చారిత్రక నగరిలో ఆధ్యాత్మికత వెల్లివెరిసింది. బోనాల జాతరతో భాగ్యనగరం పండుగ కళ సంతరించుకుంది. పాతబస్తీతో పాటు నగర వ్యాప్తంగా ఉన్న ఆలయాలకు భక్తజనం పోటెత్తింది.
భాగ్యనగరిలో బోనాల సందడి
Aug 5 2013 4:53 AM | Updated on Sep 1 2017 9:38 PM
చారిత్రక నగరిలో ఆధ్యాత్మికత వెల్లివెరిసింది. బోనాల జాతరతో భాగ్యనగరం పండుగ కళ సంతరించుకుంది. పాతబస్తీతో పాటు నగర వ్యాప్తంగా ఉన్న ఆలయాలకు భక్తజనం పోటెత్తింది. డప్పు వాయిద్యాలు, యువకుల కేరింతలు, పోతురాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలతో బోనాల వేడుక అంబరాన్నంటింది. ఫలహారపు బండ్లు, తొట్టెల ఊరేగింపుతో పాత నగరం ఆదివారం మార్మోగింది. పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహిణి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన బోనాన్ని సమర్పించారు.
అలాగే, అక్కన్నమాదన్న లయం, బేలా ముత్యాలమ్మ ఆలయం, హరిబౌలి బంగారు మైసమ్మ దేవాలయం, సుల్తాన్ షాహి శీతల్‌మాత జగదాంబ మహంకాళి ఆలయం, రాంబక్షి బండ అమ్మవారి ఆలయం తోపాటు మీరాలం మండి, ఉప్పుగూడ, గౌలిపురా, మురాద్ మహాల్‌లలోని శ్రీమహంకాళి ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. కార్వాన్‌లోని దర్బార్ మైసమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. అంబారీపై అమ్మవారి చిత్రపటాన్ని ఉంచి ఊరేగించారు.
లోయర్ ట్యాంక్‌బండ్ శ్రీకనకాల కట్టమైసమ్మ దేవాలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనపుట్టు వెంట్రుకలు ఇక్కడే అమ్మవారికి సమర్పించానని, తాను ఇక్కడి సమీపంలోని నల్లగుట్టలోనే పుట్టానన్నారు. మంత్రి గీతారెడ్డి కూడా కూతురు మనుమరాలితో కలిసి వచ్చి మీరంమండి అమ్మవారిని దర్శించుకున్నారు.
Advertisement
Advertisement