రివిజన్‌ పిటిషన్‌ పేరుతో మరో మోసం | ap govt camouflage Fathima college students | Sakshi
Sakshi News home page

రివిజన్‌ పిటిషన్‌ పేరుతో మరో మోసం

Nov 2 2017 3:48 AM | Updated on Oct 9 2018 7:52 PM

ap govt camouflage Fathima college students - Sakshi

సాక్షి, అమరావతి : వంద మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టి తమ నిర్లక్ష్యాన్ని చాటుకున్న సర్కారు మరోసారి కోర్టుకు వెళుతున్నామంటూ వారిని మభ్యపెడుతోందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో సర్కారు కొత్త డ్రామాకు తెరతీసింది. 2015లో ఫాతిమా వైద్య కళాశాలలో చేరిన విద్యార్థుల సీట్లు రద్దు కాగా.. అప్పట్నుంచీ చలించని సర్కారు ఇక అవకాశమే లేనప్పుడు ముందుకొచ్చి వారి జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో రివిజన్‌ పిటిషన్‌ వేస్తున్నామని ప్రకటించింది. ఇది కేవలం కంటితుడుపు చర్యేనని సచివాలయంలోని కొందరు అధికారులు వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం రివిజన్‌ పిటిషన్‌ వేస్తే సుప్రీం ధర్మాసనం తీసుకోదని సుప్రీంకోర్టుకు చెందిన కొంతమంది న్యాయవాదులు ఇప్పటికే సూచించారన్నారు. ఫాతిమా విద్యార్థుల ఆందోళనలను తాత్కాలికంగా నిలిపి వేయించడానికే ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసిందని చెబుతున్నారు. ఒకసారి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక ఇలాంటి కేసులో రివిజన్‌ పిటిషన్లు, స్పెషల్‌ లీవ్‌ పిటిషన్లను స్వీకరించదని న్యాయవాదులు స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు. అన్ని దారులూ మూసుకుపోయాక ప్రభుత్వం స్పందించిందని అధికారులు విశ్లేషించారు. 2008లో ఇలాగే జరిగినప్పుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం స్పందించి వారం రోజుల్లోనే వంద మంది విద్యార్థులను వివిధ ప్రభుత్వ కళాశాలల్లో చదివించిందని, కానీ ఇక్కడ అలాంటి చర్యలు చేపట్టలేకపోయారని అధికార వర్గాలు చెప్పాయి.

ఏమాత్రం వీలున్నా న్యాయం జరిగేలా చూస్తా..
కాగా ఒక్క శాతం అవకాశమున్నా న్యాయం జరిగేలా చూస్తామని ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులకు సీఎం చంద్రబాబు హామీఇచ్చారు. న్యాయంకోసం ఆందోళన చేస్తున్న ఫాతిమా వైద్య విద్యార్థులను బుధవారం వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ సీఎం వద్దకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సమస్యను పరిష్కరించేందుకు తొమ్మిది మందితో కమిటీ వేస్తున్నట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement