నవశకానికి నాంది

Assembly approval of six crucial bills - Sakshi

కీలకమైన ఆరు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం 

సీఎం వైఎస్‌ జగన్‌ చొరవతో సామాజిక విప్లవం దిశగా అడుగులు

రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలు సగర్వంగా తలెత్తుకున్నాయి.. సాధికారికత ఉట్టి పడుతుండగా మహిళలు ఆత్మగౌరవంతో తొణికిసలాడారు.. ఇక ఉపాధికి ఢోకా లేదంటూ యువతకు భవితపై భరోసా వచ్చింది.. ఇదంతా ఎన్నో ఏళ్ల కల.. ఎన్నాళ్లుగానో ఆరాటం.. అలుపెరగని పోరాటం.. వాటన్నింటినీ ఒక్కసారిగా నిజం చేసి చూపించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. ఆ కలను ఒక్క రోజులో సాకారం చేసి అద్భుతాన్ని ఆవిష్కరించి మన కళ్లముందు నిలిపారు.. ఈ అద్భుత చారిత్రక ఘట్టానికి రాష్ట్ర శాసససభ వేదికగా నిలిచింది.. రాష్ట్రంలో కొత్త చరిత్రకు తెరలేచింది..

సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల హామీల అమలుకు వడివడిగా అడుగులు వేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ తన మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు దాదాపు 60 శాతం పదవులు కేటాయించి దేశం దృష్టిని ఆకర్షించిన ఆయన మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నిజమైన రాజకీయ అధికారం, ఆర్థిక స్వావలంబన కల్పిస్తూ విధాన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో అన్ని నామినేటెడ్‌ పదవుల్లో ఈ వర్గాలకు 50 శాతం పదవులు కేటాయించే బిల్లును సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు. ఇక నుంచి రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు భర్తీ చేయబోయే అన్ని రకాల నామినేటెడ్‌ పదవుల్లో ఆ వర్గాలు కచ్చితంగా 50 శాతం పదవులు దక్కించుకుంటాయి. దీంతో అన్ని స్థాయిల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు రాజకీయంగా ప్రబల శక్తిగా రూపాంతరం చెందడం ఖాయం. అదే విధంగా ఈ వర్గాల ఆర్థిక స్వావలంబన సాధన దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో నామినేషన్లపై ఇచ్చే అన్ని పనుల్లో 50 శాతం ఆ వర్గాలకే ఇవ్వాలని ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును శాసనసభ ఆమోదించడం ఆ వర్గాలకు తీపి కబురే. నామినేషన్లపై ఇచ్చే పనులు, సర్వీసుల్లో సగం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చేలా చట్టం రూపొందడం ఆ వర్గాల అభ్యున్నతికి మార్గం సుగమం చేసింది. 

నిజమైన మహిళా సాధికారికతకు శ్రీకారం 
మహిళల రాజకీయ అధికారం, ఆర్థిక స్వాతంత్య్రం దిశగా ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌ కీలక విధాన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి రాష్ట్రంలో భర్తీ చేయనున్న అన్ని నామినేటెడ్‌ పదవులు, నామినేటెడ్‌ పనుల్లో సగం అంటే 50 శాతం మహిళలకేనని తేల్చి చెప్పారు. అందుకోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు శాసనసభ సోమవారం ఆమోదించడం శుభపరిణామం. దీంతో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని పదవుల్లోనూ సగం మహిళలే దక్కించుకోనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేటాయించే నామినేటెడ్‌ పదవులు, పనులలో 50 శాతంతో పాటు ఇతర జనరల్‌ విభాగంలోని నామినేటెడ్‌ పదవులు, పనుల్లోనూ 50 శాతం మహిళలకు కేటాయించడం కొత్త చరిత్రే. నిజమైన మహిళా సాధికారికత అంటే ఏమిటో తెలుసుకోవాలంటే దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూడాల్సిందే. 

