జ్యుడీషియల్‌ ప్రివ్యూకు చకచకా ఏర్పాట్లు

AP Government Preparing To Set Up Judicial Preview For Tenders - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో టెండర్ల ప్రక్రియను పూర్తిగా ప్రక్షాళన చేసి అవినీతిరహితంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాటైన ‘న్యాయపరమైన ముందస్తు సమీక్ష’కు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఏపీ మౌలిక సదుపాయాల(న్యాయపరమైన ముందస్తు సమీక్ష ద్వారా పారదర్శకత) చట్టాన్ని రాష్ట్రసర్కారు తీసుకురావడం, టెండర్ల న్యాయ పరిశీలన బాధ్యతలను హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ బి.శివశంకరరావుకు అప్పగిస్తూ ఆదేశాలివ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్‌ బి.శివశంకరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం జ్యుడీషియల్‌ ప్రివ్యూ ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లపై దృష్టిపెట్టారు.

ఇందులో భాగంగా సచివాలయంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎస్‌ మాట్లాడుతూ జ్యుడీషియల్‌ ప్రివ్యూ జడ్జికి అవసరమైన సాంకేతిక, ఇంజనీరింగ్‌ నిపుణుల జాబితాలను సంబంధిత శాఖలన్నీ తక్షణం పంపించాలని ఆదేశించారు. ఆ జాబితాల్లోని వారి గత రికార్డుపై విజిలెన్స్‌ నివేదికల్ని తీసుకోవడంతోపాటు ఎటువంటి మచ్చలేని వారితోనే జాబితాలను పంపాలన్నారు. జ్యుడీషియల్‌ ప్రివ్యూ చట్టాన్ని అనుసరించి రాష్ట్రంలోని ప్రభుత్వ ఏజెన్సీలు లేదా స్థానిక అధికారి రూ.100 కోట్లు.. అంతకుమించిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్‌ ప్రక్రియకు వెళ్లేముందు ఆయా పత్రాలన్నింటినీ న్యాయపరమైన సమీక్షకోసం ముందుగా న్యాయమూర్తికి సమర్పించాలని సంబంధిత శాఖలకు నిర్దేశించారు. ఒకసారి జ్యుడీషియల్‌ ప్రివ్యూ పరిశీలన చేశాక సంబంధిత టెండర్‌ ప్రక్రియలో ప్రీబిడ్‌ నెగోషియేషన్స్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. అలాగే జ్యుడీషియల్‌ ప్రివ్యూ జడ్జి పరిశీలన అనంతరం ప్రభుత్వానికి పంపాక దానికి కట్టుబడి ఉండాల్సిందేనని, ఇందులో ఎటువంటి మినహాయింపులు ఉండబోవన్నారు. 

‘స్పందన’కు ప్రామాణిక విధానాన్ని పాటించాలి 
‘స్పందన’ కార్యక్రమం కింద వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించేందుకు అన్ని శాఖలూ ఒకే ప్రామాణిక విధానాన్ని(స్టాండర్డ్‌ ఆపరేటివ్‌ ప్రొసీజర్‌) పాటించాలని సీఎస్‌ ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ‘స్పందన’పై వర్క్‌షాప్‌ జరిగింది. ప్రజలనుంచి వచ్చే ‘స్పందన’ ఫిర్యాదుల పరిష్కారంలో అనుసరించాల్సిన ‘స్టాండర్డ్‌ ఆపరేటివ్‌ ప్రొసీజర్‌’పై సంబంధిత శాఖల అధికారులకు సీఎస్‌ సూచనలిచ్చారు. ప్రతి ఫిర్యాదు పరిష్కారానికి నిర్దిష్ట కాలవ్యవధి పెట్టి ఆ గడువులోగా సదరు ఫిర్యాదును పరిష్కరించడంతోపాటు ఆ సమాచారాన్ని ఫిర్యాదుదారునికి తెలియజేయాలని ఆదేశించారు.

‘స్పందన’ ఫిర్యాదుల పరిష్కారంపై జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమాల షెడ్యూల్‌ను సిద్ధం చేసి ఆ వివరాల్ని ప్రణాళికా శాఖకు అందించాలని సూచించారు. అలాగే ఫిర్యాదుల పరిష్కారానికి శాఖలవారీగా రూపొందించిన కాలవ్యవధి(టైమ్‌ లైన్‌), స్టాండర్డ్‌ ఆపరేటివ్‌ ప్రొసీజర్‌ వివరాల్నీ అందించాలన్నారు. వచ్చే ప్రతి ఫిర్యాదును సకాలంలో సక్రమంగా పరిష్కరించడంపై అన్ని శాఖల కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిర్దేశించారు. ప్రతి ఫిర్యాదు ఆమోదానికి ముందు.. లబ్ధిదారు ఎంపిక అనంతరం సోషల్‌ ఆడిట్‌ తప్పనిసరన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top