బందరు ఫిషింగ్‌ హార్బర్‌కు మహర్దశ!  | Sakshi
Sakshi News home page

బందరు ఫిషింగ్‌ హార్బర్‌కు మహర్దశ! 

Published Thu, Jan 2 2020 10:40 AM

AP Government Focus On Development Of Bandar Fishing Harbor - Sakshi

సాక్షి, అమరావతి: బందరు ఫిషింగ్‌ హార్బర్‌కు మహర్దశ పట్టనుంది. గత కొన్నేళ్లుగా అలంకారప్రాయంగా మారిన హార్బర్‌ అభివృద్ధికి ప్రభుత్వం నడుం బిగించింది. హార్బర్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక సదుపాయాలు, మౌలిక వసతులు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనికి రూ. 280 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేసింది. సముద్ర ముఖద్వారం వద్ద తరచూ ఇసుక మేటలు వేస్తుండటంతో అన్ని వేళల్లో మర పడవలు వేటకు వెళ్లే అవకాశాలు ఉండటం లేదు. కేవలం సముద్రానికి పోటు వచ్చిన సమయంలోనే వేటకు వెళ్లే వీలు ఉండటంతో నిర్వాహకులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒకసారి మర పడవ ఒడ్డుకు వస్తే మళ్లీ సముద్రానికి పోటు వచ్చినప్పుడు మాత్రమే వేటకు వెళ్లే అవకాశం ఉంటోంది. ఇలా పోటు వచ్చినప్పుడే సముద్రంలోకి వెళ్లాలంటే కనీసం 12 గంటల పాటు నిర్వాహకులు ఒడ్డున నిరీక్షించాల్సి వస్తోంది. పదేళ్ల క్రితం గిలకలదిండిలో రూ.4.70 కోట్లతో నిర్మించిన హార్బర్‌తో నిర్వాహకులకు పెద్దగా లబ్ధి చేకూరడం లేదు

నాడు సముద్ర ముఖద్వారం వద్ద ఇసుక మేటల తొలగింపునకు పూర్తి స్థాయి చర్యలు తీసుకోలేదు. ఇసుక మేటలు ఏర్పడే పరిస్థితులున్న హార్బర్ల వద్ద నిత్యం డ్రెడ్జింగ్‌ నిర్వహించాలని నిపుణులు సూచించినా.. ఆ కార్యక్రమాన్ని చేపట్టలేదు. ఇసుక మేటల సమస్య యథాతథంగానే ఉండటంతో మర పడవల నిర్వాహకులు బందరు ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం హార్బర్లకు తరలివెళ్లిపోతున్నారు. హార్బర్‌లోని సమస్యలను బందరు ఎమ్మెల్యే, మంత్రి పేర్ని నాని, మరో మంత్రి మోపిదేవి వెంకట రమణారావు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి తక్షణం చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు.

అన్ని సౌకర్యాల కల్పన 
బందరు హార్బర్‌లో ప్రస్తుత పరిస్థితులు, హార్బర్‌ విస్తరణకు చేపట్టాల్సిన చర్యలు, అభివృద్ధి కార్యక్రమాల అంచనాలపై డీపీఆర్‌ (సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక) రూపొందించే బాధ్యతను వాటర్‌ అండ్‌ పవర్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (వ్యాప్కోస్‌)కి అప్పగించారు. ఈ సంస్థ.. సముద్ర ముఖద్వారం వద్ద ఇసుక మేటల తొలగింపుతోపాటు ఎగుమతి, దిగుమతి సౌకర్యాలు, పరిపాలనా భవనం, మత్స్యకారులకు విశ్రాంతి గదులు, రేడియో కమ్యూనికేషన్‌ టవర్, బోట్‌ బిల్డింగ్, ఐస్‌ ప్లాంట్లు, దాదాపు 350 మర పడవలు లంగరు వేసుకోవడానికి అనువుగా కీవాల్‌ విస్తరణ, రక్షిత మంచినీటి సరఫరా, తదితర సౌకర్యాల కల్పనకు అంచనాలు రూపొందిస్తోంది. అన్ని అనుమతులు వచ్చాక హార్బర్‌ విస్తరణకు టెండర్లు ఆహ్వానించనున్నామని మంత్రి మోపిదేవి వెంకట రమణారావు తెలిపారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement