బాపట్ల ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సస్పెన్షన్‌

Area Hospital Superintendent Suspension In Bapatla - Sakshi

రూ.50 లక్షలకుపైగా నిధులు దుర్వినియోగం

పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన జిల్లా కో–ఆర్డినేటర్‌

 సాక్షి, బాపట్ల: బాపట్లలోని  పొట్టి శ్రీరాములు ఏరియా వైద్యశాలలో అరకోటి రూపాయలకు పైగా జరిగిన నిధుల స్కామ్‌లో ఎట్టకేలకు జిల్లా యంత్రాంగం చర్యలకు పూనుకుంది. ‘సాక్షి’ దినపత్రికలో గత రెండు నెలలుగా ప్రచురించిన వివిధ కథనాలకు స్పందించిన జిల్లా యంత్రాంగం ఆడిట్‌  నిర్వహించేందుకు ముందుకు రాగా ఒక్కొక్కటిగా తవ్వేకొద్దీ ఆవినీతి బయటపడింది. రెండు నెలలుగా జిల్లా ఆడిట్, రాష్ట్ర అడిట్‌ అధికారులు నిర్వహించిన రెండేళ్ల ఆడిట్‌లో రూ.50,19,820 నిధులు స్వాహా అయ్యాయని ఏరియా వైద్యశాలల జిల్లా కో ఆర్డినేటర్‌ ప్రసన్నకుమార్‌ ప్రకటించారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన గత సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఆశీర్వాదాన్ని సస్పెండ్‌ చేయగా, కాంట్రాక్టు ఉద్యోగులు సుబ్రహ్మణ్యస్వామి, చిరంజీవిలను  విధుల నుంచి తొలగించారు. వీరి ముగ్గురిపై బాపట్ల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం స్థానిక ఏరియా వైద్యశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో ఏరియా వైద్యశాలల జిల్లా కో ఆర్డినేటర్‌ ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ బాపట్ల ఏరియా వైద్యశాలలో రెండేళ్లుగా ఆడిట్‌ నిర్వహించకపోవటంతో అభివృద్ధి నిధులు, స్పెషల్‌ రూముల అద్దెలు, పలు షాపుల అద్దెలు, ఆపరేషన్లు, గర్భిణులకు ఇవ్వాల్సిన చెక్కులు, కాంట్రాక్టు ఉద్యోగులకు అత్యధికంగా వేతనాలు చెల్లించేందుకు పలు అకౌంట్ల సృష్టికి నిధులను దారిమళ్లించినట్లు గుర్తించామన్నారు. అభివృద్ధి కమిటీ, సూపరింటెండెంట్‌  ఉమ్మడిగా చెక్కులను డ్రా చేయించి సొంత ఖాతాల్లో నిధులు జమ చేసుకోవటంతో రాష్ట్ర ఆడిట్, జిల్లా ఆడిట్‌ విభాగాలతో పరిశీలన చేయించి పూర్తిస్థాయిలో నివేదిక తయారు చేయించామని చెప్పారు. ఈ పరిశీలన రెండు నెలలుగా జరుగుతుండగా మొత్తం రూ.50,19,820 నిధుల గోల్‌మాల్‌ జరిగినట్లు నిర్ధారించామని చెప్పారు.

నోటీసులు జారీ..
గత రెండేళ్లుగా బాపట్లలో సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వహించిన డాక్టర్‌ ఆశీర్వాదాన్ని సస్పెండ్‌ చేసి, నోటీసులు జారీ చేశామని జిల్లా కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ప్రసన్నకుమార్‌ చెప్పారు. జిల్లా కోఆర్డినేటర్‌తో పాటు ప్రస్తుత సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రసూల్‌ శుక్రవారం బాపట్ల టౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ హజరత్తయ్యకు లిఖిత పూర్వకంగా ఈమేరకు ఫిర్యాదు చేశారు. డాక్టర్‌ ఆశీర్వాదంతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులు సుబ్రమణ్యస్వామి, చిరంజీవిపై కూడా ఫిర్యాదు చేశారు. ఈవిషయంపై ఎస్‌ఐ హజరత్తయ్య మాట్లాడుతూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని చెప్పారు. బాపట్ల ఏరియా వైద్యశాలలో నిధుల దుర్వినియోగం తీరు చూస్తే ఇంకా లోతుగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని, అంతర్గత ఆడిట్‌లు కూడా నిర్వహించి ఇంకా ఎవరికైనా ప్రమేయం ఉంటే చర్యలు తీసుకుంటామని ప్రసన్నకుమార్‌ తెలిపారు. ఈ వ్యవహారం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top