అనగనగా.. ఓ వంతెన!

Bezawada flyover works was nill - Sakshi

     మూడేళ్లుగా సా...గుతున్న బెజవాడ ఫ్లైఓవర్‌ పనులు

     ఏడాదిలోపే పూర్తి చేస్తామన్న ముఖ్యమంత్రి

     కనీసం వంతెన డిజైన్‌పైనా దృష్టి పెట్టని వైనం

     సమీక్షల పేరుతో కాలయాపన పనుల్లో పురోగతి మాత్రం నిల్‌

సాక్షి, అమరావతి బ్యూరో: ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి నిచ్చెన వేస్తా అందట! రాష్ట్ర ప్రభుత్వ తీరు మాటలు కోటలు దాటుతున్నా కాలు గడప దాటడం లేదు. విజయవాడలో కేవలం రూ.450 కోట్లతో పూర్తయ్యే కీలకమైన ఓ వంతెన నిర్మాణాన్నే మూడేళ్లు అవుతున్నా పూర్తి చేయలేని రాష్ట్ర సర్కారు.. రూ.లక్షల కోట్లతో అమరావతిని కడతామంటూ ఊహా చిత్రాలను ఆవిష్కరిస్తోంది! సీఎం చంద్రబాబు ఏడాదిలోపే పూర్తి చేస్తామన్న విజయ వాడ కనకదుర్గ ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు ఎక్కడివి అక్కడే మిగిలిపోవటం సర్కారు అసమర్థతకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటూ బెజవాడ నడిబొడ్డున మూడేళ్లుగా ఓ ఫ్లై ఓవర్‌ను నిర్మించలేకపోవటాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వాధినేత పరిపాలనా సామర్థ్యం ఏపాటిదో ఇట్టే అవగతమవుతోంది. 

పుష్కరాలు వచ్చాయి.. వెళ్లాయి
విజయవాడలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టిన కనకదుర్గ ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులకు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కారీ 2015 డిసెంబర్‌ 5వతేదీన శంకుస్థాపన చేశారు. 2016 ఆగస్టు పుష్కరాలనాటికి ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని నాడు సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. పుష్కరాలు వచ్చాయి వెళ్లాయి కానీ ఫ్లైఓవర్‌ నిర్మాణం 10 శాతం కూడా పూర్తి కాలేదు. ఆ తరువాత చంద్రబాబు 2016 డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తామన్నారు. అనంతరం గడువు 2017 ఆగస్టు 15 వరకు, తరువాత డిసెంబర్‌ 31వతేదీకి పొడిగించారు. చివరకు 2018 మార్చి 31  అన్నారు. అది కూడా పూర్తయి ఇప్పుడు మే నెల చివరికి వచ్చినా ఫ్లైఓవర్‌ పనులు పూర్తి కాలేదు. ఇప్పుడు ఇక ఎన్నికలకు ఏడాది లోపే సమయం ఉండటంతో 2019 జనవరి నాటికి పూర్తి చేస్తామంటూ మరోసారి మాయమాటలు చెబుతున్నారు.

డీపీఆర్‌ నుంచి డిజైన్‌ దాకా అలసత్వమే
కేంద్ర నిధులతో చేపట్టిన దుర్గ గుడి ఫ్లైఓవర్‌ పనులను పర్యవేక్షించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆది నుంచి నిర్లక్ష్య వైఖరినే ప్రదర్శిస్తూ వచ్చింది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండానే డీపీఆర్‌ను లోపభూయిష్టంగా తయారు చేశారు. ఫ్‌లై ఓవర్‌ నిర్మించే చోట భౌగోళిక స్వరూపం, పరిమితులను దృష్టిలో పెట్టుకోకుండా ఆషామాషీగా ఓ డిజైన్‌ రూపకల్పన పేరుతో సంవత్సరాల తరబడి సమయం వృథా చేసి దాన్ని ఆమోదించారు. అయితే తర్వాత మళ్లీ డిజైన్‌లో లోపాలు ఉన్నాయంటూ కొత్త వాటి పేరుతో మరి కొద్ది నెలలు కాలయాపన చేశారు.

ఇరుకు మార్గంలో ఆ డిజైన్‌తో కష్టమే
417 పైల్స్, 47 స్తంభాలు, 47 స్తంభాల పైకప్పులు (స్పైన్, వింగ్స్‌ కలిపి) ఫ్‌లై ఓవర్‌ నిర్మించేలా డిజైన్‌ రూపొందించారు. పనులు ప్రారంభమైన కొన్నాళ్లకు ఆ డిజైన్‌తో నిర్మాణం సాధ్యం కాదని గుర్తించారు. దాదాపు 140 టన్నుల చొప్పున బరువు ఉండే ఒక్కో పైకప్పును స్తంభాలపైకి చేర్చడం అసాధ్యమని ఇంజనీర్లు చేతులెత్తేశారు. కేవలం మైదాన ప్రాంతాల్లో నిర్మాణాలకే అది సాధ్యమని, ఇరుకుగా ఉండే దుర్గ గుడి మార్గంలో అసాధ్యమని నిపుణులు తేల్చేశారు. దీంతో 2016 జూన్‌లో ఎట్టకేలకు కొన్ని మార్పులతో డిజైన్‌ను ఆమోదించారు. అయితే వెంటనే మేల్కొని డిజైన్‌లో మార్పులు చేసి ఉంటే పనులు వేగంగా జరిగేవి. ఆ పని చేయకుండా సమీక్షల పేరుతో కాలయాపన చేశారు. సీఎం స్వయంగా 15 రోజులకు ఒకసారి సమీక్ష జరిపిన ఫ్లై ఓవర్‌ పనులే ఇలా ఉంటే ఇక రాజధాని కట్టడానికి ఎన్ని శతాబ్దాల సమయం పడుతుందో? అని బెజవాడ వాసులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. 

మార్చిన డిజైన్‌లోనూ లోపాలు!
మార్పుల అనంతరం ఖరారు చేసిన డిజైన్‌ కూడా లోపభూయిష్టంగానే ఉందని ఇంజనీరింగ్‌ నిపుణులు పేర్కొంటున్నారు. ఫ్‌లై ఓవర్‌ మీద ఆరు మలుపుల్లో మూడు అత్యంత ప్రమాదకరమైనవని హెచ్చరిస్తున్నారు. ఫలితంగా ఫ్‌లై ఓవర్‌పై రోడ్డు ప్రమాదాలు సంభవించే అవకాశాలున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.

బిల్లుల చెల్లింపుల్లోనూ తీవ్ర జాప్యం
ఒకవైపు డీపీఆర్, డిజైన్లపై కనీస శ్రద్ధ చూపని రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు బిల్లుల చెల్లింపుల్లోనూ అంతులేని జాప్యాన్ని ప్రదర్శించింది. కేంద్ర ప్రభుత్వం సూచించినట్లుగా కనీసం గ్యారెంటీ ఇస్తే ఈపాటికి పనులు జరిగి ఉండేవి. ఈ బాధ్యతను సైతం చంద్రబాబు సర్కారు పట్టించుకోకపోవటం గమనార్హం. 

యాత్రలు, సదస్సులకు రూ.వందల కోట్లు 
ప్రత్యేక విమానాలు, విదేశీ యాత్రలు, సదస్సుల పేరుతోప్రచార ఆర్భాటం కోసం రూ.వందల కోట్ల ప్రజా ధనాన్ని వృథా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన దుర్గ గుడి ఫ్లై ఓవర్‌ నిర్మాణాన్ని గాలికి వదిలేయటంతో ట్రాఫిక్‌ కష్టాలతో అల్లాడుతున్నారు. ఫ్‌లై ఓవర్‌ నిర్మాణానికి నిధులు విడుదల చేస్తే తరువాత కేంద్రం తిరిగి ఇస్తామంటున్నా ముందుకు రాకపోవటంతో పనులు మూడేళ్లుగా నత్త నడకను తలపిస్తున్నాయి. అసలు ఎప్పటికి పూర్తవుతుందో కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. 

‘సింగపూర్‌ తరహా రాజధాని నిర్మిస్తాం... అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో కడతాం’
– ఇదీ నాలుగేళ్లుగా సీఎం చంద్రబాబు గ్రాఫిక్స్‌లో చూపిస్తున్న సినిమా

హైదరాబాద్‌ నుంచి విజయవాడకు 4 గంటల్లోనే చేరుకోవచ్చు. కానీ నగరంలోని బస్టాండ్‌కు వెళ్లాలంటే గంటపైనే పడుతోంది. కీలకమైన కనకదుర్గ ఫ్లైఓవర్‌ నిర్మాణం మూడేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. పలు ప్రాంతాల నుంచి విజయవాడ చేరు కునేందుకు ఇదే కీలక దారి కావటంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. 
– రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు ఇది కాదా తార్కాణం?

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top