అమెరికా జంట హత్యల కేసులో కొత్త కోణం | ap woman techie son murder in america, sasikala family reveals on her emails | Sakshi
Sakshi News home page

శశికళ ఈ మెయిల్‌ లో ఏముంది?

Mar 25 2017 1:54 PM | Updated on Sep 29 2018 4:52 PM

అమెరికా జంట హత్యల కేసులో కొత్త కోణం - Sakshi

అమెరికా జంట హత్యల కేసులో కొత్త కోణం

అమెరికాలో జంట హత్యల కేసులో కొత్త కోణం బయటపడింది. మృతురాలు శశికళ పంపిన ఈ మెయిల్స్‌ను ఆమె కుటుంబ సభ్యులు శనివారం బయటపెట్టారు.

విజయవాడ: అమెరికాలో జంట హత్యల కేసులో కొత్త కోణం బయటపడింది. మృతురాలు శశికళ పంపిన ఈ మెయిల్స్‌ను ఆమె కుటుంబ సభ్యులు శనివారం బయటపెట్టారు. తన భర్త నర్రా హనుమంతరావుకు ఓ కేరళ మహిళతో అక్రమ సంబంధం ఉందంటూ శశికళ తన సోదరుడు వేణుకు మెయిల్‌ లో తెలిపింది. శశికళ మెయిల్‌ తో తెలిపిన విషయాలు...

‘సీటీఎస్‌లో పని చేసే దీపా అజిత్‌తో హన్మంత్‌కు సంబంధం ఉంది. రోజు దీపాతో హన్మంత్‌ ఫోన్లు, చాట్‌లు చేస్తున్నాడు. మొబైల్‌లో వీటిని చూసి హన్మంత్‌ను నిలదీశా. నేనేం తప్పు చేయలేదని బుకాయించాడు. హన్మంత్‌లో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదు. కొన్నిసార్లు నాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఏమైనా చేసుకో పో అంటూ తిరగబడుతున్నాడు. ఐదేళ్ల కొడుకు ఉండికూడా మరో మహిళతో సంబంధం ఘోరం. హన్మంతరావును నేనెంతో నమ్మా. ప్రేమించి పెళ్లి చేసుకున్న నాకు ఇలాంటి మోసం జరగుతుందనుకోలేదు. వాళ్ల తల్లిదండ్రులు, అక్కా బావా అందరూ కుట్రదారులే. ఒక్క విషయం కూడా పంచుకోరు, పైగా ప్రమాదకారులు. ముఖ్యంగా మా అత్తమ్య చాలా చాలా ప్రమాదకారి. కొడుకును ఎలా వాడుకోవాలో బాగా తెలిసిన వ్యక్తి.

ఈ విషయాలన్నీ అమ్మకు చెబితే బాధ పడుతుంది. ఇన్ని బాధలున్నా బతుకుతున్నానంటే కేవలం హనీష్‌ (కొడుకు) కోసమే.’ అని మెయిల్‌లో పేర్కొంది. అలాగే  భార్యాభర్తల మధ్య జరిగిన వాట్సప్‌ సంభాషణలుతో పాటు భర్త వేధింపులకు సంబంధించిన సోదరుడు వేణుకు పంపిన మెయిల్‌లను మృతురాలు తల్లిదండ్రులు మీడియాకు చూపించారు. (చదవండి- వివాహేతర సంబంధమే కారణమా?)

తమ కూతురు, మనవడిని దారుణంగా హతమార్చిన హనుమంతరావును కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, కృష్ణకుమారిలు డిమాండ్ చేశారు. ఈ కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కనీస సహకారం కూడా అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి అయినప్పటినుంచే భర్త వేధింపులకు గురిచేస్తున్నడంటూ తమ కుమార్తె పలుమార్లు చెప్పినా  తామే సర్దుకుపొమ్మని చెప్పామని, అయితే అల్లుడు ఇంత ఘాతుకానికి పాల్పడతాడని తాము ఊహించలేదని అన్నారు. మరోవైపు జంట హత్యల కేసులో హనుమంతరావును అక్కడ పోలీసులు విచారణ జరిపారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం అతడిని విడుదల చేశారు.

హన్మంత్‌ తో కేరళ యువతి చాటింగ్‌...

అలాగే హన్మంత్‌ కేరళ యువతితో చేసిన చాటింగ్‌ను కూడా శశికళ బంధువులు బయటపెట్టారు. ‘నా జీవితంతో ఆటలు ఆడుకుంటున్నావు. నువ్వొక అబద్ధాలకోరువు. నా భర్త ముందు నిలబడి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పగలను. ఇదే విషయం నువ్వు నీ భార్య ముందు చెప్పగలవా?. నీ భార్యకు నువ్వు భయపడుతున్నావు. నాతో సంబంధంపై భయపడేవాడివైతే ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చావు?. నీ దగ్గర నేనేం దాచలేదు.’  అని కేరళ యువతి హన్మంత్‌కు మెసేజ్‌ చేసింది.  మరోవైపు జంట హత్యల కేసులో హనుమంతరావును అక్కడ పోలీసులు విచారణ జరిపారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం అతడిని విడుదల చేశారు.

చదవండి... అమెరికాలో తల్లీబిడ్డల దారుణహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement