విజయవాడ ఎయిర్‌పోర్టులో ఏర్పాట్లు పూర్తి | Arrangements are being made at Vijayawada Airport | Sakshi
Sakshi News home page

విజయవాడ ఎయిర్‌పోర్టులో ఏర్పాట్లు పూర్తి

May 24 2020 5:07 AM | Updated on May 24 2020 5:07 AM

Arrangements are being made at Vijayawada Airport - Sakshi

గన్నవరం: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం తిరిగి సేవలందించేందుకు సిద్ధమవుతోంది. లాక్‌డౌన్‌ వల్ల గత రెండు నెలలుగా నిలిచిపోయిన దేశీయ విమాన సర్వీసులు ఈ నెల 25 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. తొలుత పరిమిత సంఖ్యలో విమానాలు నడిపేందుకు ఎయిర్‌లైన్స్, ఎయిర్‌పోర్ట్‌ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దేశీయ విమాన సేవల కోసం ఎయిర్‌పోర్టులోని ట్రాన్సిట్‌ టెర్మినల్‌ను సిద్ధం చేశారు. ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా టెర్మినల్‌లోని ఎరైవల్, డిపార్చర్‌ బ్లాకుల్లో బోర్డింగ్‌ కౌంటర్లు, కన్వేయర్‌ బెల్ట్స్‌ వద్ద మార్కింగ్‌లు ఏర్పాటు చేశారు. మాస్కులు ధరించిన ప్రయాణికులను మాత్రమే ఎయిర్‌పోర్టులోకి అనుమతించనున్నారు.
విజయవాడ ఎయిర్‌పోర్టు టెర్మినల్‌ భవనం 

వారికి థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయడంతో పాటు చేతులను శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్లను అందుబాటులో ఉంచుతున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ నిర్ధేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా సర్వీసులు నడుస్తాయి. ముందుగా న్యూఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైకు మాత్రమే ఇక్కడి నుంచి విమాన సర్వీస్‌లు అందుబాటులోకి రానున్నాయి. స్పైస్‌ జెట్‌ సంస్థ బెంగళూరు నుంచి విజయవాడకు మంగళవారం ఒకటి, మిగిలిన రోజుల్లో రెండు సర్వీస్‌లు చొప్పున నడపనుంది. ఇండిగో సంస్థ రోజుకు ఒకటి చొప్పున హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకు సర్వీస్‌లను ప్రకటించగా, ఎయిరిండియా న్యూఢిల్లీ నుంచి ఇక్కడికి రాత్రి సర్వీస్‌ను మాత్రమే నడపనుంది. ట్రూజెట్‌ సంస్థ కడపకు 26వ తేదీ నుంచి సర్వీసు ప్రారంభించనుంది. ఈ సర్వీసులకుగాను ఇప్పటికే ఆయా విమాన సంస్థలు టికెట్ల బుకింగ్‌ 
మొదలుపెట్టాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement