ముందుగానే మద్యం కొనుగోలు

Buy Alcohol Beforehand - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: ఓటర్లను తమ దారిలోకి తెచ్చుకోవాలంటే పలు రకాల తాయిలాలతో ఆకర్షిస్తుంటారు. అయితే చేతిలో నోటు పెట్టినా సంతృప్తి చెందని ఓటర్లు సైతం మద్యం ముంగిట మోకరిల్లుతుంటారు. అందుకే ప్రతీసారి ఎన్నికల సమయంలో పోలింగ్‌కు వారం, పది రోజుల ముందు మద్యాన్ని కొనుగోలు చేస్తుండేవారు. ఈ దఫా అధికార పార్టీ నాయకులు ముందుగానే మద్యం కొనుగోలు చేసి నిల్వలు ఉంచుతున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఇప్పటికే మద్యం నిల్వను గ్రామస్థాయికి పంపించారు. నామినేషన్ల పర్వం ప్రారంభం కాకముందే మద్యం పంపిణీకి తెరలేపారు. శనివారం ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చిన సందర్భంలో మద్యాన్ని ఏరులై పారించారు. వజ్రపుకొత్తూరు మండలంలోని మత్స్యకార గ్రామాల్లో సైతం మద్యాన్ని విచ్చలవిడిగా పంపిణీ చేయడం, ఆ దృశ్యాలు సాక్షి కెమెరాకు చిక్కిన విషయం తెలిసిందే. వారం రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మద్యాన్ని టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పట్టుకున్నారు. ఇందులో 90 శాతం వరకు అధికార పార్టీకి చెందిన వారి నుంచే స్వాధీనం చేసుకోవడం గమనార్హం.

ఇలా అధికార పార్టీ నాయకులు మద్యం విషయంలో ముందు జాగ్రత్త పడ్డారు. జిల్లాలో అధిక శాతం మద్యం దుకాణాలు అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే నడుస్తున్నాయన్నది జగమెరిగిన సత్యం. అటువంటి దుకాణాల్లో కూడా పరిమితికి మించి మద్యాన్ని నిల్వ చేసినట్లు సమాచారం. అయినప్పటికీ వీటి వైపు ఎక్సైజ్‌ అధికారులు కన్నెత్తి చూడటం లేదు. అదేవిధంగా ఒడిశా నుంచి కూడా పెద్ద ఎత్తున మద్యాన్ని జిల్లాకు తరలించి నిల్వ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలో రూ. 200 కోట్ల విలువ చేసే మద్యం నిల్వ ఉంచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నామమాత్రపు తనిఖీలకే మద్యం పట్టుబడుతుంటే కేంద్ర బలగాలు తనిఖీలు చేస్తే మరింత పెద్ద ఎత్తున మద్యం నిల్వలు బయటపడతాయని అధికార పార్టీ వారే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సంఘం కూడా ఈ విషయంపై దృష్టి సారించి తనిఖీలను ముమ్మరం చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

48 మద్యం సీసాలు స్వాధీనం

వజ్రపుకొత్తూరు: మండలంలోని కొమరల్తాడ గ్రామంలో బెల్టుషాపుపై ఆదివారం ఎస్‌ఐ పీ నరిసింహమూర్తి, ఎన్నికల ప్లయింగ్‌ స్క్వాడ్‌ దాడులు నిర్వహించారు. ఈ మేరకు గ్రామానికి చెందిన రత్నాల ఢిల్లేశ్వరావు నుంచి 48 డీకే మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు 41 సీఆర్‌పీసీ ప్రకారం 34 ఏ సెక్షన్‌ కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు పేర్కొన్నారు. 

                                               
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top