కరోనా కట్టడిలో ఏపీ భేష్‌

AP Govt is effective in controlling the Covid-19 Virus - Sakshi

వైరస్‌ నియంత్రణలో సమర్థంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

మెరుగైన పనితీరు కనబరుస్తున్న దక్షిణాది రాష్ట్రాలు

వీటిలో మే 3 తర్వాత కేసులు తక్కువగా ఉండవచ్చని అంచనా  

ఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్థాన్, యూపీలో ప్రమాద ఘంటికలు 

‘టైమ్స్‌ నౌ’ చానల్‌ విశ్లేషణ

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా కట్టడి చేయడంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సమర్థంగా వ్యవహరిస్తోందని ప్రముఖ జాతీయ ఛానల్‌ ‘టైమ్స్‌ నౌ’ విశ్లేషించింది. ఏపీతోపాటు కేరళ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు కరోనా నియంత్రణలో మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయని విశ్లేషణలో పేర్కొంది. కరోనా ప్రభావాన్ని అదుపు చేయడంలో దక్షిణాది రాష్ట్రాలు మెరుగ్గా ఉన్నట్లు తెలిపింది. దేశంలో కరోనా వైరస్‌ కేసుల నమోదు మొదలైనప్పటి నుంచి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న తీరు, నిర్వహిస్తున్న పరీక్షలు, కేసుల తీవ్రత తదితర అంశాల ఆధారంగా ‘టైమ్స్‌ నౌ’ చానల్‌ విశ్లేషణ నిర్వహించింది. మే 14 నాటికి దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్యపై కూడా అంచనా వేసింది. 

పటిష్ట చర్యలు
ఆ విశ్లేషణ ప్రకారం ఏపీ, కేరళ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలలో కేసుల పెరుగుదల తక్కువగా ఉంటుందని అంచనా వేసింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటుండటమే అందుకు కారణమని పేర్కొంది. మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, యూపీలో కేసుల పెరుగుదల అధికమై పరిస్థితి సంక్లిష్టంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

రాష్ట్రంలో మరో 38 కరోనా కేసులు
రాష్ట్రంలో కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసుల సంఖ్య 572కు చేరుకుంది. తాజాగా.. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన బులెటిన్‌లో కొత్తగా 38 కేసులు నమోదైనట్లు పేర్కొంది. ఇందులో కర్నూలు జిల్లాలో 13 కేసులు నమోదు కాగా.. నెల్లూరులో 6, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఐదేసి కేసులు.. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నాలుగేసి కేసులు చొప్పున, వైఎస్సార్‌ కడప జిల్లాలో ఒక కేసు నమోదయ్యాయి. వైఎస్సార్‌ కడప జిల్లా నుంచి ఒక్కరోజే 13 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. అలాగే, అనంతపురం జిల్లా నుంచి ఇద్దరు కోలుకోవడంతో డిశ్చార్జి చేశారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 35కి చేరింది. వైఎస్సార్‌ కడప జిల్లా తర్వాత అత్యధికంగా విశాఖ జిల్లా నుంచి 10 మంది డిశ్చార్జి అయ్యారు. మరోవైపు.. ఇప్పటివరకు కరోనా బారినపడి 14 మంది మరణించారు. ఆసుపత్రుల్లో 523 మంది చికిత్స పొందుతున్నారు.

తెలుగు రాష్ట్రాలు మెరుగు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కోవిడ్‌ కేసుల డబ్లింగ్‌ రేటు జాతీయ సగటు కంటే మెరుగ్గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. జాతీయ సగటు కంటే మెరుగైన రేటు కనబరిచిన రాష్ట్రాల జాబితాలో మొత్తం 19 రాష్ట్రాలు ఉన్నాయి. లాక్‌ డౌన్‌ కంటే ముందు దేశంలో కేసుల సంఖ్య రెట్టింపు (డబ్లింగ్‌) అయ్యేందుకు 3 రోజులు పట్టగా.. లాక్‌ డౌన్‌ అమలు చేశాక అది మెరుగైంది. గడిచిన వారం రోజుల్లో డబ్లింగ్‌ రేట్‌ 6.2 రోజులుగా ఉంది. జాతీయ సగటు కంటే మెరుగ్గా ఉన్న రాష్ట్రాల్లో పటిష్ట నిరోధక చర్యలతో కేసుల సంఖ్య తగ్గిందని ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే ఏప్రిల్‌ 1 నుంచి కేసుల గ్రోత్‌ ఫ్యాక్టర్‌ 1.2 గా ఉందని, అంతకుముందు రెండు వారాల్లో ఇది 2.1గా ఉందని తెలిపింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top