
నాకు ఇప్పుడు మూడోనెల. గతంలో గర్భస్రావం కావడం వలన చాలా డిస్టర్బ్ అయ్యాను. నన్ను ఇంట్లో ఎవరూ అర్థం చేసుకోవట్లేదు. మళ్లీ ప్రెగ్నెన్సీ కోసం సిద్ధంగా లేను. చాలా బాధగా ఉంది. ఈ సమయంలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి?
– రమ్య, హైదరాబాద్
మీ పరిస్థితిని అర్థం చేసుకోగలం. ప్రెగ్నెన్సీ మానసికంగా చాలా ప్రభావం చూపుతుంది. కొన్నిసార్లు అన్నీ అనుకున్నట్లు జరగవు. దీంతో బాధ, కోపం, అసహనం, ఆందోళన ఎవరికైనా వస్తాయి. మళ్లీ ప్రెగ్నెన్సీ మీద భయం ఉంటుంది. ఇలాంటప్పుడే మీరు ధైర్యంగా ఉండాలి. సహాయం తీసుకోవాలి. డాక్టర్‌ని సంప్రదించి మీ భావాలను వివరంగా వారితో పంచుకోవాలి.
టాకింగ్ థెరపీ ద్వారా మనసులో ఉండే బాధను తొలగించుకోవచ్చు. అలా ఎందుకు అయింది, ఏమి చేస్తే మళ్లీ అలా జరగకుండా ఉంటుంది. ఏ పరీక్షలు చేయించుకోవాలి. ఇలా అన్ని కోణాల్లో మాట్లాడుతూ మీ మనసులోని అనుమానాలను తొలగించుకోవచ్చు. దీంతో డాక్టర్ అవసరమైన పరీక్షలు చేసి సమస్య తీవ్రతను అంచనా వేస్తారు. అవసరమైతే మానసిక నిపుణుడిని సంప్రదించమని చెప్తారు. ఇది పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ (పీటీఎస్‌డీ) కావచ్చు. దీనికి కౌన్సెలింగ్, థెరపీ అవసరం. సాధారణంగా నాలుగు నుంచి ఐదు వారాల్లో ఉపశమనం కనిపిస్తుంది.
కొన్ని సందర్భాల్లో రెండు వారాల్లోనే తేడా కనిపిస్తుంది. ఎలాంటి మందులూ వీళ్లకి అవసరం ఉండదు. అందుకే, భయపడకుండా ఒకసారి డాక్టర్‌ని కలవండి. కొంతమందికి ఈ సమస్య ఎక్కువగా ఉండచ్చు. వీరికి లాంగ్ టర్మ్ కౌన్సెలింగ్ సెషన్స్‌తోపాటు కొన్ని మందులు సూచిస్తాం. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (సీబీటీ) అనేది ఒక రకమైన టాకింగ్ థెరపీ.
దీనిలో మీ మనస్సులోని ఆలోచనలు మేనేజ్ చేసే ఫోకస్డ్ కౌన్సెలింగ్ చేస్తారు. మీకు రొటీన్‌గా కొన్ని పనులు చెయ్యమని చెప్తారు. రెండు నుంచి మూడు నెలల సీబీటీ చికిత్సతో ఉపశమనం లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో సెర్‌ట్రాలిన్ మాత్రలను తాత్కాలికంగా ఉపయోగిస్తారు. ఇది కొన్ని వారాలు మాత్రమే. ఈ లోపల కౌన్సెలింగ్, ఆరోగ్యకరమైన అలవాట్ల వలన మానసిక స్థితి మెరుగవుతుంది.
నా వయసు ముప్పై ఐదు సంవత్సరాలు. నాకు మధుమేహం ఉంది. మందులు వాడుతున్నాను. ఇలాంటప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయవచ్చా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
– శారద, వరంగల్.
ఏ ఆరోగ్య సమస్య ఉన్నా ముందు డాక్టర్‌ని సంప్రదించడం మంచిది. అప్పుడు వారు కొన్ని పరీక్షలను ముందే చేయించి, దాదాపు అన్నీ కంట్రోల్‌లో ఉంటేనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చెయ్యమని చెప్తున్నారు. వీటిలో మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్, మూర్ఛ, ఆస్తమా లాంటివి ఉంటాయి. ముందే డాక్టర్‌ని సంప్రదించినప్పుడు , మీ సమస్య ఎంతవరకు కంట్రోల్‌లో ఉందో తెలుసుకోవచ్చు.
దీని వలన తల్లికి, బిడ్డకి భవిష్యత్తులో ఏ సమస్యలు ఉండవు. డయాబెటిక్ క్లినిక్స్‌లో వెంటనే సంప్రదించి, హెచ్‌బీ1సీ పరీక్ష చేయించుకోండి. ఇందులో చక్కెర స్థాయి 5.5 నుంచి 6. 5 శాతం మధ్యలో ఉండాలి. ఒకవేళ మీ షుగర్ కంట్రోల్‌లో ఉంటే పుట్టబోయే బిడ్డకు ప్రమాదం తగ్గుతుంది. షుగర్ ఎక్కువ ఉంటే కొన్ని నెలలు స్ట్రిక్ట్ డైట్, వ్యాయామం చేయాలి.
మందులు అవసరమైతే మార్చాలి. కొన్ని రక్త, మూత్ర పరీక్షలు చేయించుకోవాలి. ఫోలిక్ యాసిడ్ 5 ఎమ్‌జీ మాత్రలు రోజూ తీసుకోవటం ప్రారంభించండి. ఈ సమయానికి డాక్టర్ సూచించిన మందులు మాత్రమే వాడాలి. ఇన్సులిన్ వాడటం సురక్షితమే. ఐ స్క్రీనింగ్, మూత్రపిండాలు, కాలేయం, హార్మోన్ పరీక్షలు కూడా చేయించాలి. ఇవన్నీ ప్రెగ్నెన్సీలో ఏ ఇబ్బందులు రాకుండా చూస్తాయి.
డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
(చదవండి: మంచుకొండల్లో మహిళారాజ్యం..! ఆ ఒక్క జిల్లాలో పాలనాధికారులంతా..)