బూత్‌ లెవల్‌ .. అంతా హడల్‌!

BLO's Facing  Problems In Chitoor district - Sakshi

త్రిశంకు స్వర్గంలో బీఎల్వోలు

ఓ వైపు అధికార పార్టీ ఒత్తిళ్లు

మరోవైపు అధికారుల ఆదేశాలు

ఇచ్చేది అరకొర వేతనాలే

జిల్లాలో బీఎల్వోల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఒకపక్క అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లు .. మరో వైపు అధికారుల ఆదేశాలు వారిని మానసికంగా కుంగదీస్తున్నాయి. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ వేధింపుల పర్వం ఎక్కువవుతోంది. సమావేశాలు.. విచారణల పేరుతో ఆర్థికంగానూ చితికిపోవాల్సి వస్తోంది. గ్రామాల్లో అధికార పార్టీ నాయకుల ఛీదరింపులు.. అధికారుల చివాట్లతో మరింత ఆందోళనకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. 

సాక్షి,పలమనేరు(చిత్తూరు) : రాబోవు సార్వత్రిక ఎన్నికల కోసం విధులు నిర్వహిస్తున్న సిబ్బందిలో బూత్‌లెవల్‌ అధికారుల పాత్ర అత్యంత కీలకం. ఎన్నికల సంఘానికి సంబంధించిన పనులు చేయాలనే గౌరవంతో విధులు నిర్వహిస్తున్న వీరికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈదఫా అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు తప్పడం లేదు. వారిమాట విని ఏదేనీ తప్పుచేస్తే ఉన్న ఉద్యోగాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి. మరోవైపు అధికారుల ఆదేశాలను పాటిస్తూ విధులు ఎప్పటికప్పుడు పూర్తిచేయాలి. ఈమధ్య భారీగా వస్తున్న ఫామ్‌–7 క్లయిమ్‌ల విచారణ వీరికి తలనొప్పిగా మారింది.

 
క్షేత్రస్థాయిలో బీల్వోలే అత్యంతకీలకం
ఎన్నికల నిర్వహణలో బీఎల్వోలే అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఓటర్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి 6–క్లయిమ్‌ల స్వీకరణ, వీటిపై విచారణ, ప్రస్తుతం 7–క్లయిమ్‌ల స్వీకరణ, ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ, వీటికి సంబంధించిన చెక్‌లిస్ట్, ఫామ్‌–13, 14 నోటీసుల జారీ వీటిపై విచారణలు చేయడం నిత్యకృత్యంగా మారుతోంది. ఓటర్ల జాబితాలో అక్రమాలను గుర్తించడం, బూత్‌లెవల్లో సౌకర్యాలు, మార్పులు తదితరాలపై సమాచారాన్ని ఉన్నతాధికారుకు ఇస్తూ వారి ఆదేశాలను పాటించాలి. ఇందుకోసం అంగన్‌వాడీ వర్కర్లు, వీఆర్వోలు, వీఆర్‌ఏలు, సాక్షరభారత్‌ కో–ఆర్డినేటర్లు, మున్సిపల్‌ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు తదితరులను ఎంపిక చేశారు. వీరు వారిశాఖలతో పనిలేకుండా ఎన్నికల ప్రక్రియ ముగిసేదాకా బూత్‌లెవెల్‌ అధికారులుగా విధులు నిర్వర్తిస్తారు.

అధికారపార్టీ ఒత్తిళ్లు 
గతంలో ఎన్నడూలేని విధంగా ఈదఫా ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ నాయకులు వీరిని తమదారిలోకి తెచ్చుకుంటున్నారు. తాము చెప్పినట్టు చేయాలంటూ జిల్లా వ్యాప్తంగా ఒత్తిళ్లు తెస్తున్నట్టు తెలుస్తోంది. నయానా, భయానా కాకుంటే పలు రకాల ప్రలోభాలకు గురిచేసి కొందరిని ఇప్పటికే వారి దారికి తెచ్చుకున్నట్టు సమాచారం. గ్రామాల్లో అయితే అక్కడి అధికార పార్టీ నేతలు, సాధికార మిత్రలు వీరి వెంటే ఉంటున్నారనే ఆరోపణలున్నాయి. చిన్నస్థాయి ఉద్యోగులు కాబట్టి స్థానిక నేతల మాటలు వినకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉంటాయోనని కొందరు వారు చెప్పినట్టే చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. పచ్చ నేతల నుంచి తనకు ఇలాంటి ఒత్తిళ్లున్నాయని వారు అధికారులకు చెప్పుకున్నా లాభం లేకుండా ఉంది. ఎందుకంటే అధికారులు సైతం నాయకుల మాట వినేవాళ్లే ఎక్కువగా ఉన్నారనేది నిజం. ఈ విధుల్లోకి ఎందుకొచ్చామా..? అని బయటకు చెప్పుకోలేక బీఎల్వోలు లోలోన మదనపడేవారే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

ఎన్నికల విధుల్లో బీఎల్వోలు 

 
విచారణలో తప్పని తిప్పలు
అర్హులైన ఓటర్లను సైతం కొందరు ఫామ్‌ –7 ద్వారా తొలగింపునకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. అభ్యంతరాలు జిల్లాలో వేలల్లోనే ఉండడంతో వీటిని మళ్లీ విచారించాల్సిన పరిస్థితి నెలకొంది. క్షేత్రస్థాయిలో వీరు అవరసమైన ధ్రువపత్రాలను అడిగితే ఓటర్లు ఎన్నిసార్లు విచారిస్తారంటూ బీఎల్వోలను ప్రశ్నిస్తున్నారు. వారిని ఒప్పించి నేర్పుగా పనులు చేయాల్సి వస్తోంది. ఎప్పటికప్పుడు టార్గెట్లపేరిట అధికారుల నుంచి ఆదేశాలు తప్పడం లేదు. వీరు మానసికంగా వేధింపులకు గురవుతున్నట్లు తెలుస్తోంది.

 
కష్టం ఎక్కువ.. ఫలితం తక్కువ
ఇంత కష్టపడినా బీఎల్వోలకు మూడు నెలలకు ఎన్నికల సంఘం నుంచి అందే గౌరవ వేతనం మూడు వేలు మాత్రమే. దీనికోసం ఎన్నో కష్టాలు పడాల్సి వస్తోందని బీఎల్వోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఈ విధుల కారణంగా బీపీలు, షుగర్‌ లాంటి జబ్బులు వస్తున్నాయని వాపోతున్నారు. జిల్లా అధికారులు వీరికి అధికార పార్టీ నుంచి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాల్సిన అవరసం ఎంతైనా ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top