హై పవర్‌ కమిటీ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం

AP Government Sets Up High power Committee For Capital issue - Sakshi

రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై ఇచ్చిన నివేదిక అధ్యయనానికి హై పవర్‌ కమిటీ

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం హైపవర్‌ కమిటీని నియమించింది.  జీఎన్‌ రావు కమిటీ నివేదికతో పాటు ఇతర నివేదికలను ఈ హైపవర్‌ కమిటీ అధ్యయనం చేయనుంది. 10మంది మంత్రులు సహా మొత్తం 16మంది ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. అలాగే ఈ కమిటీ ప్రపంచ ప్రఖ్యాత బోస్టన్‌ కన్సల్టెంట్‌ గ్రూపు (బీసీజీ) నివేదికల్లోని అంశాల సమగ్ర, తులనాత్మక పరిశీలన చేయనుంది. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి జీఎన్‌రావు నేతృత్వంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన విషయం తెలిసిందే. ఇవే అంశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని బీసీజీని సైతం ఇప్పటికే ప్రభుత్వం కోరింది. వచ్చే నెల మొదటి వారంలో ఈ సంస్థ నివేదిక ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు నివేదికలను అధ్యయనం చేసి రిపోర్టు సమర్పించడం కోసం మంత్రులు, సీనియర్‌ ఐఏఎస్‌లతో హైపవర్‌ కమిటీ ఏర్పాటు చేయాలని శుక్రవారం కేబినెట్‌ తీర్మానం చేసింది.

ఇక ఈ కమిటీలో  ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్‌, హోంమంత్రి మేకతోటి సుచరిత, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, మత్స్య, మార్కెటింగ్‌ శాఖల మంత్రి మోపిదేవి వెంకటరమణ, పౌర సరఫరాల శాఖమంత్రి కొడాలి నాని, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని,  ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం, ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌,సీసీఎల్‌ఏ, చీఫ్‌ సెక్రటరీ, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ సెక్రటరీ, లా సెక్రటరీలు,  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిమెంబర్‌ కన్వీనర్‌గా ఉన్నారు. మూడు వారాల్లోగా ఈ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందచేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అవసరం అనుకుంటే హై పవర్‌ కమిటీ అడ్వకేట్‌ జనరల్‌ సలహాలు తీసుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top