భోజనం పెట్టేదెలా?

Bills Pending In Midday meals Schemes - Sakshi

జిల్లాలో 3,177 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు

2,49,798 మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్న వైనం

రెండు మాసాలుగా బిల్లులు పెండింగ్‌

రూ.15 కోట్లకుపైగా బకాయిలు

విడుదల చేయని ప్రభుత్వం అప్పుల్లో ఏజెన్సీ నిర్వాహకులు

సాక్షి, కృష్ణాజిల్లా, మచిలీపట్నం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల శాతం పెంచి నిరక్షరాస్యత నిర్మూలించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటుచేసింది. ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థుల వరకు మధ్యాహ్నం పాఠశాలలోనే భోజన వసతి కల్పించింది. భోజనం వండి పెట్టేందుకు వంట ఏజెన్సీలను నియమించింది. కొన్ని నెలలుగా ఏజెన్సీలకు బిల్లుల చెల్లింపులు సకాలంలో విడుదల చేయకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సిన దుస్థితి నెలకొంది. గతంలో ఆరు నెలల బిల్లులు పెండింగ్‌లో ఉండగా.. అనేక ఆందోళన అనంతరం విడుదల చేశారు. ప్రస్తుతం రెండు మాసాలకు సంబంధించి బకాయిలు పేరుకుపోవడంతో నిత్యావసరాల కొనుగోలు కష్టంగా పరిణమించిందని వాపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే..

జిల్లాలో మొత్తం 4,504 పాఠశాలలుండగా.. 3,117 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. 2,61.411 మంది విద్యార్థులున్నారు. వీరిలో 2,49,798 మంది భోజన పథకం ద్వారా లబ్ధిపొందుతున్నారు. జిల్లాలో 3,177 ఏజెన్సీలు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నాయి. వంట ఏజెన్సీలకు బియ్యం ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా అందిస్తోంది. ప్రాథమిక పాఠశాల విద్యార్థికి వంట ఖర్చు కింద రూ.6.48 పైసలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థికి రూ.8.53 పైసలు ప్రభుత్వం అందజేస్తోంది.

పేరుకుపోయిన బకాయిలు
ప్రభుత్వం బకాయిల విడుదలలో జాప్యం చేస్తుండడంతో ఏజెన్సీ నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు కొత్త అప్పులు పుట్టకపోవడంతో పథకం అమలుకు కష్టాలు పడుతున్నారు. జిల్లాలో వేలాది మంది దుర్భర జీవనం సాగిస్తున్నారు. జిల్లాలో వేలాది మందికి జులై నుంచి అక్టోబరు వరకు ప్రభుత్వం బిల్లులు అందాల్సి ఉంది. రెండు నెలలుగా వంట ఏజెన్సీలకు రూ.15 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది.

నిబంధనలతో కుదేలు
తాజాగా ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకానికి కొత్త నిబంధనలు తెరపైకి తెచ్చింది. నవంబరు 1వ తేదీ నుంచి కంది పప్పు, వంటనూనె సరఫరాను కాంట్రాక్టర్లు సరఫరా చేసేలా ఉత్తర్వులు వెలువరించింది. ఇందుకుగాను ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సంబంధించి కందిపప్పుకు రూ.1.38 పైసలు, నూనెకు రూ.0.58 పైసలు అంటే రూ.2.17 పైసలు వంట ఏజెన్సీలకు చెల్లించే బిల్లుల్లో మినహాయిస్తారు. ప్రాథమి కోన్నత, ఉన్నత పాఠశాలలకు సంబంధించి విద్యార్థికి కందిపప్పుకు రూ.2.07 పైసలు, నూనె కు రూ.0.87 పైసలు మొత్తం రూ.3.24 మినహాయిస్తారు. రూ.6.18 పైసలు చెల్లిస్తారు. కాంట్రాక్టర్లు సరఫరా చేసే నూనె బహిరంగ విపణిలో కంటే అధిక ధరకు అందజేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీనికితోడు లీటరు ప్యాకెట్‌కు 900 గ్రాములే ఉంటోందని ఆవేదన చెందుతున్నారు. తాము తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు.

అప్పు చేసి.. పప్పుకూడు
బిల్లులు సక్రమంగా అందకపోవడంతో అప్పులు చేసి మధ్యాహ్న భోజనాన్ని పెడుతున్నారు. మార్కెట్‌లో నిత్యావసరాల ధరలు పెరిగాయని, అన్నీ బయటే కొనుగోలు చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే బిల్లులతోనే కొనుగోలు చేయాల్సి ఉందని, క్రమం తప్పక బిల్లులు చెల్లిస్తే ఎలాంటి ఇబ్బంది రాకుండా భోజనం పెట్టగలమంటున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top