అడ్డొస్తే బుల్డోజర్‌తో తొక్కిస్తా..

Bitter experience to Chandrababu from Titli Cyclone victims - Sakshi

     నోర్ముయ్‌.. చెప్పింది విను.. నాతో వితండవాదం వద్దు  

     40 ఏళ్ల నుంచి రాజకీయాలు చేస్తున్నా.. తోక జాడిస్తే కత్తిరిస్తా

     తిత్లీ తుపాను బాధితులపై సీఎం చంద్రబాబు ఫైర్‌ 

     చంద్రబాబు తీరుపై బాధితుల మండిపాటు

వజ్రపు కొత్తూరు రూరల్‌: తిత్లీ తుపాన్‌ బాధితులను పరామర్శించడానికి మంగళవారం శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. గరుడబద్ర, బైపల్లి, బాతుపురం, చినవంక, డోకులపాడు, తాడివాడ, కిడిసింగి, వజ్రపుకొత్తూరు గ్రామాల్లో అయన పర్యటించారు. చంద్రబాబు మాట్లాడుతుండగా బాధితులు అడుగడుగునా నిరసన వ్యక్తం చేశారు. చినవంక గ్రామంలో సీఎం మాట్లాడుతున్నప్పుడు కొందరు యువకులు అడ్డుతగిలారు. దీంతో చంద్రబాబు అగ్రహాంతో ఊగిపోయారు. నోర్ముయ్‌.. చెప్పింది విను అంటూ వారిపై కన్నెర్ర చేశారు. ‘‘నాతో వితండవాదం చేయకండి. బుద్ధి ఉండి మాట్లాడండి.

నాకు అడ్డు తగిలితే బుల్డోజర్‌తో తొక్కిస్తా. నేను 40 ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్నా.. నా దగ్గర తోక జాడిస్తే తోక కత్తిరిస్తా’’ అంటూ తీవ్రంగా హెచ్చరించారు. చంద్రబాబు తీరుపై తుపాన్‌ బాధితులు మండిపడ్డారు. తమ రుణాలను మాఫీ చేయాలని మహిళలు కోరగా.. అందుకు డబ్బులు రాష్ట్రంలో లేవని చంద్రబాబు బదులిచ్చారు. గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు జరగడం లేదని చినవంక గ్రామస్తులు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. అక్కడే ఉన్న పలాస ఎమ్మెల్యే గౌతు శివాజీ కలుగుజేసుకొని మంత్రి అచ్చెన్నాయుడి దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లానని అన్నారు. అయన(అచ్చెన్నాయుడు) మాత్రం ఏం చేస్తారులే అని చంద్రబాబు బదులివ్వడంతో గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. 

ఇతర రాష్ట్రాల సహాయం కోరాం
తుపాన్‌ బాధితులను ఆదుకోవాలని ఇతర రాష్ట్రాల సహాయాన్ని కోరామని, బాధితులను పూర్తిస్థాయిలో ఆదుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొల్లు రవీంద్ర, పితాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top