అది ఆగ స్టు 17వ తేదీ. ఆ రోజు బాసరకు చెందిన వ్యాపారి అశోక్, ఆయన భార్య సువర్ణ, కొడుకు మణికంఠ దారుణంగా హత్యకు గురయ్యారు.
మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : అది ఆగ స్టు 17వ తేదీ. ఆ రోజు బాసరకు చెందిన వ్యాపారి అశోక్, ఆయన భార్య సువర్ణ, కొడుకు మణికంఠ దారుణంగా హత్యకు గురయ్యారు. నలుగురిపై దుండగులు విచక్షణారహితంగా కత్తులతో దాడిచేయగా.. అందులో నుంచి ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. ఆగస్టు 18వ తేదీ. మంచిర్యాలలోని శ్రీశ్రీనగర్‌లో నివాసం ఉంటున్న దేవి దుర్గమ్మ, ఆమె కొడుకు రవీందర్‌లను దారుణంగా హతమార్చారు. వరుసగా చోటు చేసుకున్న ఈ రెండు సంఘటనలతో జిల్లా ప్రజలు బెంబేలెత్తిపోయారు. రోజుల తరబడి కంటి మీద కునుకు లేకుండా గడిపారు.
ఎట్టకేలకు దొరికిన ఆచూకీ..
వరుస దోపిడీ హత్యల కేసులను సవాల్‌గా తీసుకున్న పోలీసులూ నిందితులను పట్టుకోవడం లో అంతే కృషి చేశారు. వారిని పట్టుకునేందుకు ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి మంచిర్యాల, బాసర సీఐలు రవీందర్‌రెడ్డి, మహేశ్‌లతో కూడిన రెండు బృందాలు ఏర్పాటు చేశారు. మహారాష్ట్రకు చెందిన ముఠా పనే అయి ఉంటుందని ఆ దిశగా కూపీ లాగారు. మహారాష్ట్రలో విచారణ సైతం చేశారు. ఎట్టకేలకు నిందితుల ఆచూకీ దొరకడంతో ఊపిరిపీల్చుకున్నారు.
కరుడుగట్టిన హంతకులు..
మహారాష్ట్రకు చెందిన కరుడుగట్టిన హంతకుల ముఠా ఈ దారుణాలకు పాల్పడింది. బీడ్ జిల్లా కోద్‌గావ్ గ్రామానికి చెందిన బాలాజీ పండిత్, చత్రీయ శిర్‌గాజీ షిండే, పర్బని జిల్లా సాయికేడ్‌కు చెందిన కల్యాణ్ జయపూల్యా అలియాస్ షేక్ సలీం, సాయికేడ్‌కు చెందిన మిట్టుబాపురావు అలియాస్ రాములు ఈ హత్యలు చేశారు. కరుడు గట్టిన హంతకుడు బాలాజీ ఈ ముఠాకు నాయకుడు కాగా.. అతనిపై మహారాష్ట్రలో 23 కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. 15 రోజుల క్రితం మేడ్చల్ పరిధిలో మరో దోపిడీకి పాల్పడుతుండగా.. అక్కడి పోలీసులు కల్యాణ్, మిట్టులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారు చర్లపల్లి జైలులో ఉండగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
పోలీసుల అదుపులో నిందితుడి తల్లి..
నిందితుల్లో ఒకడైన కల్యాణ్ తల్లి జహీరతిని శనివారం పోలీసులు బాసర రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. కొడుకు అరెస్టు విషయం తెలుసుకున్న ఆమె.. జైల్లో ఉన్న కొడుకును కలిసేందుకు వెళ్తుండగా జిల్లా పోలీసులకు అందిన సమాచారం మేరకు పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి బాసర, మంచిర్యాలలో దొంగిలించిన కుంకుమ భరణి, సెలఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఇలా దొరికారు..
నిందితులు దొరికిన విధానంపై మంచిర్యాల, బాసర సీఐలు శనివారం వివరాలు వెల్లడించారు. మంచిర్యాలలోని సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వారు మాట్లాడారు. వారు తెలిపిన వివరాలు.. నిందితుల కోసం మహారాష్ట్ర, కర్ణాటకలోని బీదర్‌లో వెతికారు. చివరకు మహారాష్ట్రలోని పర్బని జిల్లాకు చెందిన నలుగురు పార్దీ తెగకు చెందిన ముఠా సభ్యులే ఈ హత్యలు చేశారని గుర్తించారు. బాసరలో హత్యకు పాల్పడిన వీరు.. తదుపరి వ్యాపారి కారులోనే మంచిర్యాలకు చేరుకున్నారు. మరుసటి రోజే అక్కడ తల్లీకొడుకుని హత్య చేశారు. అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తూ జహీరాబాద్ వద్ద కారును వదిలారు. అక్కడి నుంచి మహారాష్ట్ర చేరారు. మరికొన్ని రోజుల తర్వాత కల్యాణ్, బాపురావు సుమో కిరాయికి తీసుకుని మేడ్చల్‌లో దొంగతనానికి పాల్పడి ఇద్దరిని గాయపర్చారు. స్థానికుల చొరవతో వారు అక్కడే పట్టుబడ్డారు. నిందితుల్లోని కల్యాణ్ తల్లిని బాసరలో అదుపులోకి తీసుకోగా ఆమె ఈ వివరాలు వెల్లడించిందని చెప్పారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామని వివరించారు.