
చాలా చిన్నపిల్లల్లో నోటి నుంచి చొల్లు / జొల్లు కారుతుండటం చాలా కనిపించేదే. వైద్య పరిభాషలో చొల్లు/జొల్లు స్రవించే కండిషన్‌ను ‘సైలోరియా’ అనీ, ఇంగ్లిషు వాడుకభాషలో దీన్ని ‘డ్రూలింగ్’ అని అంటారు. నెలల పిల్లల్లో ముఖ్యంగా నాలుగు నెలల నుంచి 18 నెలల వరకు చిన్నపిల్లల్లో ఇది సాధారణంగా కనిపించేదే. ఆ టైమ్‌లో అంత చిన్న పిల్లల్లో అలా చొల్లు / జొల్లు స్రవిస్తుండటం చాలా సాధారణం. కానీ నాలుగేళ్లు దాటిన తర్వాత కూడా జొల్లు కారడం జరుగుతుంటే... అంటే పెద్ద పిల్లల్లోనూ ఇదే కనిపిస్తుంటే అది కొన్ని సీరియస్ సమస్యలకు సూచన కావచ్చు. పెద్దపిల్లల్లో ఇలా చొల్లు స్రవించడానికి దానికి కారణాలేమిటో, వాళ్ల విషయంలో తీసుకోవాల్సిన చర్యలేమిటో తెలుసుకుందాం.
చిన్నారుల్లో వాళ్ల నోరు, దవడ భాగంలోని ఓరల్ మోటార్ ఫంక్షన్స్ పూర్తిగా అభివృద్ధి చెందేవరకూ ఇలా నోటి నుంచి లాలాజలం వస్తుండటం మామూలే. కానీ చిన్న పిల్లల్లో నాలుగేళ్లు దాటాక కూడా చొల్లు వస్తూనే ఉంటే దాన్ని కాస్త సీరియస్‌గా తీసుకోవాలి. అంటే దాన్ని సాధారణ విషయంగా అనుకోకుండా కాస్త అబ్‌నార్మాలిటీగా పరిగణించాలి.
పెద్ద పిల్లల్లో చొల్లు / జొల్లును సీరియస్‌గా ఎందుకు తీసుకోవాలంటే...?
కొంతమంది పెద్ద పిల్లల్లో మానసిక సమస్యలు, నరాల బలహీనతకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉంటే ఇలా చొల్లు / జొల్లు కారుతుండటం జరుగుతుంది. అంటే వాళ్లలోని ఆరోగ్య సమస్య కారణంగా వాళ్ల నోట్లో స్రవించిన లాలాజలాన్ని వాళ్లు తమంతట తామే మింగలేనందువల్ల ఇలా జొల్లు / సొల్లు స్రవిస్తుంటుంది.
ఇక కొందరు చిన్న పిల్లల్లో కొన్నిసార్లు ముక్కులు విపరీతంగా బిగుసుకుపోయినా, దంత (డెంటల్) సమస్యలు ఉన్నా, మింగలేక΄ోవడానికి ఇంకేమైనా ఆరోగ్య సమస్యలు (ఉదా: సివియర్ ఫ్యారింగో టాన్సిలైటిస్ వంటివి) ఉన్నా చొల్లు/జొల్లు కారుతుంటుంది. పైగా ఇలాంటి సమస్యలు ఉన్నపుపడు జొల్లు కారడం మరింత పెరుగుతుంది. అయితే ఇవన్నీ తాత్కాలికం.
తొలుత తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
పెద్ద పిల్లల్లో ఇలా చొల్లు / జొల్లు కారుతున్నప్పుడు వాళ్లంతట వాళ్లే తమ లాలాజల స్రావాన్ని మింగుతుండేలా వాళ్లకు అలవాటు చేయాలి. ఇక లాలాజల స్రావం ఎక్కువగా ఉన్న పిల్లల్లో కొన్ని ప్రత్యేకమైన దంత ఉపకరణాలు (స్పెషల్ డెంటల్ అప్లయెన్సెస్) ఉపయోగించి వాలంటరీగా వాళ్లకు మింగడం ప్రక్రియను అలవాటు చేయించవచ్చు.
అడ్వాన్స్‌డ్ చికిత్సగా...
మరికొందరిలో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో (ముఖ్యంగా పెద్దవాళ్లలో, పెద్ద పిల్లల్లో) కొన్ని మందులు వాడాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో బొట్యులినం అనే ఒక రకం ఇంజెక్షన్‌ను లాలాజల గ్రంథుల్లోకి ఇంజెక్ట్ చేస్తున్నారు.
జొల్లు స్రవించే పిల్లలకు ఇవీ సూచనలు...
అన్నిటికంటే ముఖ్యంగా ఏడాదిన్నర దాటాక కూడా పిల్లల్లో చొల్లు / జొల్లు స్రవిస్తుంటే ఇలాంటి సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అవి...
మంచి నోటి పరిశుభ్రత (గుడ్ ఓరల్ హైజీన్)
తరచూ గుటక వేస్తూ లాలాజలం మింగడం అలవాటు చేయడం
నోటి కండరాల కదలికలను మెరుగు పరచడం (ఇంప్రూవ్‌మెంట్ ఆఫ్ టోన్ అండ్ మూవ్‌మెంట్ ఆఫ్ ఓరల్ మజిల్స్)... ఈ చర్యలన్నీ పిల్లల్లో చొల్లు/జొల్లు స్రవించకుండా అరికట్టడానికి బాగానే ఉపయోగపడతాయి. అప్పటికీ అలాగే స్రవిస్తుంటే పిల్లల డాక్టర్‌ను సంప్రదించి, అసలు కారణం తెలుసుకోడానికి అవసరమైన పరీక్షలు చేయించాలి. ఆ పరీక్షల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా చికిత్సలు ఉంటాయి.