బై బై బీఎస్‌ఎన్‌ఎల్.. భావోద్వేగానికి లోనైన ఉద్యోగి

BSNL Employees Step Down With Voluntary Retirement - Sakshi

వీఆర్‌ఎస్‌ తీసుకున్న ఉద్యోగులు

విధులకు శుక్రవారం చివరి రోజు

ఇక మిగిలింది 3,847 మందే...

సాక్షి, అమరావతి: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌)కు చెందిన రాష్ట్ర కార్యాలయాల్లో నిన్న (శుక్రవారం) ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకున్న బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల కోసం వాలంటరీ రిటైర్‌మెంట్‌ స్కీమ్‌ (వీఆర్‌ఎస్‌)ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం, ఇందుకు భారీ ఎత్తున ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవడం తెలిసిందే. ఇలా వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న వారి విధుల నిర్వహణకు జనవరి 31 చివరి రోజు. దీంతో బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయాల్లో శుక్రవారం ఉద్వేగపూరిత వాతావరణం నెలకొంది. 

బాధ్యతల నుంచి రిలీవ్‌ అవుతున్నవారంతా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తమ భావాలను పరస్పరం పంచుకుంటూ గడిపారు. సంస్థ పరిస్థితి దయనీయంగా మారడం...కోలుకునే పరిస్థితులు కనిపించకపోవడంతో చాలామంది ఉద్యోగులు వీఆర్‌ఎస్‌కు ముందుకొచ్చి అప‍్లయ్‌ చేసుకున్నారు. ఏపీలో బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయాల్లో వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల సంఖ్య 8,878మంది ఉండగా, వీరిలో 5,031మంది వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేశారు. దీంతో సంస్థలో 3,847మంది ఉద్యోగులు మాత్రమే మిగిలినట్లు అయింది. అర్హత ఉన్నా 1,361మంది వీఆర్‌ఎస్‌కు దూరంగా ఉన్నారు.

ఉద్యోగం...ఉద్వేగభరితం..
ఎన్నో ఏళ్లుగా తమ మధ్య విధులు నిర్వర్తించిన ఓ ఉద్యోగిని స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తుండటం.. తోటి ఉద్యోగులను భావోద్వేగానికి గురి చేసింది. ఆమెకు వీడ్కోలు పలకడం వారికి భారంగా మారింది. ఎస్‌డీఈ (పీఆర్‌)గా పని చేసిన పద్మా శర్మ స్వచ్ఛంద పదవీ విరమణ సందర్భంగా సహోద్యోగి డీఎస్‌ నరేంద్ర..ఆమెతో చివరిసారి కరచాలనం చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ దృశ్యం శుక్రవారం హైదరాబాద్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ భవన్‌లో చోటుచేసుకుంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ భవన్‌ మూడొంతులు ఖాళీ
సాక్షి, హైదరాబాద్‌ : ఇక నగరంలోని టెలికం ఉద్యోగుల్లో సుమారు 77% మంది వీఆర్‌ఎస్‌ తీసుకున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సంస్థలో కొత్తగా చేరిన ఉద్యోగులు మినహా మిగిలిన వారంతా వీఆర్‌ఎస్‌ తీసుకున్నారు. హైదరాబాద్‌ టెలికం జిల్లా పరిధిలో మొత్తం 3,500 మంది ఉద్యోగులకు గాను అందులో 2,613 మంది ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌కు చెందిన వారిలో 17 మంది డీజీఎంలు, 80 ఎజీఎంలు, 100 మంది ఎస్‌డీవోలు, 80 మంది జేటీవోలు ఉన్నారు.

మిగతా వారిలో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌కు చెందిన వారున్నారు.హైదరాబాద్‌ సర్కిల్‌ సీజీఎం పరిధిలోకి వచ్చే మరో 284 మంది ఉద్యోగులు సైతం వీఆర్‌ఎస్‌ తీసుకున్నారు. దీంతో  ఆదర్శనగర్‌లో గల టెలికం ప్రిన్సిపల్‌ జనరల్‌ మేనేజర్‌ (పీజీఎం) కార్యాలయమైన బీఎస్‌ఎన్‌ఎల్‌ భవన్‌ మూడొంతులు ఖాళీ అయింది. ఉన్నతాధికారుల నుంచి నాల్గోవ తరగతి సిబ్బంది వరకు పదవీ విరమణ చేయడంతో పలు సెక్షన్లు బోసిపోయాయి.


 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top