కోడెల ట్యాక్స్‌ వెనక్కి ఇప్పించండి

Builder Complaint Against Kodela Son - Sakshi

గుంటూరు అర్బన్‌ ఎస్పీకి కోడెల కుమారుడిపై ఓ బిల్డర్‌ ఫిర్యాదు

చెక్కుల పాస్‌ కోసం తన వద్ద  రూ. 5 లక్షలు తీసుకున్నారన్న మరో బాధితుడు

లక్ష్మీపురం(గుంటూరు)/సత్తెనపల్లి: మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుటుంబ సభ్యులపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. నరసరావుపేట పోలీసుస్టేషన్‌లో ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. సోమవారం గుంటూరు అర్బన్‌ ఎస్పీ సీహెచ్‌ విజయారావు నిర్వహించిన పోలీస్‌ గ్రీవెన్స్‌లో సత్తెనపల్లికి చెందిన ఓ బిల్డర్‌ కోడెల ట్యాక్స్‌ (కే ట్యాక్స్‌)పై ఫిర్యాదు చేశారు. అపార్టుమెంట్‌ నిర్మాణం అనుమతికోసం తన వద్ద  బలవంతంగా రూ. 15 లక్షలు వసూలు చేశారని, ఆ డబ్బును వడ్డీతో సహా ఇప్పించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కోరారు. బాధితుడి కథనం ప్రకారం.. గుంటూరు విద్యానగర్‌కు చెందిన బిల్డర్‌ జి.తిరుపతిరావు సత్తెనపల్లిలోని పార్క్‌రోడ్డులో 2016 జనవరిలో తిరుమల టవర్స్‌ పేరుతో సీఆర్‌డీఏ అనుమతితో అపార్ట్‌మెంట్‌ నిర్మాణాన్ని చేపట్టారు.

సత్తెనపల్లి పురపాలక సంస్థలో అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. నిర్మాణం జరగాలంటే ముందుగా కోడెల కుమారుడు శివరాంను కలవాలంటూ సత్తెనపల్లి పురపాలక కమిషనర్‌ చెప్పారు. దీనిపై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. చేసేది లేక కోడెల శివరాం, అతని పీఏ గుత్తా నాగ ప్రసాద్‌లను కలిస్తే.. ఒక్కో ఫ్లాట్‌కు రూ.2 లక్షల చొప్పున 15 ఫ్లాట్‌లకు రూ. 30 లక్షలు చెల్లిస్తేనే అన్ని అనుమతులు వస్తాయని లేని పక్షంలో నిర్మాణం చేపట్టడానికి వీలులేదని బెదిరించారు. అంత చెల్లించుకోలేనని చెప్పి రూ.15 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ఆ డబ్బును 2016 జూన్‌ 12న చెల్లించారు. డబ్బు చెల్లించిన విషయం పురపాలక కమిషనర్‌కు తెలియజేయగా, ఆయన అపార్ట్‌మెంట్‌ నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. తన నుంచి దౌర్జన్యంగా వసూలు చేసిన రూ.15 లక్షల నగదు వడ్డీతో సహా వెనక్కి ఇప్పించాలని, కోడెల శివరాం అతని పీఏలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. 

చెప్పిన డబ్బు చెల్లిస్తేనే చెక్‌ పాస్‌..
ప్రభుత్వం నుంచి తనకు రావాల్సిన చెక్‌ను కోడెల శివరాం తీసుకెళ్లి డబ్బు డిమాండ్‌ చేశారని సత్తెనపల్లి పట్టణంలోని వడ్డవల్లికి చెందిన టీడీపీ నేత, శ్రీలక్ష్మీ తులసి ఏజెన్సీస్‌ నిర్వాహకుడు యెల్లినేడి శ్రీనివాస్‌ పోలీసుల వద్ద మొరపెట్టుకున్నారు. ఆయన సోమవారం డీఎస్పీ వి.కాలేషావలిని కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. శ్రీలక్ష్మీతులసి ఏజెన్సీస్‌ ద్వారా 2017 ఫిబ్రవరి 3న నరసరావుపేటలో ఖేలో ఇండియా గ్రూప్‌ 2కు వచ్చిన క్రీడాకారులకు భోజన ఏర్పాట్లు చేశానన్నారు. అప్పటి జాయింటు కలెక్టర్‌ 2, నరసరావుపేట ఆర్డీవో, జిల్లా డీఎస్‌వో ద్వారా వర్క్‌ ఆర్డర్‌ తీసుకొని భోజనాలను ఏర్పాటు చేశానని, సుమారు రూ. 27 లక్షలు బిల్లు అవగా జాయింటు కలెక్టర్‌–2 ఆ బిల్లులను రూ. 23 లక్షలకు కుదించి మంజూరు చేశారన్నారు. అయితే బిల్‌ పేమెంట్‌ చేయకుండా జేసీ–2 తిప్పుతుండటంతో ఆయన్ను కలవగా మొదటి చెక్కును కోడెల శివరాం పీఏ తీసుకెళ్లారని చెప్పారన్నారు. విషయం తెలిసి కోడెల శివరాంను కలిస్తే ఖర్చుల నిమిత్తం తన పీఏకు రూ. 5 లక్షలు ఇవ్వాలని చెప్పారన్నారు. పీఏను కలసి డబ్బులు లేవని చెప్పగా,  రూ. 5 లక్షలు ఇస్తేనే చెక్కులు ఇస్తామని చెప్పారన్నారు. గత్యంతరం లేక వారు చెప్పిన విధంగా చేశానన్నారు. తన వద్ద డబ్బులు తీసుకున్న కోడెల శివరాం, ఆయన పీఏలను అరెస్టు చేసి తనకు న్యాయం చేయాలని కోరారు. అయితే దీనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. సివిల్‌ మ్యాటర్‌ అయినందున తమ పరిధి కాదని డీఎస్పీ చెప్పారని బాధితుడు శ్రీనివాస్‌ వాపోయారు. 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top