బీజేపీ, టీడీపీ దొందూ దొందే | Sakshi
Sakshi News home page

బీజేపీ, టీడీపీ దొందూ దొందే

Published Fri, May 22 2015 3:37 AM

BJP and TDP both are same

రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
 
 అనంతపురం సిటీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో బీజేపీ, టీడీపీ  దొందూ దొందేనని వక్తలు  ఎద్దేవా చేశారు.  స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏపీకి ప్రత్యేక హోదా-రాయల సీమకు ప్రత్యేక ప్యాకేజీ-జిల్లా సమగ్రాభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరుతూ సీపీఎం నగరకమిటీ కార్యదర్శి నాగేంద్ర అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.

 సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఒ.నల్లప్ప, సిపిఐ నగర కార్యదర్శి లింగమయ్య, నరసింహులు, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇండ్ల ప్రభాకర్‌రెడ్డి, డాక్టర్ వీరభధ్రయ్య, సీఐటీయూ నాయకులు సూర్యనారాయణ, ముష్కిన్, గోపాల్, ముర్తుజా తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

ఇప్పుడు  ప్రత్యేక హోదా ఇస్తే ఇతర రాష్ట్రాలు ఊరికే ఉంటాయా అంటూ దాటవేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రావాలని  ఇతర దేశాల్లో అడుక్కుంటున్న చంద్రబాబు ప్రత్యేకహోదా గురించి అస్సలు పట్టించుకోవడం లేదన్నారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ప్రాజెక్టుల గురించి ఆలోచించలేద న్నారు. ప్రస్తుతం నిధులు కేటాయించకుండా కాలువగట్లపై నిద్ర పేరుతో నిధులు దుర్వినియోగం చేస్తున్నారన్నారు. రాయలసీమకు అన్యాయం చేసి కోస్తాను తన పార్టీకి పెట్టని కోటగా మార్చుకునేందుకు బాబు యత్నిస్తున్నాడన్నారు.

పట్టిసీమకు రూ.1300 కోట్లిచ్చి, హంద్రీ-నీవాకు కేవలం 200 కోట్లు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నీరు చెట్టు పేరుతో కోట్లాది రూపాయలు కాంట్రాక్టర్లకు కట్టబెడుతున్న చంద్రబాబు అదే సొమ్మును కాలువల నిర్మాణానికి పెడితే బాగుంటుందని హితవు పలికారు. ఎన్నికల సమయంలో టీడీపీ పెట్టిన ఖర్చును రాబట్టుకోవడానికి చూస్తున్నారే తప్ప రాయలసీమకు నీరివ్వాలి, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా తేవాలన్న తపన ఏ కోశానా లేదన్నారు. ముందు ముందు పోరాటాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Advertisement
Advertisement