
కనీస వేతనాలకు నోచుకోని ఆరోగ్యశ్రీ సిబ్బంది
డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదల ప్రాణాలను కాపాడి వారికి ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలు అందించేందుకు 2007లో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు...
- విధులు పెరిగినా పెరగని వేతనాలు
గుంటూరు మెడికల్: డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదల ప్రాణాలను కాపాడి వారికి ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలు అందించేందుకు 2007లో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాలో ఈ పథకం 2008 నుంచి అమలులో ఉంది. పథకాన్ని సమర్ధంగా అమలు చేసేందుకు జిల్లాలో 114 మంది నెట్‌వర్క్ మిత్రాలు, 87 మంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మిత్రాలు, పదిమంది నెట్‌వర్క్ టీమ్‌లీడర్స్, ఇద్దరు ఆఫీస్ అసోసియేట్స్, ఒక జిల్లా మేనేజరు, ఒక జిల్లా కో ఆర్డినేటర్ పనిచేస్తున్నారు. రోగి ఆసుపత్రికి వచ్చినప్పటి నుంచి తిరిగి అతను కోలుకుని క్షేమంగా ఇంటికి వెళ్లేవరకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ఆసుపత్రి నుంచి రోగికి అందేలా చేయడంలో ఈ సిబ్బంది పాత్ర ఎంతో కీలకం. అయితే వీరు ప్రారంభంలో ఎంత వేతనంతో ఉన్నారో ఏడేళ్లు గడిచినా నేటికీ అదే వేతనాలతో పనిచేస్తున్నారు. పెరిగిన ధరల దృష్ట్యా జీతాలు చాలక ఆరోగ్యశ్రీ సిబ్బంది ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.
నెట్‌వర్క్ మిత్రాలకు నెలకు వేతనంగా రూ.7,200, పీహెచ్‌సీ మిత్రాకు రూ.5,900, టీమ్‌లీడర్స్‌కు, ఆఫీస్ అసోసియేట్స్‌కు రూ.9,940లు వేతనం చెల్లిస్తున్నారు. 2009లో ప్రభుత్వం ఇచ్చిన కనీస వేతనాల జీవో ప్రకారం ఇప్పుడు ఇస్తున్న వేతనాలు రెండింతలు అయ్యే అవకాశం ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో అమలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ సిబ్బంది ఈ పథకం అమలుతోపాటుగా, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్, జర్నలిస్టు హెల్త్ స్కీమ్ విధులను కూడా నిర్వహిస్తున్నారు. గతంలో కంటే నేడు అదనంగా పనిభారం పెరిగినా ప్రభుత్వం వీరికి వేతనాలు పెంచే విషయం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా స్పందించి కనీస వేతనాలు అమలయ్యేలా చూడడంతో పాటు, ఈ పథకం సిబ్బందికి కూడా ఆరోగ్యశ్రీ కార్డులు అందజేయాలని కోరుతున్నారు.