కోస్ట్‌గార్డ్‌ అమ్ములపొదిలో ఐసీజీఎస్‌ వీరా

Army Chief Bipin Rawat Launch ICGS Veera Ship - Sakshi

స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మూడో నౌక

26 నాటికల్‌ మైళ్ల వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం

ప్రారంభించిన ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌

విశాఖసిటీ: భారత తీర భద్రతా దళం అమ్ములపొదిలో మరో ఆఫ్‌షోర్‌ పెట్రోల్‌ వెసల్‌ చేరింది. ఓపీవీ–3 క్లాస్‌ నౌకగా రూపొందిన ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ నౌక వీరా(ఐసీజీఎస్‌ వీరా) సేవలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. మూడో సిరీస్‌ ఓపీవీ నౌకగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వీరా రూపొందించారు. పూర్తిస్థాయి మెరుగులు దిద్దుకున్న వీరా.. మార్చి రెండో వారంలో విశాఖ కోస్ట్‌గార్డు ప్రధాన కేంద్రానికి చేరుకుంది. భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ లాంఛనంగా ఐసీజీఎస్‌ వీరా సేవల్ని ప్రారంభించారు. ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజేంద్రసింగ్‌ మాట్లాడుతూ మేకిన్‌ ఇండియాలో భాగంగా గతేడాది ఏప్రిల్‌లో, ఆగస్ట్‌లో రెండు నౌకలు కోస్ట్‌గార్డ్‌ సేవల్లో చేరగా.. తాజాగా ఐసీజీఎస్‌ వీర సేవలు ప్రారంభమయ్యాయని తెలిపారు.

ఇదీ ‘వీరా’ పరాక్రమ సామర్థ్యం
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మూడో కోస్ట్‌గార్డ్‌ నౌక వీర
ఇంటిగ్రేటెడ్‌ బ్రిడ్జ్‌ సిస్టమ్‌(ఐబీఎస్‌), ఇంటిగ్రేటెడ్‌ ప్లాట్‌ఫామ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(ఐపీఎంఎస్‌), ఆటోమేటెడ్‌ పవర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(ఏపీఎంఎస్‌) ఉన్న ఏకైక కోస్ట్‌గార్డ్‌ నౌక
హై పవర్‌ ఎక్స్‌టర్నల్‌ ఫైర్‌ ఫైటింగ్‌ సిస్టమ్‌ కూడా వీర సొంతం
97 మీటర్ల పొడవు, 15 మీటర్ల విశాలమైన వెడల్పుతో 3.6మీటర్ల డ్రాఫ్ట్‌గా వీరాను తయారు చేశారు.
2,200 టన్నుల బరువుతో 9,100 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న రెండు డీజిల్‌ ఇంజిన్ల సహాయంతో నడుస్తుంది.
26 నాటికల్‌ మైళ్ల వేగంతో వెళ్లే సామర్థ్యంతో 5 వేల నాటికల్‌ మైళ్ల వరకూ ఏకకాలంలో దూసుకెళ్లగలదు.
30 ఎంఎం నేవల్‌ గన్లు, 12.7 ఎంఎం గన్‌ ఫిట్‌ చేశారు.
ట్విన్‌ ఇంజిన్‌ హెలికాఫ్టర్, నాలుగు హైస్పీడ్‌ బోట్లు, బోర్డింగ్‌ ఆపరేషన్లకు వినియోగించే రెండు ఇన్‌ఫ్లేటబుల్‌ బోట్స్‌ వీరా లో ఉంటాయి.
సముద్రంలో ఎక్కడైనా చమురు తెట్టు ఏర్పడితే.. దాన్ని తొలగించే సామర్థ్యం ఉన్న పరికరాల్ని తీసుకెళ్లే సామర్థ్యమూ వీర సొంతం.
12 మంది అధికారులు, 94 మంది కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది వీరాలో విధులు నిర్వర్తించనున్నారు.
ఆల్ట్రా మోడ్రన్‌ నేవిగేషన్, కమ్యూనికేషన్‌ సిస్టమ్‌తో వీరా అత్యాధునిక కోస్ట్‌గార్డ్‌ నౌకల్లో ఒకటిగా వీరా రూపుదిద్దుకుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top