ఆ బిల్లుల శాసన ప్రక్రియ ముగింపు కోసం వేచి చూస్తున్నాం

AP Government reported to High Court on Capital City Evacuation - Sakshi

రాజధాని తరలింపు వ్యవహారంలో కౌంటర్‌ దాఖలు చేసిన ప్రభుత్వం  

సాక్షి, అమరావతి: కార్యనిర్వాహక రాజధానిని విశాఖపట్నంకు తరలించే విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసింది. అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టాల ఉపసంహరణ బిల్లులకు సంబంధించిన శాసనపరమైన ప్రక్రియ ముగింపు కోసం వేచి చూస్తున్నామని హైకోర్టుకు నివేదించింది. ఆ తరువాత తగిన సమయంలో చట్ట నిబంధనలకు లోబడి తగిన నిర్ణయం తీసుకుంటామని వివరించింది. రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నంకు తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, వీటిని అడ్డుకోవాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు, కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ప్రభుత్వం తరఫున సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ కౌంటర్‌ దాఖలు చేశారు. ఆందోళన ఆధారంగా దాఖలు చేసే వ్యాజ్యాలకు విచారణార్హతే లేదన్నారు. 

దశలవారీ అమలుకు కట్టుబడి ఉన్నాం
హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్రంలో దశల వారీగా మద్య నియంత్రణకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు రాష్ట్రంలో మద్యం విక్రయాలను నిషేధించేలా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ దాఖలైన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు  సోమవారం మరోసారి విచారణ జరిపింది. ధర్మాసనం ఎదుట ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్‌ వాదనలు వినిపించారు. మద్య నిషేధం దశల వారీగా అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆదాయం విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని తెలిపారు. తమిళనాడులో మద్యం షాపుల వద్ద అదుపు చేయలేని స్థాయిలో జనాలు ఉండటంతో మద్యం విక్రయాలను ఆపాలని మద్రాసు హైకోర్టు ఆదేశాలిచ్చిందని, అయితే రాష్ట్రంలో అటువంటి పరిస్థితి లేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామన్నారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top