
తల్లి కాబోతున్నారా..!
సృష్టికి మూలాధారం తల్లి. మాతృత్వంతోనే మహిళ జీవితానికి పరిపూర్ణత లభిస్తుందంటారు.
ఈ జాగ్రత్తలు పాటించండి
విజయవాడ : సృష్టికి మూలాధారం తల్లి. మాతృత్వంతోనే మహిళ జీవితానికి పరిపూర్ణత లభిస్తుందంటారు. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే..
పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. అంటే.. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేది తల్లి మాత్రమే అనేది సుస్పష్టం. అందుకే.. గర్భం ధరించిన నాటి నుంచి తల్లి ఆరోగ్యంపై కుటుంబ సభ్యులంతా శ్రద్ధ వహించాలి. గర్భిణులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తినకూడదు, గర్భం ధరించిన నాటి నుంచి తీసుకోవాల్సిన చర్యలను గైనకాలజిస్ట్ డాక్టర్ కె.టి.ఎల్.హైమవతి ఇలా వివరిస్తున్నారు.
తొలి రోజునుంచీ జాగ్రత్త అవసరం
గర్భిణి ఆరోగ్యంతోపాటు ఆమె తీసుకునే ఆహారం కూడా పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపుతుంది. నెల తప్పిన నాటినుంచి బిడ్డ ప్రసవించే వరకు గర్భస్థ శిశువు ఎదుగుదలకు తగిన జాగ్రత్తలు పాటించడం ఎంతో అవసరం. ఎప్పటికప్పుడు వైద్యుడికి చూపించుకుంటూ అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్ రాసిచ్చిన మందులు వేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. రక్తహీనత లేకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా గర్భిణులకు ఎనీమియా (రక్తహీనత) వచ్చే అవకాశాలు ఎక్కువ. అందువల్ల ఐరన్ పుష్కలంగా ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ధనుర్వాతం రాకుండా ముందుగా టెటానస్ ఇంజెక్షన్ చేయించుకోవాలి.
తేలికపాటి పనులు చేయొచ్చు
గర్భం ధరించిన సమయంలో విశ్రాంతి అవసరమని, ఏ పనీ చేయకూడదనే భావన మంచిది కాదు. బరువులు ఎత్తకుండా, తేలికపాటి పనులు చేయడం గర్భిణుల ఆరోగ్యానికి మంచిది. కండరాలకు కదలిక ఉండాలి. విశ్రాంతి తీసుకుంటూ పనులు చేసుకుంటూ ఉంటే అలసట ఏర్పడదు. వాకింగ్ చేయడం మంచిది. ఎక్సర్‌సైజ్‌లు మాత్రం చేయకూడదు. వేవిళ్లు వస్తున్నా.. వాంతులు అవుతున్నా భయపడాల్సిన పనిలేదు. నీరసం రాకుండా పండ్ల రసాలు, పోషక విలువలు సంపూర్ణంగా లభించే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి.
పరిశుభ్రత ముఖ్యం
కాబోయే తల్లులు తమ శరీరంలో వచ్చే మార్పులకు అనుగుణంగా వదులుగా ఉండే దుస్తులను ధరించాలి. పరిశుభ్రతను పాటించాలి. రోజూ రెండు పూటలా గోరు వెచ్చని నీటితో శుభ్రంగా స్నానం చేయాలి. తల తిరుగుతున్నా.. వికారంగా ఉన్నా డాక్టర్ సలహా ప్రకారం మందులు వేసుకోవాలి. అనారోగ్యంగా ఉన్నప్పుడు ఏ మందులు పడితే ఆ మందులు వేసుకోకూడదు. గర్భిణులు వాడే మందుల ప్రభావం గర్భస్థ శిశువుపై పడుతుంది. కొన్నిరకాల యాంటీబయోటిక్ మందులు శిశువు ఎదుగుదలకు, మానసిక ఆరోగ్యానికి అవరోధం కలిగించే ప్రమాదం ఉంది.
ఆహారం ఇలా..
ఆహారాన్ని అతిగా తిని ఆయాస పడకూడదు. అన్ని పోషక పదార్థాలు పుష్కలంగా లభించే ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఆహా రంలో పీచు పదార్థం ఉండేలా చూసుకోవాలి. తాజా ఆకు కూరలను రోజూ తీసుకోవాలి. బెల్లం, రాగులు, ఎండుద్రాక్ష, ఖర్జూరం, చెరకు రసం, నువ్వులు, ఉలవలు వంటి వాటిని ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. రోజుకో ఐరన్ మాత్ర వేసుకోవాలి. పోషకాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉన్న గర్భిణికి సుఖ ప్రసవం కలుగుతుంది.
ధూమపానానికి దూరంగా..
గర్భిణులు ధూమపానం, మద్యపానం చేయకూడదు. వాటి ప్రభా వం గర్భస్థ శిశువుపై తీవ్రంగా ఉంటుంది. ఒక్కోసారి నెలలు నిండకుండా ప్రసవం జరగవచ్చు. గర్భంలోనే శిశువు మరణించే ప్రమా దం కూడా ఉంది. బుద్ధి మాంద్యం, వైకల్యం ఏర్పడే ప్రమాదం ఉంది. గర్భిణికి మానసిక ప్రశాంతత అవసరం. పాదాలకు నీరు పడితే డాక్టర్ సలహా ప్రకారం మందులు వేసుకుంటూ ఆహార పదార్థాల్లో ఉప్పును తగ్గించుకుంటే సరిపోతుంది.