ఏపీ కొత్త గవర్నర్‌గా విశ్వభూషణ్‌ హరిచందన్‌

Biswabhusan Harichandan as AP new governor - Sakshi

రాష్ట్రపతి భవన్‌ ఉత్తర్వులు జారీ

భారతీయ జనసంఘ్‌తో రాజకీయ ప్రవేశం

1980–88 వరకు బీజేపీ ఒడిశా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు

బిజూ జనతాదళ్‌–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి

కవిగా, రచయితగా ప్రత్యేక గుర్తింపు

ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా అనసూయా ఊకే నియామకం

సాక్షి, అమరావతి/భువనేశ్వర్‌: ఒడిశాకు చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత విశ్వభూషణ్‌ హరిచందన్‌ను ఆంధ్రప్రదేశ్‌ కొత్త గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి భవన్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒడిశా రాష్ట్ర న్యాయ శాఖ మంత్రిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్రం విడిపోయి ఐదేళ్లు దాటినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా నియమితులైన ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ఇప్పటివరకు నూతన ఆంధ్రప్రదేశ్‌కు కూడా గవర్నర్‌గా కొనసాగుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఏపీకి కొత్త గవర్నర్‌ను నియమిస్తారని ఇప్పటికే పలుమార్లు వార్తలు వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నరసింహన్‌నే తెలుగు రాష్ట్రాల గవర్నర్‌గా కొనసాగిస్తూ వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు హరిచందన్‌ నియమితులైనందున నరసింహన్‌ ఇక నుంచి తెలంగాణకు మాత్రమే గవర్నర్‌గా కొనసాగుతారు. కాగా, విశ్వభూషణ్‌ హరిచందన్‌ జనతా, జనతాదళ్‌ పార్టీల నుంచి ఒక్కోసారి, బీజేపీ నుంచి మూడుసార్లు ఒడిశా శాసనసభకు వరుసగా ఎన్నికయ్యారు. భువనేశ్వర్‌ నుంచి మూడుసార్లు, సిలికా నుంచి రెండుసార్లు ఎన్నికైన ఆయన 2004లో బిజూ జనతాదళ్‌ – భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఇదిలా ఉంటే.. ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా రాజ్యసభ సభ్యురాలు అనసూయా ఊకేను కూడా కేంద్రం నియమించింది. వీరిద్దరి నియామకాలకు సంబంధించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేశారు. గత ఆగస్టులో బాలరాం దాస్‌ టాండన్‌ మృతి చెందినప్పటి నుంచి మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌ ఛత్తీస్‌గఢ్‌కు కూడా గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 

జనసంఘ్‌తో విశ్వభూషణ్‌ రాజకీయ ప్రస్థానం
కాగా, భారతీయ జనసంఘ్‌లో 1971లో చేరడం ద్వారా రాజకీయ ప్రవేశం చేసిన విశ్వభూషణ్‌ హరిచందన్‌.. ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక సభ్యునిగా, రాష్ట్ర జనరల్‌ సెక్రటరీగా పనిచేశారు. ఎమర్జెన్సీని వ్యతిరేకించినందుకు ఆయన 1975లో మీసా చట్టం కింద నిర్బంధానికి గురయ్యారు. 1977లో భారతీయ జనసంఘ్‌ జనతా పార్టీగా మారే వరకు ఆయన ఆ పదవుల్లో కొనసాగారు. తర్వాత బీజేపీలో చేరి 1980 నుంచి 1988 వరకు ఒడిశా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1988లో విశ్వభూషణ్‌ జనతా పార్టీలో చేరి తిరిగి మళ్లీ 1996 ఏప్రిల్‌లో బీజేపీలో చేరారు. ఆయనకు కవిత్వమంటే మక్కువ. మొరుబొత్తాస్, రాణా ప్రతాప్, శేషఝలక్, అష్టశిఖ, మానసి పుస్తకాలను ఒరియాలో రచించారు. ఒక నాటికనూ రచించారు. చారిత్రక ప్రదేశాలను సందర్శించడం ఆయనకెంతో ఇష్టం.  

ప్రధాని మోదీకి కృతజ్ఞతలు
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌గా నియమించినందుకు విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి సోమవారం తనతో ఫోన్‌లో సంభాషించారని.. ‘మీరు ఒడిశా వీడాల్సి ఉంటుంది, ఒకట్రెండు రోజుల్లో మీకు గురుతర బాధ్యతల్ని కట్టబెడతా’నని ఆయన తనకు చెప్పినట్లు విశ్వభూషణ హరిచందన్‌ వివరించారు. అలాగే, ఏపీ గవర్నర్‌గా నియమితులైన విశ్వభూషణ హరిచందన్‌ను ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ మంగళవారం అభినందించారు. 

బయోడేటా
పుట్టిన తేదీ : 03–08–1934
తండ్రి పేరు : పరశురాం హరిచందన్‌
భార్య : సుప్రవ హరిచందన్‌
చదివినది : బీఏ (ఆనర్స్‌), ఎల్‌ఎల్‌బీ
వృత్తి : న్యాయవాది
ఆసక్తి : ప్రజల భాగస్వామ్యంతో అవినీతి, అన్యాయాలపై ఉద్యమాలు
సామాజిక కార్యకలాపాలు : సామాజిక, రాజ్యాంగ హక్కులపై పౌరులకు అవగాహన కల్గించడం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top