ఏయూ డిగ్రీ పేపర్‌ లీక్‌ | AU Degree Question paper leakage through whatsapp | Sakshi
Sakshi News home page

ఏయూ డిగ్రీ పేపర్‌ లీక్‌

Mar 16 2017 11:18 PM | Updated on Sep 5 2017 6:16 AM

లీకైన ప్రశ్న పత్రం

లీకైన ప్రశ్న పత్రం

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో (ఏయూ) జరుగుతున్న డిగ్రీ మూడో సంవత్సర గణిత ప్రశ్నపత్రం లీకైంది.

వాట్సాప్‌లో ప్రత్యక్షమైన గణిత ప్రశ్నపత్రం
పరీక్షను రద్దు చేసిన అధికారులు

విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో (ఏయూ) జరుగుతున్న డిగ్రీ మూడో సంవత్సర గణిత ప్రశ్నపత్రం లీకైంది. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు జరగాల్సిన గణితం పేపర్‌ 3 లీనియర్‌ ఆల్జీబ్రా ప్రశ్నపత్రం ముందుగానే బయటకు పొక్కింది. ఇది వాట్సాప్‌లో విద్యార్థుల మధ్య పంపిణీ జరిగినట్లు తెలిసింది. విషయం తెలిసిన వెంటనే పరీక్షను రద్దు చేస్తున్నట్లు రిజిస్ట్రార్‌ ప్రకటించారు. ప్రశ్నపత్రం లీకైందనే సమాచారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో మీడియా సంస్థలకు అందింది. దీన్ని సరిచూసుకోవడానికి ఆ ప్రశ్నపత్రాన్ని ఏయూ అధికారులకు పంపారు. కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ నేతృత్వంలో అధికారులు వాట్సాప్‌లో వచ్చిన ప్రశ్నపత్రాన్ని కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌లో ఉన్న అసలు ప్రశ్నపత్రంతో సరిచూశారు.

ప్రశ్నలు, ప్రశ్నపత్రం కోడ్‌ సరిపోవడంతో వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. మధ్యాహ్నం 2 గంటలకు జరగాల్సిన పరీక్షను వెంటనే రద్దు చేస్తున్నట్లు రిజిస్ట్రార్‌ ఆచార్య వి.ఉమామహేశ్వరరావు ప్రకటించారు. పరీక్షల విభాగం అధికారులు ఈ సమాచారాన్ని ఇతర కళాశాలలకు అందించినప్పటికీ దాదాపు అన్ని కళాశాలల్లో అప్పటికే బండిల్స్‌ తెరిచారు. ఇక చేసేది లేక ప్రశ్నపత్రాలను తిరిగి తమకు పంపాలని ఆదేశించారు. ప్రత్యేక పరిశీలకులను పరీక్షలు జరుగుతున్న కేంద్రాలకు పంపారు. కేవలం గణిత ప్రశ్నపత్రం ఒక్కటే బయటకువచ్చిందా, మరికొన్ని కూడా వచ్చాయా అనే దిశగా అధికారులు పరిశీలిస్తున్నారు.

ప్రశ్నపత్రం ఎలా బయటకు వచ్చిందనే విషయంపై ఆరాతీస్తున్నారు. వర్సిటీ పరీక్షల విభాగం నుంచి బయటకు వచ్చిందా, అనుబంధ కళాశాలల నుంచి వచ్చిందా అనేది తేలాల్సి ఉంది. ‘గణితం ప్రశ్నపత్రం రద్దు చేశాం. తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తాం. ప్రశ్నపత్రం లీక్‌పై పూర్తి స్థాయి విచారణ జరుపుతాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’ అని రిజిస్ట్రార్‌ వి. ఉమామహేశ్వరరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement