ప్రేయసి పిలిచె..హాస్టల్‌లోకి దూరె..

Boyfriend Jumps in Ladies Hostel Warden Caught in Chittoor - Sakshi

గమనించిన వాచ్‌ ఉమెన్‌ పోలీసులకు సమాచారం

పోలీసుల రాకతో రెండో అంతస్తు నుంచి జంప్‌

చిత్తూరు, పలమనేరు: సినిమాను తలపించేలా ఓ యువకుడు తన ప్రేయసి కోసం దుస్సాహసానికి తెగబడ్డాడు. ‘నువ్‌..మగాడివైతే అర్ధరాత్రి హాస్టల్‌కి రా..ఫోన్‌ చెయ్‌ వస్తా..’ అని బంపర్‌ ఆఫర్‌ ఇవ్వడంతో గాల్లో తేలిపోయాడు. తానో స్పైడర్‌ మాన్‌ లెవెల్‌లో గోడలు ఎగబాకి హాస్టల్‌లోకి ప్రవేశించాడు. ఆపై, ప్రేయసికి ఫోన్‌చేసే ప్రయత్నంలో పడ్డాడు. అయితే ఆగంతకుడి రాకను గమనించిన వాచ్‌ ఉమెన్‌ పోలీసులకు సమాచారమిచ్చింది. విద్యార్థినులు అతగాడిని చూసి భయంతో కేకలు వేశారు. అంతే కథ అడ్డం తిరిగింది. వివరాల్లోకి వెళితే..స్థానిక మదనపల్లె రోడ్డులోని ఓ మహిళా ప్రైవేటు హాస్టల్‌లోకి గురువారం అర్ధరాత్రి ఓ ఆగంతకుడు ప్రవేశించాడు. హాస్టల్‌ గోడకు ఉన్న పైపుల ద్వారా ఎగబాకి రెండో అంతస్తుకు చేరుకున్నాడు. అక్క డ చీకటి ప్రదేశం నుంచి సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుండగా వాచ్‌మెన్‌ గమనించింది.

ఈ విషయాన్ని పోలీసులకు తెలిపింది. దీంతో అప్రమత్తమైన సీఐ శ్రీధర్‌ మహిళా ఎస్‌ఐ ప్రియాంక, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అప్పటికే హాస్టల్‌లోని విద్యార్థులు బిగ్గరగా కేకలు పెట్టడం.. కింద సైరన్‌ మోతతో పోలీసు వాహనం చేరుకోవడం చూసి ఆగంతకుడు చమటలు పట్టాయి. పైపుల నుంచి మళ్లీ జారుతూ కిందకు దూకాడు. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు పట్టుకున్నారు. ప్రాథమిక విచారణలో అతని పేరు భానుప్రసాద్‌(22) అని, పట్టణంలో పెయింటర్‌ పనిచేసే వాడని తేలింది. హాస్టల్‌లో ఉంటున్న ఇంటర్‌ చదివే బాలిక అర్ధరాత్రి లోనికి ఎలాగైనా రమ్మందని, అందుకే ఈ ప్రయత్నం చేసినట్లు అతడు వెల్లడించాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి తహసీల్దార్‌ ద్వారా సీఐ బైండోవర్‌ చేయించారు. అసలు మేటరేమిటంటే ఆ విద్యార్థిని ఇంట వారం పాటు ఇతగాడు పెయిటింగ్‌ పనులు చేశాడట! దీంతో ఆ బాలిక ప్రేమ పల్లవి అందుకుందట!!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top