
నాకు ముప్పై ఐదు ఏళ్లు. మోకాలి నొప్పి చాలా ఎక్కువగా ఉంది. కొన్ని రోజులు పెయిన్ కిల్లర్స్ వాడాను. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాను. మునుపటి మందుల వలన ఏదైనా ఇబ్బంది ఉంటుందా? ఇప్పటికీ ఆ మందులు వాడొచ్చా?
– అనిత, మెదక్.
మీరు చెప్పిన మోకాలి నొప్పి సమస్య ఆస్టియో ఆర్థరైటిస్ కారణం కావచ్చు. ఇది జాయింట్ డీజెనరేషన్ లక్షణాలలో ఒకటి కావచ్చు. పెయిన్ కిల్లర్ మందులు తాత్కాలిక ఉపశమనం ఇస్తాయి కాని, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న సమయంలో మాత్రం ఈ మందుల వాడకాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఐబుప్రొఫెన్ లాంటి మందులు తక్కువ కాలం ఉపశమనం ఇస్తాయి కాని, దీర్ఘకాలంగా వాడడం సురక్షితమేమీ కాదు. ముందుగా పూర్తి పరీక్షలు చేయించుకోవాలి.
ఫోలిక్ యాసిడ్ వంటి సప్లిమెంట్లు తప్పనిసరిగా వాడాలి. ఐబుప్రొఫెన్ వంటి మందులు ఎన్ ఎస్‌ఎఐడీ గ్రూపులోకి వస్తాయి. ఇవి నొప్పికి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి. అయితే కొన్ని సైడ్ ఎఫెక్టులు కూడా వుంటాయి. మోకాలిలో నొప్పి లేదా గట్టిపడటం వంటి సందర్భాల్లో శరీరంలో ప్రోస్టాగ్లాండిన్లు అనే కెమికల్స్ విడుదల అవుతాయి.
వీటిని తగ్గించడానికే ఈ మందులు పనిచేస్తాయి. ప్రెగ్నెన్సీలో వీటిని వాడితే పుట్టబోయే బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కొన్ని మందులు జీర్ణాశయంలో అల్సర్లు, శ్వాస సమస్యలు, బ్లడ్ క్లాట్‌లు వంటి ఇబ్బందులు కలిగించవచ్చు. హెర్బల్ మందులు కూడా డాక్టర్ సలహా లేకుండా వాడకూడదు. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న సమయంలో ఏ ఔషధాన్నైనా డాక్టర్‌ను సంప్రదించి మాత్రమే వాడాలి.
నాకు యాభై ఐదు ఏళ్లు. ఇటీవల వజైనాలో పొడిగా ఉంటోంది. ఇరిటేషన్, ఇచింగ్, డిశ్చార్జ్ వస్తోంది. కొన్ని క్రీములు వాడాను. అయినా తగ్గడం లేదు. పరిష్కారం చెప్పండి.
– సుజాత, రాజోలు.
వజైనాలో పొడిబారడం అంటే ఎక్కువగా హార్మోనుల మార్పుల వలన వచ్చే సమస్య. ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో పచ్చటి డిశ్చార్జ్ వస్తే, అది ఇన్ఫెక్షన్ కావొచ్చు. పొడిగా మారడం, ఇచింగ్ అనేవి వజైనల్ వాల్స్, యూరినరీ ట్రాక్ట్ సున్నితంగా మారినప్పుడు జరుగుతుంది. ఆరోగ్యకరమైన వజైనల్ మ్యూకస్ ఫ్లూయిడ్ తగ్గిపోతుంది.
దీనివల్ల వజైనాలో తేమ తగ్గిపోతుంది. ఇక ఎక్కువ మంది బాధపడే ఇచింగ్ సమస్యకు కేవలం ఇన్ఫెక్షన్ మాత్రమే కాదు, వజైనల్ బ్యాక్టీరియా లోపం కూడా కారణం కావచ్చు. మెనోపాజ్ తర్వాత ఓవరీల నుంచి ఈస్ట్రోజన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఒత్తిడి వల్ల కూడా తేమ తగ్గే అవకాశం ఉంటుంది. వజైనల్ గ్లాండ్‌లు ఈస్ట్రోజ పై ఆధారపడి మ్యూకస్ తయారుచేస్తాయి. అవి తగ్గిపోతే పొడి సమస్య ఎక్కువవుతుంది.
యాంటీఫంగల్ ఆయింట్‌మెంట్లు, పౌడర్లు తాత్కాలిక ఉపశమనం ఇస్తాయి కానీ మళ్లీ మళ్లీ వస్తుంటుంది. కాబట్టి దీనికి పరిష్కారం ఈస్ట్రోజన్ క్రీములు, వజైనల్ లూబ్రికెంట్లు, వజైనల్ ఈస్ట్రోజన్ టాబ్లెట్లు, కొన్ని ప్రత్యేకమైన మందులు డాక్టర్ సూచనతోనే వాడాలి. బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నవారు ఈ చికిత్సలు తీసుకోకూడదు. కనుక తప్పకుండా గైనకాలజిస్టును సంప్రదించి, వారి సూచనల మేరకు తగిన చికిత్స తీసుకోవాలి.
(చదవండి: పెద్ద పిల్లల్లో చొల్లు చేటే..! సీరియస్‌గా తీసుకోవాల్సిందే..)