8 జెడ్పీటీసీ, 345 ఎంపీటీసీల్లో ఎన్నికలకు బ్రేక్‌ | Sakshi
Sakshi News home page

8 జెడ్పీటీసీ, 345 ఎంపీటీసీల్లో ఎన్నికలకు బ్రేక్‌

Published Tue, Mar 10 2020 3:57 AM

Break to 345 MPTC and 8 ZPTC elections - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 8 జెడ్పీటీసీ, 345 ఎంపీటీసీ స్థానాల్లో ‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియకు బ్రేక్‌ పడింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 7వ తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసినప్పటికీ.. నియమ నిబంధనలకు లోబడి జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌ల వారీగా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు ఎక్కడికక్కడ సోమవారం వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీచేశారు. రిటర్నింగ్‌ అధికారులు నోటిఫికేషన్‌ జారీచేసిన సమయం నుంచి ఆ పరిధిలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ 7వ తేదీన నోటిఫికేషన్‌ జారీ చేసినప్పుడే.. జిల్లాలో ఏవైనా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఎన్నికల నిర్వహణకు కోర్టు కేసులు, ఇతర పాలనాపరమైన ఆటంకాలు ఉన్నప్పుడు అలాంటి చోట తాత్కాలికంగా ఎన్నికను నిలిపివేసే అధికారం ఆయా జిల్లాల కలెక్టర్లకు కల్పించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ల ఆదేశాలకు అనుగుణంగా స్థానిక రిటర్నింగ్‌ అధికారులు సోమవారం రాష్ట్రంలో 660 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా, 652 స్థానాలలో మాత్రమే ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్లు జారీచేశారు. అలాగే, 10,047 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 9,702 ఎంపీటీసీ స్థానాలకు మాత్రమే ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. 
- తూర్పు గోదావరి జిల్లాలో ఒకటి, కృష్ణా జిల్లాలో 3, గుంటూరు జిల్లాలో మూడు, ప్రకాశం జిల్లాలో ఒకటి చొప్పున జెడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. 
ఎంపీటీసీ స్థానాల విషయానికొస్తే.. ఎక్కువగా తూర్పు గోదావరి జిల్లాలో 98, కృష్ణాలో 89, గుంటూరులో 57. ప్రకాశంలో 42, చిత్తూరులో 22 స్థానాల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. అనంతపురం, విజయనగరం జిల్లాల్లో మాత్రమే అన్నిచోట్లా ఎన్నికలు జరుగుతున్నాయి. 

Advertisement
Advertisement