
మంచుపర్వత ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్‌లో 12 జిల్లాలు ఉన్నాయి. ‘లాహౌల్ స్పితి’ జిల్లా వాటిల్లో ఒకటి. లాహౌల్ స్పితి జిల్లాలోని ప్రత్యేకతలన్నీ ఆ రాష్ట్రంలోని మిగతా జిల్లాలన్నిటికీ ఉన్నప్పటికీ, దేశంలోని దాదాపు 800 జిల్లాల్లో లేని ఒక ప్రత్యేకత ఇప్పుడు లాహౌల్ స్పితికి మాత్రమే ఉంది! ఆ జిల్లా పాలనాధికారులంతా మహిళలే కావటమే ఆ ప్రత్యేకత.
ముఖ్యమంత్రి ఆకాంక్ష!
కిరణ్ భదానా ఇటీవలే, ఏప్రిల్ 27న లాహౌల్ స్పితి జిల్లాకు డిప్యూటీ కమిషనర్‌గా వచ్చారు. 2017 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆమె. (జిల్లా కలెక్టర్‌ను కొన్ని రాష్ట్రాల్లో డిప్యూటీ కమిషనర్ అంటారు). హిమాచల్‌ప్రదేశ్‌లో 3 ఆదివాసీ జిల్లాలు ఉన్నాయి. కిన్నర్, చంబా, మూడవది: లాహౌల్ స్పితి. పాలనా యంత్రాంగానికంతా మహిళలే అధికారులవటంతో లాహౌల్ స్పితి జిల్లాకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది.
ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ గత అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడుతూ రాష్ట్రంలో కనీసం ఒక్క జిల్లాలోనైనా పాలన, రాజకీయ నాయకత్వం పూర్తిగా మహిళల చేతుల్లో ఉండాలన్న తన ఆకాంక్షను వెల్లడించటం విశేషం. తాజాగా కిరణ్ భదానా నియామకంతో ఆయన ఆకాంక్ష సంపూర్ణంగా నెరవేరిన ట్లైంది.
మహిళా ఎంపీ
అందరూ మహిళలే అధికారులుగా ఉన్న లాహౌల్ స్పితి జిల్లా ‘మండీ’ లోక్‌సభ నియోజకర్గం పరిధిలోకి వస్తుంది. ఆ నియోజకవర్గానికి కంగనా రనౌత్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మండీ ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పటికి నెల ముందు మాత్రమే కంగనా రాజకీయాల్లోకి వచ్చారు. బీజేపీ తరఫున మండీలో పోటీకి దిగారు. 5 లక్షల, 37 వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు.
మహిళా ఎమ్మెల్యే
2024 లోనే జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో లాహౌల్ స్పితి శాసనసభ నియోజకర్గం నుంచి అనురాధా రాణా ఎన్నికవటం మరొక విశేషం. అనురాధ ఎం.ఎ. ఇంగ్లిష్, ఎం.ఎ. పొలిటికల్ సైన్స్ చదివారు. కాంగ్రెస్ నుండి పోటీ చేసి గెలిచారు.
కలెక్టరు, ఎస్పీ, కమిషనర్..!
లాహౌల్ స్పితి జిల్లాకు డిప్యూటీ కమిషనర్‌గా వచ్చిన కిరణ్ భదానా రాజస్థాన్‌కు చెందిన వారు. ఢిల్లీ శ్రీరామ్ కాలేజ్‌లో డిగ్రీ చదివారు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ చేశారు. మూడు ప్రయత్నాల తర్వాత యూపీఎస్‌సీ పరీక్షలలో 120 ర్యాంకు సాధించి ఐఏఎస్ అఫీసర్ అయ్యారు. ఇక బీనాదేవి 2024 జూన్ నుండి లాహౌల్ స్పితికి జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఉన్నారు. ఆమె ఎస్సీ వర్గానికి చెందిన వారు. జిల్లాలోని అట్టడుగు వర్గం వారికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
జిల్లా ఎస్పీ ఇల్మా అఫ్రోజ్. 2018–2019 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆమె. 2025 మార్చిలోనే లాహౌల్ స్పితి జిల్లాకు ఎస్పీగా వచ్చారు. ఆకాంక్ష శర్మ కెలాంగ్ సబ్–డివిజినల్ మేజిస్ట్రేట్. 2023లో పదవీ బాధ్యతలు చేపట్టారు. కెలాంగ్ రెవిన్యూ డివిజన్‌కు డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌గా కూడా ఆకాంక్ష పని చేశారు.
శిఖా సిమ్టియా– కాజా డివిజన్‌కు సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్, అడిషనల్ డిప్యూటీ కమిషనర్ కూడా. 2019 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా పట్టణం ఆమె జన్మస్థలం. చౌరీలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి పట్టభద్రురాలయ్యారు. సిమ్లాలోని హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు.
‘‘మహిళలు అధికారులుగా ఉంటే, సాధారణ మహిళలు చొరవగా ముందుకు వచ్చి తమ సమస్యలు చెప్పుకోగలుగుతారు. పురుష అధికారులంటే ఉండే సంకోచం ఉండదు. కీలక పదవులలో, రాజకీయాలలో మహిళలు ఉండటం వల్ల పాలన మెరుగ్గా ఉంటుంది, పరిష్కారాలు సాఫీగా జరిగిపోతాయి..’’ అని లాహౌల్ స్పితికి ఎమ్మెల్యే అనురాధా రాణా అంటారు. అది నిజమే కదా!
నాలుగేళ్ల క్రితం ‘నల్బరి’ ఫస్ట్
అస్సాంలోని గువాహటికి 60 కి.మీ. దూరంలో ఉంటుంది నల్బరి జిల్లా. నాలుగేళ్ల క్రితమే ఈ జిల్లా తొలి ‘మహిళా అధికారుల జిల్లా’గా వార్తల్లోకి వచ్చింది. అప్పట్లో ఆ జిల్లాలోని అత్యున్నత స్థాయి అధికారులంతా దాదాపుగా మహిళలే కావటం దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది.
జిల్లా కలెక్టర్ మహిళ, జిల్లా ఎస్పీ మహిళ, ముగ్గురు అడిషనల్ డిప్యూటీ కమిషనర్‌లు మహిళలు. డిస్ట్రిక్ట్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్, డిస్ట్రిక్ట్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్... అందరూ మహిళలే. జిల్లాలోని ఐదుగురు జడ్జిలు, నలుగురు సర్కిల్ ఆఫీసర్‌లు, సబ్–రిజిస్ట్రార్, ఇంకా... డిస్ట్రిక్ట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్, సబ్–డివిజినల్ అగ్రికల్చర్ ఆఫీసర్, సాయిల్ సైంటిస్ట్, డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్, చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌లు... అంతా మహిళలే. ఇప్పుడు వీరిలో చాలామంది బదలీపై వెళ్లారు. దాంతో ‘నల్బరి’ జిల్లా ప్రత్యేకతలు ‘లాహౌల్ స్పితి’ జిల్లాకు వచ్చాయి.
సాక్షి, స్పెషల్ డెస్క్
(చదవండి: చాయ్ చమక్కులు..! ఏమి'టీ' వింతలు!)