మూన్నాళ్ల ముచ్చటగా బడికొస్తా

Badikosta Scheme Delayed In YSR kadapa - Sakshi

అటకెక్కిన బాలికల సైకిళ్ల పంపిణీ  

విద్యార్థినులకు తప్పని ఇబ్బందులు

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేసేందుకుటీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘బడికొస్తా’ పథకం మూన్నాళ్ల ముచ్చటగా మారింది.దూర ప్రాంతాల నుంచి పాఠశాలలకు నడిచి వచ్చే బాలికలు.. దూరం కారణంగా బడిమాని వేయకూడదనే ఉద్దేశంతో 9వ తరగతి చదివే విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేయాలని భావించింది. ఏటా సైకిళ్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ఆచరణలో మాత్రం శూన్యం.

కడప ఎడ్యుకేషన్‌: రాష్ట్రం ప్రభుత్వం 2016–17లో 9వ తరగతి బాలికలకు ‘బడికొస్తా’ పథకం కింద సైకిళ్లను పంపిణీ చేసింది. తరువాత దీని  గురించి పట్టించుకోకపోవడంతో మారుమూల గ్రామాల్లోని విద్యార్థినులకు బడికి రాకపోకలు కష్టంగా మారాయి.

మొదటి సంవత్సరం జిల్లా వ్యాప్తంగా  9297 మంది బాలికలకు సైకిళ్లను పంపిణీ చేశారు.  ఈ ఏడాది పాఠశాలలు ప్రారంభమైæ నాలుగు  నెలలు దాటినా ఇంత వరకు సైకిళ్లు ఇవ్వలేదు జిల్లావ్యాప్తంగా వేలమంది బాలికలకు ఎదురు చూపులు తప్పడం లేదు.  రవాణా సదుపాయలు సరిగాలేక, ప్రభుత్వంసైకిళ్లు కూడా ఇవ్వకపోవడంతో వారు రోజూ స్కూలుకు రావడానికి అవస్థలు పడుతున్నారు.

పాఠశాలల వివరాలు ఇలా :జిల్లాలో 3225 పాఠశాలలు ఉన్నాయి.ఉన్నత పాఠశాలలు 391 ఉన్నాయి. వీటిలో  19,100 మంది  8,9 తరగతులు చదువుతున్నారు. వీరందరికి ప్రభుత్వం సైకిళ్లను పంపిణీ చేయాల్సి ఉంది. విద్యా సంవత్సరం  సగం పూర్తయినా సైకిళ్లు రాలేదు.దీంతో ఈ ఏడాది ఇస్తారా..లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై విద్యాశాఖాధికారులను అడిగిదే జాబితాను ప్రభుత్వానికి పంపామని సైకిళ్లు ఎప్పడొస్తాయో  తెలియదని సమాధానం చెబుతున్నారు.  ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరగా  సైకిళ్లు పంపిణీ  చేయాలని కోరుతున్నారు.

సందిగ్ధత:ఈ ఏడాది 8,9 తరగతులకు సైకిళ్లు ఇస్తామని చెప్పి విద్యాశాఖ అధికారులను వివరాలు అడిగారు. ఇప్పడేమో 9వ తరగతికే ఇస్తామని అంటున్నట్లు తెలిసింది. 9వ తరగతి విద్యార్థులకు ఇవ్వవలసి వస్తే 9471 మంది విద్యార్థులు ఉన్నారు.

త్వరగా సైకిల్‌ ఇవ్వాలి
నాపేరు రంగవేణి. మాది నగర శివార్లలోని వైఎస్సార్‌కాలనీ. నేను మున్సిపల్‌ హైస్కూల్‌ మొయిన్‌లో 9వ తరగతి చదువుతున్నాను.రోజు రూ. 30 పెట్టి ఆటోలో పాఠశాలకు   వస్తున్నా. కష్టంగా ఉంది. ప్రభుత్వం త్వరగా సైకిల్‌ ఇస్తే బాగుంటుంది.      – రంగవేణి, 9వ తరగతి.

వర్షాకాలంలో ఇబ్బందులు
మాది నగరంలోని ముత్యంజయకుంట. మేము అక్కచెల్లెళ్లం ఇద్దరం కలిసి ఒకే సైకిళ్లో పాఠశాలకు వస్తాం. వర్షాకాలంలో రావాలంటే ఇబ్బంది ఉంటుంది.ప్రభుత్వం సైకిల్‌ ఇస్తే బాగుంటుంది.
    – షబీనా, 9వతరగతి. మున్సిపల్‌ హైస్కూల్‌ మొయిన్‌.

సైకిళ్లు రాగానే ఇస్తాం
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినులకు సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి పంపాం. ప్రభుత్వం నుంచి సైకిళ్లు రాగానే పంపిణీ చేస్తాం.–  పి ౖశైలజ, జిల్లా విద్యాశాఖ అధికారి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top