ప్రతిపక్షం గుంటనక్కలా వ్యవహరిస్తోంది

AP Minister Kannababu Fires On Pawan Kalyan - Sakshi

పవన్ సినిమాలు వదిలిపెట్టినా డైలాగ్‌లు వదల్లేదు

ఇసుక సమస్య 15 రోజుల్లో పరిష్కారం

పవన్‌పై మంత్రి కన్నబాబు ఆగ్రహం

సాక్షి, కాకినాడ: అధికారం చేపట్టిన కేవలం  ఐదు నెలల్లోనే ఎన్నికల ముందు ఇచ్చిన అనేక హామీలు అమలు చేసిన తమ ప్రభుత్వాన్ని చూసి ఒర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారని వ్యవసాయ మంత్రి కన్నబాబు విమర్శించారు. ప్రభుత్వం ఇసుకను దాచిపెట్టి కృతిమ కొరత సృష్టించినట్లు అవగహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. భారీ వర్షాలు, వరదలు వల్ల ఇసుక తీయడం సాధ్యం కాలేదని, రాష్ట్రంలో కొంత ఇసుక కొరత ఉందన్న విషయం వాస్తవమని మంత్రి వివరించారు. ఇసుక సమస్యను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీ గుంటనక్కలా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ కష్టాల్లో ఉన్నప్పుడల్లా జనసేన అధ్యక్షుడు  పవన్‌ కల్యాణ్‌ బయటకు వస్తారని విమర్శలు గుప్పించారు. 

ఇసుక సమస్యకు 15 రోజుల్లో పరిష్కారం..
కన్నబాబు మంగళవారం కాకినాడలో మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘విశాఖలో లాంగ్‌ మార్చ్‌ పేరుతో పవన్‌ షో చేశారు. ఒక్క అడుగు కూడా నడవకుండా వాహనంపై ఊరేగారు. పక్కన టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడికి పెట్టుకుని మాట్లాడారు. ఇసుక దోపిడి చేసిన వారికి పక్కన పెట్టుకుని మాట్లాడారు. అక్కడున్న నాయకులంతా గతంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దారి మళ్లించిన వారే. అయ్యన్నపాత్రుడు కుమారుడు చిరంజీవిపై ఎన్నో విమర్శలు చేశారు. పవన్‌ కల్యాణ్‌ గతంలో ఏరోజైనా భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద గళం ఎత్తారా?. భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ నిధి కోసం గతంలో ‘ఛలో కాకినాడ’ చేపట్టినప్పుడు  పవన్‌ కల్యాణ్‌ వారికి ఎందుకు వారికి మద్దతు ఇవ్వలేదు?. ఇసుక సమస్య మరో 15 రోజుల్లో పరిష్కారం కానుంది. ఈ విషయం తెలిసి కూడా డ్రామాలు ఆడుతున్నారు. ప్రభుత్వం ఏర్పడి కేవలం 5 నెలలే అయింది. కానీ నెల తిరగక ముందు నుంచే చంద్రబాబు, ఆయన పార్టనర్‌ పవన్‌ ప్రభుత్వాన్ని తిట్టడం మొదలు పెట్టారు. పవన్‌ కళ్యాణ్‌ సినిమాలు వదిలిపెట్టినా డైలాగ్‌లు వదలడం లేదు. అదే విధంగా డ్రామాలు చేస్తున్నారు. ఈ డ్రామాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు.

సీఎం జగన్‌ని చూసి సంస్కారం నేర్చుకోండి..
ఈ తరహా డ్రామాలు చంద్రబాబు డైరెక్షన్‌లో చేస్తే, వెంటనే వాటిని విడిచి పెట్టండి. ఎందుకంటే సినిమాల్లో మాదిరిగా నటిస్తూ డైలాగ్‌లు కొడితే ఓట్లు పడవు. జగన్‌ని చూసి సంస్కారం నేర్చుకోవాలి. 151 స్థానాలు, 22 ఎంపీ సీట్లు గెల్చినా ఎంత ఒదిగి ఉంటున్నారో చూడండి. ప్రభుత్వంలో తప్పులు ఉంటే చెప్పండి.  పవన్‌ కల్యాణ్‌ 2 లక్షల పుస్తకాలు చదివానంటున్నారు. వాటిలో ఎక్కడైనా వరదల్లో ఇసుక ఎలా తీయాలని ఉంటే చెప్పండి. వెంటనే ప్రయత్నిస్తాము. ఒక్క ఎమ్మెల్యే గెలిస్తేనే ఈ విధంగా వ్యవహరిస్తే ఎలా?. జనసేనకు చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడా ఇటీవల ప్రభుత్వ సంక్షేమ పథకాలను అభినందిస్తూ పాలాభిషేకం చేశారు. కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం కూలిపోతుందని పవన్‌ అన్నారు. మరి అక్రమ కట్టడాలు కూల్చవద్దా?. నిజం చెప్పాలంటే చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడాన్ని కూలుస్తారని పవన్‌ భయం. రెండున్నర కిలోమీటర్ల నడకను లాంగ్‌ మార్చ్‌గా చెబితే, 3648 కి.మీ నడిచిన వైఎస్‌ జగన్‌ యాత్రను ఏమనాలి?.

టీడీపీ అభ్యర్థిని ఓడించడానికి చంద్రబాబు ప్రయత్నం.,
పవన్‌ స్థిరంగా నిలబడి ఎక్కడైనా కనీసం ఒక్క నిమిషం అయినా మాట్లాడగలుగుతాడా? ఆయన ఊపులు, అరుపులకు ఎవరూ భయపడరు. ఎన్నికలకు రెండు రోజుల ముందు కరప వచ్చిన పవన్‌.. నన్ను ఇష్టం వచ్చినట్లు తిట్టారు. నన్ను తరిమి తరిమి కొట్టమని పిలుపునిచ్చారు. కానీ నన్ను 10 వేల ఓట్లతో ప్రజలు గెలిపించారు. మరి ఎవరిని రెండు చోట్ల ప్రజలు తరిమి తరిమి కొట్టారో అందరికి తెలుసు. 2014లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి 44 వేల ఓట్లు సాధించాను. ఆ తర్వాత 2019లో జగన్‌ గారు టికెట్‌ ఇచ్చి గెలిపించారు. మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఆ విధంగా నేను ఎప్పటికీ తీర్చుకోలేని రుణగ్రస్తుడిని చేశారు. నేను మంత్రిగా తొలిసారి మీడియా ముందుకు వచ్చినప్పుడు కూడా చిరంజీవిని గుర్తు చేశాను. ఆయనే తనకు రాజకీయ జీవితం ఇచ్చారని చెప్పాను. నేనూ, పవన్‌ కళ్యాణ్‌ ఒకేసారి 2008లో రాజకీయాల్లోకి వచ్చాం. కానీ ఏనాడైనా పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాల్లోకి వచ్చాక చిరంజీవి గురించి మాట్లాడారా? గాజువాకలో పవన్‌ను గెలిపించేందుకు, స్వయంగా టీడీపీ అభ్యర్థిని ఓడించడానికి చంద్రబాబు ప్రయత్నించలేదా?. అదే విధంగా మంగళగిరిలో లోకేష్‌కు పోటీగా  పవన్‌ కల్యాణ్‌ తన అభ్యర్థిని నిలబెట్టలేదు. ఈ రాజకీయాలన్నీ ఎవరికీ తెలియవా?’ అని అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top