దాయాదుల పోరుపై బెట్టింగ్‌ల జోరు | Betting on a rally fighting cousins | Sakshi
Sakshi News home page

దాయాదుల పోరుపై బెట్టింగ్‌ల జోరు

Mar 19 2016 1:24 AM | Updated on Sep 3 2017 8:04 PM

క్రికెట్ బెట్టింగ్‌ల జోరు మళ్లీ మొదలైంది. చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న భారత్-పాకిస్తాన్‌ల మధ్య టీ 20 క్రికెట్ ప్రపంచకప్ మ్యాచ్ శనివారం జరగనుంది.

విజయవాడ :  క్రికెట్ బెట్టింగ్‌ల జోరు మళ్లీ మొదలైంది. చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న భారత్-పాకిస్తాన్‌ల మధ్య టీ 20 క్రికెట్ ప్రపంచకప్ మ్యాచ్ శనివారం జరగనుంది. దీంతో అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో బంతి బంతికీ మ్యాచ్ ఫలితంపై బెట్టింగ్‌లు నిర్వహించడానికి నగరంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లాలోనూ పలుచోట్ల బుకీలు బెట్టింగ్‌లకు ఏర్పాట్లు చేశారు. పలుచోట్ల లాడ్జీలు, రియల్ ఎస్టేట్ ఆఫీసు కార్యాలయాలను ఇందుకు వేదికగా చేసుకున్నట్లు సమాచారం. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రారంభమయ్యే మ్యాచ్ హడావుడిని భారీగా సొమ్ము చేసుకోవడానికి ఇప్పటికే ఆన్‌లైన్‌లో బెట్టింగ్ వివరాలు అందుబాటులో ఉంచటం గమనార్హం. 20 ఓవర్ల పరిమిత మ్యాచ్‌లో ఒక్కరోజే దాదాపు రూ.100 కోట్లపైనే బెట్టింగ్ జరిగే అవకాశముందని తెలుస్తోంది.

బెట్టింగ్‌లో భారత్ హాట్ ఫేవరెట్‌గా ఉన్నట్లు సమాచారం. విజయవాడలో కృష్ణలంక, సింగ్ నగర్, పటమట తదితర ప్రాంతాల్లో బెట్టింగ్‌లు అధికంగా జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆయా పరిధిలోని సర్కిల్ ఇన్‌స్పెక్టర్లతో పాటు టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూడా బెట్టింగ్ రాయుళ్లపై దృష్టి సారించారు. గతంలో నమోదైన కేసుల ఆధారంగా కీలక బుకీల కదలికలపై నిఘా ఉంచారు.

కృష్ణలంకలో బెట్టింగ్ ముఠా అరెస్టు
విజయవాడ : కృష్ణలంకలోని ఓ ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. భ్రమరాంబపురం కాలనీలోని మలేరియా హాస్పిటల్ సమీపంలో గల ఓ ఇంట్లో బెట్టింగులకు పాల్పడుతున్న ఆరుగురు వ్యక్తులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఓ టీవీ, ఆరు మొబైల్ ఫోన్లు, రూ.19 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ టీమ్-2 మురళీధర్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ సురేష్‌రెడ్డి, సిబ్బంది ఈ దాడి నిర్వహించారు. నిందితులను కృష్ణలంక పోలీసులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement