువ సర్క్యులేషన్‌ గల ఆంధ్రజ్యోతికి భారీ బిజినెస్‌ ఎలా కల్పించారని ప్రశ్నించింది. ప్రకటనల జారీలో సహజ న్యాయాన్ని, పారదర్శకతను పాటించలేదని కాగ్‌ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని తేటతెల్లమైందని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement