హోంగార్డులకు స్థలయోగం

AP Government Will Provide Home Places For Home Guards - Sakshi

ఇంటి నిర్మాణానికి రూ.1.50లక్షల వంతున కేటాయింపు 

జీఓ నంబర్‌ 77 విడుదల చేసిన ప్రభుత్వం 

జిల్లా వ్యాప్తంగా 661 మందికి లబ్ధి 

హర్షం వ్యక్తం  చేస్తున్న హోంగార్డులు 

ఇన్నాళ్లకు వారి వెతలు తీరాయి. వారి ఆకాంక్షలు నెరవేరుతున్నాయి. వారి గురించి పట్టించుకునే పాలకులు లభించారు. అచ్చంగా పోలీసు విధులే నిర్వర్తిస్తున్నా ఎలాంటి సౌకర్యాలకు నోచుకోక... అరకొర వేతనాలే లభిస్తున్నా కష్టాలకు వెరవక... ఇబ్బందులు ఎదురవుతున్నా... వాటిని మునిపంటినే దాచుకుని విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డులకు ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి. వారికీ స్థలాలిచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అంతేనా... వాటిపై ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం చేయాలని కూడా ఉత్తర్వులు జారీ చేసింది. 

విజయనగరం పూల్‌బాగ్‌:  రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా చేపట్టిన ఉగాదినాటికి ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో పోలీస్‌ శాఖలో వివిధ విభాగాల్లో ఎన్నో సేవలు అందిస్తున్న హోంగార్డులకు ఇళ్ల స్థలాలు ఇవ్వనుంది. అందుకోసం ఇటీవల జీఓ 77ను విడుదల చేసింది. దీని ప్రకారం హోంగార్డుల సంవత్సర ఆదాయం రూ.3 లక్షల లోపు ఉన్నవారు అర్హులుగా పేర్కొంది. ఇప్పటికే ఈ జీఓ ప్రకారం జిల్లాకేంద్రంలోని విజయనగరం నియోజకవర్గం పరిధిలో దరఖాస్తుల స్వీకరణ కూడా పూర్తయింది. ఇంకా 

మండలాల వారీగా ఆయా తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంది. చాలా మండలాల్లో తహసీల్దార్లు దీనిపై దృష్టి సారించకపోవటంపై ఆయా మండలాల పరిధిలోగల హోంగార్డులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం తమ కష్టాన్ని గుర్తించి న్యాయం చేసేందుకు ముందుకు వస్తుంటే అధికారుల నిర్లక్ష్యం వల్ల వచ్చిన అవకాశాలు చేతికి అందకుండా పోతున్నాయని ఆందోళన చెందుతున్నారు.

తహసీల్దార్లకు ఆదేశాలు 
ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన జీఓ ప్రకారం కలక్టర్‌ హరిజవహర్‌లాల్, గృహ నిర్మాణశాఖాధికారులకు, తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. చాలా చోట్ల దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది. కొన్ని చోట్ల అసలు ప్రారంభం కాలేదు. ఇదిలా ఉండగా  హోంగార్డులకు కూడా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో అందరితో పాటు పట్టాలు అందజేయనున్నారు. వీరికి ప్రధాన మంత్రి ఆవాస్‌యోజన స్కీం ద్వారా గృహ నిర్మాణానికి రూ.1.50లక్షలు అందజేయనున్నారు. వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్ర సమయంలో, ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా పలు సందర్భాల్లో హోంగార్డుల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సమస్యలను విన్నవించుకున్నారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి హోంగార్డులకు కూడా ఇళ్ల స్థలాల పంపిణీ, ఆ తరువాత ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సహాయం అందజేసేందుకు జీఓ నంబర్‌.77ను విడుదల చేశారు.   

సీఎంకు రుణపడి ఉంటాం... 
హోంగార్డుల సమస్యలపై చాలా సార్లు చాలా ముఖ్యమంత్రులకు వినతులు అందజేశాం. ఎవరూ పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం మా సమస్యలు విని వాటిని పరిష్కరించేందుకు, మాకు గూడు కలి్పంచేందుకు ఇప్పుడు జీఓ నెం.77 విడుదల చేశారు. హోంగార్డులందరికీ గృహనిర్మాణంకోసం, ఇళ్ల స్థలాలు అందజేస్తున్నారు. ఆయన సేవలు మరువలేనివి. 
– పడగల బంగార్రాజు, జిల్లా అధ్యక్షుడు, హోంగార్డులసంక్షేమ సంఘం. విజయనగరం.  

బీమా పెంచారు. 
గతంలో కంటే ఇప్పుడు బీమా మొత్తం చాలా ఎక్కువ పెంచారు. హోంగార్డులు ప్రమాద వశాత్తు చనిపోతే రూ.30లక్షలు బీమా సదుపాయం కల్పించారు. దీనివల్ల కొంత భరోసా లభించింది. హోంగార్డుల విషయంలో ముఖ్యమంత్రి ఎంతో సానుకూలంగా వ్యవహరిస్తున్నారు.  
– ఎస్‌.గోపాల్, హోంగార్డు, జిల్లా కమిటీ సభ్యుడు, పార్వతీపురం. 

జీతాలు పెంచారు. 
వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక హోంగార్డుల జీతాలు పెంచారు. వాటితో పాటు బీమా పెంచారు. ఇప్పుడు నివాసం కోసం ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణానికి నిధులు సమకూరుస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. 
– ఎస్‌.రవి, హోంగార్డు, జిల్లా కమిటీ సభ్యులు,విజయనగరం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top