బడుగుల అభ్యున్నతి కోసం అట్టహాసంగా ప్రారంభిస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులకు అందడం లేదు. అధికారుల నిర్లక్ష్యం, ప్రచారం లోపం, అవగాహన లేమితో కనీసం పథకం ఉందన్న సంగతి కూడా ప్రజలకు తెలియని పరిస్థితి.
జిల్లాలో రాజీవ్ విద్యాదీవెన పథకంపై నీలినీడలు
Oct 21 2013 6:22 AM | Updated on Sep 1 2017 11:50 PM
బడుగుల అభ్యున్నతి కోసం అట్టహాసంగా ప్రారంభిస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులకు అందడం లేదు. అధికారుల నిర్లక్ష్యం, ప్రచారం లోపం, అవగాహన లేమితో కనీసం పథకం ఉందన్న సంగతి కూడా ప్రజలకు తెలియని పరిస్థితి. ఈ కోవకు చెందిందే సాంఘిక సంక్షేమ శాఖ అమలుచేస్తున్న రాజీవ్ విద్యాదీవెన పథకం. నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం పెంచడం దీని ఉద్దేశం. పథకంపై కనీసం పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు కూడా పూర్తి సమాచారం తెలియకపోవడం గమనార్హం.
కొవ్వూరు రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలో 2013-14 విద్యాసంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు గడుస్తున్నా రాజీవ్ విద్యా దీవెన పథకానికి ఒక్క విద్యార్థి కూడా దరఖాస్తు చేసుకోలేదు. అ ర్హులకు సంబంధించిన జాబితాల ను కూడా సంబంధిత అధికారులు సిద్ధం చేయలేదు. పథకంపై విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడంతో పాటు నిబంధనలు కూడా అవరోధంగా మారాయి. దీంతో పథకం నీరుగారిపోతోందని పలువురు విమర్శిస్తున్నారు.
నెలకు రూ. 150 ఉపకార వేతనం
ప్రభుత్వ పాఠశాలల్లో 5 నుంచి 10 తరగతి వరకు చదువుతూ సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఉండని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు పథకంలో భాగంగా ఉపకార వేతనం అందిస్తారు. విద్యార్థికి ప్రతినెలా ఉపకార వేతనం రూ.150, ఏడాదిలో పుస్తకాల కొనుగోలు నిమిత్తం రూ.750ను బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు. గతేడాది 9, 10 తరగతుల ఎస్సీ విద్యార్థులకు మాత్రమే అమలు చేసిన రాజీవ్ విద్యాదీవెనను ఈ ఏడాది నుంచి 5 నుంచి 10వ తరగతి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు వర్తింపజేయాలని ప్రభుత్వం జులైలో ఉత్తర్వులు జారీ చేసింది.
నిబంధనల అడ్డంకి
పథకం కోసం విద్యార్థి స్వయంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడంతోపాటు శాశ్వత కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, తల్లిదండ్రులలో ఒకరితో ఉన్న జాయింట్ బ్యాంక్ అకౌంట్ జతచేయాలి. జిల్లాలో పలువురు విద్యార్థులకు ఆధార్ కార్డులు లేకపోవడం, తల్లిదండ్రులు నిర్లక్ష్యరాస్యులు కావడంతో దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పూర్తి సమాచారం తెలియకపోవడంతో పథకంపై విద్యార్థులకు అవగాహన కల్పించలేకపోతున్నారు.
మండలానికి 2 వేల మంది చొప్పున..
జిల్లావ్యాప్తంగా 46 మండలాల్లో సగటున ఒక్కో మండలంలో 2 వేల మంది చొప్పున 92 వేల మంది అర్హులు ఉంటారని అంచనా. కొవ్వూరు మండలంలో 40 ప్రాథమిక, 6 ప్రాథమికోన్నత, 12 ఉన్నత పాఠశాలల్లో పథకానికి సుమారు 2,667 మంది అర్హులు ఉన్నారు. గతంలో మండల విద్యాశాఖ అధికారులు సూచనప్రాయంగా పథకం గురించి చెప్పారని, పూర్తి విధివిధానాలు తమకు తెలియవని పలువురు ప్రధానోపాధ్యాయులు అంటున్నారు. గత విద్యాసంవత్సరంలో కొవ్వూరు అసిస్టెంట్ సాంఘిక సంక్షేమశాఖ అధికారి పరిధిలోని కొవ్వూరు, తాళ్లపూడి, చాగల్లు, నిడదవోలు, పోలవరం మండలాలలో వేలాది మంది అర్హులు ఉన్నా కేవలం 543 మందికి మాత్రమే ఒక్కొక్కరికీ రూ. 2,100 చొప్పున అందజేశారు.
సమాచారమందించాం
రాజీవ్ విద్యాదీవెన పథకంపై ఎంఈవో కార్యాలయాల ద్వారా అన్ని పాఠశాలలకు సమాచారమందించాం. రెండు నెలలుగా సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో విద్యార్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ఆలసమైంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం అందేలా చూస్తాం.
- పీడీడబ్ల్యూ ప్రసాద్, అసిస్టెంట్ సాంఘిక సంక్షేమశాఖ అధికారి, కొవ్వూరు.
Advertisement
Advertisement