రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆందోళన
న్యూఢిల్లీ: వేగంగా అందుబాటులోకి వస్తున్న సాంకేతికత పోలీసింగ్ రూపురేఖల్నే మార్చివేస్తోందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. ప్రస్తుతం డిజిటల్ అరెస్ట్ నేరాలు పౌరులకు అత్యంత ప్రమాదకరమైనవిగా తయారయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. అణగారిన వర్గాల ప్రజలు ఇలాంటి వాటి బారినపడితే పోలీసులను తమకు సాయపడే ఏకైక మార్గంగా భావిస్తారన్నారు.
సోమవారం రాష్ట్రపతి భవన్‌తో తనను కలుసుకున్న ఐపీఎస్ ప్రొబేషనరీ అధికారుల బృందంతో రాష్ట్రపతి మాట్లాడారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మన దేశ ఆర్థిక వృద్ధి నిలకడగా కొనసాగించడానికి, వేగవంతం చేయడానికి మరింత పెద్ద ఎత్తున ప్రభుత్వ మరియు ప్రైవేట్ పెట్టుబడులు అవసరమని రాష్ట్రపతి అన్నారు. ఏ రాష్ట్రంలోగానీ, ప్రాంతంలోకి గానీ పెట్టుబడులను ఆకర్షించేందుకు అత్యవసరమైంది మెరుగైన శాంతి భద్రతలేనని తెలిపారు. ఈ విషయంలో ప్రభావవంతమైన పోలీసింగ్ వ్యవస్థ అవసరం ఎంతో ఉంటుందని ముర్ము చెప్పారు.
వికసిత్ భారత్ కల సాకారానికి భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే ఐపీఎస్ ప్రొబేషనరీలు కీలకంగా మారనున్నారని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికత కారణంగా పోలీసింగ్ వ్యవస్థ రూపురేఖలే మారిపోయాన్న రాష్ట్రపతి ముర్ము..పదేళ్ల క్రితం డిజిటల్ అరెస్ట్ అనే మాటను అర్థం చేసుకోవడం అసాధ్యంగా ఉండేదని, ఇప్పుడిది పౌరులపాలిట భయంకరమైన బెడదగా మారిందని చెప్పారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు భద్రతాధికారులు కృత్రిమ మేధ వంటి అత్యాధునిక సాంకేతికతను అలవర్చుకోవాల్సి ఉందన్నారు. అదే సమయంలో పోలీసులంటే భయపెట్టే వ్యవస్థగా కాకుండా సేవాభావం, సున్నితత్వం, సానుభూతితో పనిచేయాలని, ముఖ్యంగా సమాజంలోని అణగారిన వర్గాల భయాందోళనలను దూరం చేసి, అండగా నిలవాలని వారిని కోరారు. ప్రస్తుతం ఐపీఎస్ బ్యాచ్‌లోని 174 మంది ప్రొబేషనరీల్లో మహిళా అధికారులు అత్యధికంగా 62 మంది ఉండటంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు.


