తీపి కబురు!

AP Government Support Horticultural crops in Prakasam - Sakshi

ఉద్యానపంటలకు ప్రభుత్వ ప్రోత్సాహం

పెరిగిన సాగు

పెరిగిన అరటి, జామ, దానిమ్మ వంటి పంటల విస్తీర్ణం  

త్రిపురాంతకం: ఉద్యాన పంటలు కళకళలాడుతున్నాయి. వీటికి ప్రభుత్వ ప్రోత్సాహం లభించడంతో రైతులు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు. గత నాలుగేళ్లుగా వర్షాలు లేక తోటలు ఎండుముఖం పడుతు కళావిహీనంగా మారాయి. అయితే ఈ ఏడాది వర్షాలు అధికంగా కురవడంతో మళ్లీ జీవం వచ్చినట్లైంది. రైతు భరోసా కేంద్రాలు కూడా అందుబాటులోకి రావడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా రైతుల ఉత్సాహం
జిల్లాలో పండ్ల తోటలను అధిక విస్తీర్ణంలో సాగుచేసేదిశగా అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వం రాయితీలు ప్రకటించడంతో పాటు వాతావరణం అనుకూలంగా ఉంది. ఉద్యాన పంటలకు అనువైన భూములు ఉండటం మంచి అవకాశంగా మారింది. కొన్ని పంటలకు ఎక్కువగా నీరు అవసరం కాగా.. మిగిలినవి వర్షాధారం. పశ్చిమ ప్రకాశంలో ఒకప్పుడు బత్తాయి, నిమ్మ, బొప్పాయి, అరటి తోటలు విస్తారంగా ఉండేవి. మళ్లీ ఈ పంటలు పూర్వవైభవం పొందే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో బత్తాయి 11685 హెక్టార్లు, నిమ్మ 4,123, మామిడి 10,458, అరటి 801 హెక్టార్లు, సపోట 3201, బొప్పాయి 1940, జామ 725 హెక్టార్లలో తోటలు సాగులో ఉన్నాయి. ఈ ఏడాది వాతావరణం అనుకూలించడంతో రైతులు దీర్ఘకాలిక పండ్ల తోటల సాగుపై ఆలోచిస్తున్నారు. అధికారులు కూడా ప్రోత్సహిస్తున్నారు. 

తోటల పెంపకానికి ప్రోత్సాహం
జిల్లాలో గత ఏడాది పదివేల ఎకరాల్లో తోటల పెంపకాన్ని లక్ష్యంగా పెట్టుని ప్రోత్సహించారు. దీంతో ఈఏడాది ఉత్సాహంతో రైతులు ముందుకు వస్తున్నట్లు తెలుపుతున్నారు. ఉపాధిహామీ నుంచి మొక్కలు, నాటేందకు గుంతలు, నిర్వహణ వ్యయం కింద ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి. అదేవిధంగా ఉద్యాన శాఖ నుంచి ఎకరా బత్తాయికి 16,004 రూపాయలు, మామిడి రూ. 13,300, అరటి రూ. 40,985, బొప్పాయి రూ. 24,662, దానిమ్మ రూ. 26,672, జామ రూ. 29,331, సపోట రూ. 10,896, పసుపుకు రూ. 12,000 చొప్పున మూడేళ్లు మూడు దఫాలుగా ఆర్థిక సహాయం అందిస్తున్నారు. నీటి నిల్వ కోసం ఫారంపాండ్‌ల నిర్మాణంకు రూ. 75 వేల వరకు రాయితీలు అందించారు. యాంత్రీకరణ పరికరాలను 50 శాతం సబ్సిడీపై అందిస్తున్నారు.

గతం నరకం..
ఒకప్పుడు వాతావరణం అనుకూలంగానే ఉంది. దాంతో తోటలు అధికంగా సాగుచేశారు. రానురాను వాతావరణంలో వచ్చిన మార్పులకు నీటి ఎద్దడి కారణంగా తోటలు దెబ్బతిన్నాయి. పశ్చిమ ప్రాంతంలో బత్తాయికి అనుకూలంగా ఉండటంతో రైతాంగం దీనిపై ఆసక్తిని పెంచుకుని తోటలు సాగుచేశారు. గత పాతికేళ్లుగా ఇక్కడ బత్తాయి, నిమ్మ వంటి పంటలతో కళకళలాడుతూ తోటలు దర్శనమిచ్చేవి. కాలక్రమేణ వర్షాలు తగ్గిపోవడం భూగర్భజలాలు అడుగంటిపోయాయి. ప్రకతి వైపరీత్యాలు వెంటాడాయి. ఎండలు అధికం కావడం, తీవ్ర నీటి ఎద్దడి కారణంగా తోటలు కళ తప్పాయి. పదేళ్లుగా బోర్లలో నీరు అడుగంటి పోయింది. ఇలాంటి పరిస్థితుల తర్వాత ప్రస్తుతం తరచూ వర్షాలు పడుతుండటంతో ఈదిశ నుంచి రైతులు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top