చట్టబద్ధంగా బీసీ హక్కుల పరిరక్షణ
మరో సామాజిక విప్లవానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మన రాష్ట్రాన్ని వేదికగా మార్చారు. బీసీల హక్కుల పరిరక్షణకు చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్రంలో శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ ఏర్పాటు చేసేందుకు శాసనసభలో బిల్లును ప్రవేశ పెట్టడం శుభపరిణామం.  ఇకపై ఎక్కడైనా సరే బీసీ హక్కులకు భంగం వాటిల్లితే బీసీ కమిషన్‌ బాధితులకు అండగా నిలుస్తుంది. మరోవైపు ఉపాధి కల్పన కల కాదని నిరూపిస్తూ రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలన్న బిల్లును శాసనసభ సోమవారం ఆమోదించడం ఉద్యోగాల విప్లవాన్ని సృష్టించనుంది. ఈ విధంగా కీలకమైన ఆరు బిల్లులను శాసనసభలో ఆమోదింపజేయడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలో కొత్త అధ్యాయానికి నాంది పలికారు.  

సాధికారత దిశగా..
రాష్ట్ర చరిత్రలో తొలిసారి మహిళలకు సీఎం వైఎస్‌ జగన్‌ సర్కార్‌ అగ్రతాంబూలం
రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ప్రభుత్వ నామినేటెడ్‌ పదవుల్లో, నామినేటెడ్‌ పనుల్లో 50 శాతం చొప్పున మహిళలకే కేటాయిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన రెండు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టింది. రాష్ట్ర జనాభాలో సగం మంది మహిళలే ఉన్నప్పటికీ విధాన నిర్ణయాలు తీసుకునే సంస్థల్లో వారికి తగిన ప్రాతినిధ్యం లేకపోవడంతో సమాన అవకాశాలు వారికి దక్కడం లేదు. మహిళా సాధికారతను సాధించాలంటే జనాభాలో సగం ఉన్న అతివలను అందలం ఎక్కించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సామాజిక న్యాయం చేకూర్చడంతోపాటు మహిళలకూ సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా బిల్లులను రూపొందించారు. ఇందులో భాగంగా అన్ని ప్రభుత్వ నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్‌ కల్పిస్తూ ఒక బిల్లును, అలాగే అన్ని నామినేటెడ్‌ పనుల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన మరో బిల్లును బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎం.శంకర్‌ నారాయణ సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు నామినేటెడ్‌ పదవులు, నామినేటెడ్‌ పనుల్లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పించే బిల్లులో ఆయా వర్గాల మహిళలకు కూడా 50 శాతం ఇవ్వడంతోపాటు మిగతా 50 శాతం నామినేడెట్‌ పదవులు, నామినేటేడ్‌ పనుల్లో కూడా మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించడంతో జనాభాలో సగం ఉన్న మహిళలకు మొత్తం మీద 50 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లైంది. 

అతివలకు జై..
అన్ని కార్పొరేషన్లు, ఏజెన్సీలు, సంస్థలు, బోర్డులు, సొసైటీలు, కమిటీల పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. అలాగే వీటి చైర్‌పర్సన్‌ పదవుల్లోనూ 50 శాతం మహిళలకే కేటాయిస్తారు. అదేవిధంగా డైరెక్టర్లు, సభ్యుల్లో కూడా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు. దేవాదాయ చట్టం పరిధిలోని బోర్డులు, చారిటబుల్‌ ట్రస్టులు, వక్ఫ్‌ బోర్డు పరిధిలోని పదవులకు ఈ రిజర్వేషన్లు వర్తించవని స్పష్టం చేశారు. అన్ని నామినేటెడ్, కాంట్రాక్టు పనులు, నామినేటెడ్‌ సర్వీసు పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తారు.ఇంజనీరింగ్‌ విభాగాలు, పరిపాలన విభాగాల నామినేటెడ్‌ పనులన్నింటిలోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి.

మహిళలకు అందలం
బిల్లులు
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సహా మహిళలందరికీ నామినేటెడ్‌ పదవులు, నామినేటెడ్‌ పనుల్లో 50%

ఉద్దేశం
మహిళా సాధికారతను సాధించడం, జనాభాలో సగం ఉన్న మహిళలకు కూడా సమాన అవకాశాలు కల్పించడం

ప్రధాన అంశాలు
అన్ని కార్పొరేషన్లు, ఏజెన్సీలు, సంస్థలు, బోర్డులు, సొసైటీలు, కమిటీల పదవుల్లో 50 శాతం మహిళలకే, చైర్‌పర్సన్‌ పదవుల్లో కూడా 50 శాతం రిజర్వేషన్‌. అదేవిధంగా జనరల్‌ మహిళల రిజర్వేషన్‌ ఇదే రీతిలో వర్తింపు

మినహాయింపు 
దేవదాయ చట్టం పరిధిలోని బోర్డులు, చారిటబుల్‌ ట్రస్టులు, వక్ఫ్‌ బోర్డు పరిధిలోని పదవులకు రిజర్వేషన్లు వర్తించవు

స్థానికులకే పట్టం
బిల్లు
పరిశ్రమలు, ఫ్యాకర్టీల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే..

ఎవరికి ప్రయోజనం
పరిశ్రమలు, ఫ్యాక్టరీల కోసం తమ భూములు ఇచ్చి జీవనోపాధిని, ఆదాయాన్ని కోల్పోతున్నవారికి, స్థానిక యువతకు..

బిల్లులో ప్రధాన అంశాలు
కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమలు, ఫ్యాకర్టీల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలి. దీంతోపాటు ఇప్పటికే ఉన్నవి కూడా మూడేళ్లలో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాల్సి ఉంటుంది. స్థానికులకు తగిన అర్హత లేకపోతే శిక్షణ ఇచ్చి మరీ ఉద్యోగం ఇవ్వాల్సి ఉంటుంది. 

బీసీలకు బాసట
బిల్లులు
శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ ఏర్పాటు బిల్లు,ప్రభుత్వ నామినేటెడ్‌ పదవుల్లో, నామినేటెడ్‌ పనుల్లో బీసీలకు 29 శాతం రిజర్వేషన్‌ వర్తింపు

లక్ష్యం
వెనుకబడిన వర్గాలను అన్ని రకాలుగా బలోపేతం చేయడం, వారి అభ్యున్నతికి, సాధికారతకు కృషి చేయడం

బీసీ కమిషన్‌లో ఎవరెవరు ఉంటారంటే
చైర్మన్‌గా హైకోర్టు న్యాయమూర్తి, సభ్యులుగా ఒక సామాజిక శాస్త్రవేత్త, వెనుకబడిన వర్గాల
సమస్యలపై అవగాహన ఉన్న మరో ఇద్దరు నిపుణులు, సభ్య కార్యదర్శిగా ప్రభుత్వ కార్యదర్శి.

బీసీ కమిషన్‌ ప్రధాన విధులు
బీసీల సాధికారత, అభ్యున్నతికి సంబంధించిన అన్ని అంశాలను చూస్తుంది. కుల ధ్రువీకరణ పత్రాల దగ్గర నుంచి బీసీల్లో అత్యంత వెనుకబడిన వర్గాలను గుర్తించడం, గ్రూపుల్లో చేర్పులు, మార్పుల తదితర అంశాలపై పనిచేస్తుంది. బీసీలపై జరిగే వేధింపులు కూడా కమిషన్‌ పరిధిలోకే వస్తాయి. బీసీల సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సిఫారసులు చేయడం, విద్యా ప్రవేశాల్లో, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్‌ పాటించకపోతే ప్రభుత్వం దృష్టికి తేవడం, బీసీల సామాజిక, ఆర్థిక, విద్య స్థితిగతులపై ఎప్పటికప్పుడు సర్వేలు, అధ్యయనాలు, ప్రజాభిప్రాయ సేకరణలు చేయడం, బీసీలకు అన్ని రంగాల్లో రక్షణ 
చర్యలు తీసుకోవడం, తదితర అంశాలు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top