
నా బరువు వంద కిలోలు. పెళ్లైయి రెండు సంవత్సరాలు అవుతుంది. కాని, ప్రెగ్నెన్సీ రావటం లేదు. ప్రెగ్నెన్సీ కోసం నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
– లలిత, కర్నూలు.
ఊబకాయం ఈ రోజుల్లో చాలా ముఖ్యమైన సమస్య. మరీ ముఖ్యంగా ఇరవై నుంచి ముప్పయ్యేళ్ల మధ్య వయస్సు మహిళలలో అధిక బరువు వలన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. నెలసరి క్రమంగా రాకపోవడం, వచ్చినా ఎక్కువ, తక్కువ బ్లీడింగ్ అవటం ఉంటుంది. దీనితో పాటు దీర్ఘకాలిక వ్యాధులైన హైపర్ టెన్షన్, డయాబెటిస్, థైరాయిడ్ వంటి ఇతర జబ్బులు కూడా చిన్న వయసులోనే వచ్చే ప్రమాదం ఉంది.
వీటితో ప్రెగ్నెన్సీ రావడం కష్టమవుతుంది. దీనికి ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. అంటే జంక్ ఫుడ్, ఫాస్టఫుడ్, బేకరీ ఉత్పత్తులను ఆహారంగా తీసుకోకూడదు. ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఆకుకూరలు, కూరగాయలు, తాజా పండ్లు తీసుకోవాలి. వీటితో పాటు రోజుకు కనీసం ముప్పయి నుంచి నలభై నిమిషాలు వ్యాయామం లేదా యోగా వంటివి చేస్తూ బరువును నియంత్రణలో ఉంచుకోవాలి.
ఒకసారి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు డాక్టర్‌ను సంప్రదించి అవసరమైన రక్త పరీక్షలు థైరాయిడ్, డయాబెటిస్, హిమోగ్లోబిన్ వంటివి చేయించుకోవాలి. అలాగే డాక్టర్ సూచించిన మందులను వాడాలి. ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్ మాత్రలను ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి ముందు నుంచే ఉపయోగించడం వలన అధిక బరువు, ఊబకాయం వలన వచ్చే సమస్యలను అధిగమించి ఆరోగ్యకరంగా గర్భందాల్చి, ఆరోగ్యకరమైన శిశువును పొందవచ్చు.
ప్రెగ్నెన్సీలో ఓబెసిటీ వల్ల కలిగే సమస్యలు, వాటి పరిష్కారాలను వివరించండి?
– శ్రీలలిత, వైజాగ్
ఊబకాయంతో బాధపడుతున్న స్త్రీలు గర్భధారణకు ముందు నుంచే తమ బరువును నియంత్రణలోకి తెచ్చుకోవాలి. లేకపోతే ఓబెసిటీ కారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. దీనివల్ల శరీరంలోని హార్మోన్ల సమతుల్యత లోపిస్తుంది. ఫలితంగా గర్భం దాల్చే ప్రక్రియలో ఆటంకం ఏర్పడుతుంది. బరువు నియంత్రణలో లేకపోతే తల్లి ఆరోగ్యంపైనే కాకుండా శిశువు అభివృద్ధిపైనా కూడా ప్రభావం పడుతుంది. గర్భధారణ మొదటి మూడునెలల్లో గర్భస్రావం జరగడం, శిశువులో అవయవ లోపాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అంతేకాకుండా, తల్లికి గర్భధారణ సమయంలో మధుమేహం, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులు రావచ్చు. వీటివలన శిశువు ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. పుట్టబోయే బిడ్డ ఎక్కువ లేదా తక్కువ బరువుతో పుట్టడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అప్పుడు కాన్పు సమయంలో సవాళ్లు ఎదురవుతాయి. ఉదాహరణకు, బిడ్డ బరువు ఎక్కువగా ఉండటం వలన సాధారణ కాన్పు సాధ్యపడక, శస్త్రచికిత్స అవసరమవుతుంది.
ప్రసవ సమయంలో ఎక్కువ రక్తస్రావం, కుట్లు సరిగ్గా మానకపోవడం, ఇన్‌ఫెక్షన్స్ రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అనస్థీషియా సంబంధిత ఇబ్బందులు కూడా తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఇవి మాత్రమే కాదు, పుట్టబోయే బిడ్డకు కూడా తల్లి అధిక బరువు కారణంగా భవిష్యత్తులో మధుమేహం, హార్మోన్ల అసమతుల్యత వంటి దీర్ఘకాలిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో శిశువు నెలలు నిండక ముందే పుట్టి, కొంతకాలం ఇన్‌క్యుబేటర్లో ఉంచాల్సి రావచ్చు.
అందుకే, గర్భధారణకు ముందు, గర్భధారణ సమయంలో, ప్రసవం తరువాత కూడా బరువును నియంత్రించాలి. గర్భం దాల్చిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించి తగిన జాగ్రత్తలు, అవసరమైన రక్తపరీక్షలు, శిశువు ఎదుగుదలపై తగిన స్కానింగ్‌లు చేయించుకోవాలి. పోషకాహార సప్లిమెంట్లు, అవసరమైన మందులు డాక్టర్ సూచించిన మోతాదులో తీసుకుంటూ ఉండాలి. అవసరమైతే ఇతర నిపుణుల సలహాలు పాటిస్తూ, ఆరోగ్యవంతమైన ప్రెగ్నెన్సీ జర్నీని ప్లాన్ చేసుకోవచ్చు.
డా‘‘ ప్రియదర్శిని, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్ హైదరాబాద్
(చదవండి: హీరో సల్మాన్‌ఖాన్ సైతం విలవిలలాడిన సమస్య..! ఏంటి ట్రెజెమినల్ న్యూరాల్జియా..)