పుస్తకాల మోత..వెన్నుకు వాత

స్కూల్ బ్యాగ్‌ల బరువు తగ్గించాలని ఆదేశించిన కేంద్రం
పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
బడులు తెరిచే సమయం దగ్గర పడుతున్నా నిర్లక్ష్యం
చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఇచ్చిన అర్జీలు బుట్టదాఖలు!
సాక్షి, అమరావతి: బడి పిల్లల పుస్తకాల బరువు తగ్గించాలని గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినా ఏపీ సర్కారు పట్టించుకోలేదు. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలన్నీ జీవోలు జారీచేసి పిల్లల పుస్తకాల బరువును తగ్గించాయి. మన రాష్ట్రం మాత్రం ఈ విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. బాలబాలికల శారీరక, మానసిక ఎదుగుదల అనేది వారికి ఉన్న హక్కు. బరువైన పుస్తకాల సంచులను వీపు మీద మోయటం వల్ల విద్యార్థులు వెన్నుపూస, ఎముకల సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు.
ఈ నేపథ్యంలో ఎందరో వైద్యులు, బాలల హక్కుల ఉద్యమకారుల కృషితో కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల శాఖ పిల్లలు మోసుకెళ్లే సంచులు, ఇంటివద్ద చేసే హోమ్ వర్క్‌పై మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేస్తే ఆ మార్గదర్శకాలు అమలులోకి వస్తాయి. ఇప్పుడు ఆలస్యం చేస్తే ఈ విద్యా సంవత్సరంలో కూడా పిల్లలు ఆ మోత బరువు నుంచి విముక్తి కాలేరు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం.. తరగతులను బట్టి బ్యాగుల భారం నిర్దేశించారు. కనిష్టంగా కేజీన్నర.. గరిష్టంగా 5 కేజీలు మాత్రమే పుస్తకాల బరువు ఉండాలి. తరగతుల వారీగా నిర్దేశించిన బరువు కంటే ఎక్కువ బరువును విద్యార్థులపై మోపితే స్కూల్ టీచర్లు, యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రభుత్వం వెంటనే ఆదేశాలు ఇవ్వాలి
బడి పిల్లలపై మోయలేని పుస్తకాల భారాన్ని తగ్గించాలని కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో జారీ చేయాలి. ఇతర రాష్ట్రాల్లో కేంద్ర మార్గదర్శకాలు అమలవుతున్నాయి. బడులు తెరవటానికి మరో 22 రోజుల గడువు ఉంది. అప్పటిలోగా పుస్తకాల బరువు తగ్గించే జీవో జారీ చేయాలి. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్‌కు, ముఖ్య కార్యదర్శికి అర్జీలు ఇచ్చాం. అయినా స్పందన లేదు.
– బీవీఎస్ కుమార్, చైర్మన్, కృష్ణా జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి