ప్రభుత్వ ఖర్చుతో ప్రకటనలు,హోర్డింగులు 'నిషేధం'

AP Elections Commissioner N Ramesh Kumar Comments On Local Body Elections - Sakshi

స్థానిక ఎన్నికలు పూర్తయ్యే వరకు అమలు 

నిర్లక్ష్యం చేస్తే తీవ్రంగా పరిగణిస్తాం 

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ప్రకటన  

సాక్షి, అమరావతి: స్థానిక’ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న దృష్ట్యా ప్రభుత్వ ఖర్చుతో ప్రకటనల జారీ, బహిరంగ ప్రదేశాలలో హోర్డింగ్‌ల ఏర్పాటుపై నిషేధం ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్‌. రమేష్‌ కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాయకుల విగ్రహాలకు ముసుగు వెయ్యాల్సిందేనని స్పష్టంచేశారు. మార్చి 7వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఈ కోడ్‌.. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఉంటుందన్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రవర్తనా నియమావళిని నిష్పాక్షికంగా అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రకటనలో ఎన్నికల కమిషనర్‌ తెలిపిన మరికొన్ని అంశాలు.. 

- ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో మంత్రుల ఫొటోలతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాల అధికారిక వెబ్‌సైట్ల నుంచి రాజకీయ నాయకులందరి ఫొటోలను వెంటనే తొలగిస్తాం. 
- ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రులు తదితర పార్టీల నాయకుల ఫొటోలను ప్రభుత్వ భవనాలు, వాటి ప్రాంగణాల్లో ప్రదర్శించడంపైనా నిషేధం. 
- ఈ నిబంధన జాతీయ నాయకులు, కవులు,  గతంలోని ప్రముఖ చారిత్రక వ్యక్తుల ఫొటోలకు, రాష్ట్రపతి, గవర్నర్ల చిత్రాలకు వర్తించదు. 
విద్యుత్‌ బిల్లులు, నీటి బిల్లులపైనా ఫొటోలు, ప్రకటనలు ఉండకూడదు.  
ఈ సూచనలు ఇప్పటివరకు అమలు చేయనట్లయితే  వెంటనే అమలు చేయాలి.  
- ఎన్నికల నియమావళి అమలులో నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే తీవ్రంగా పరిగణిస్తాం.  
- అభ్యర్థులను నామినేషన్‌ దాఖలు చెయ్యకుండా అడ్డుకునే చర్యలను కమిషన్‌ తీవ్రంగా పరిగణిస్తుంది.
- స్థానిక ఎన్నికలను స్వేచ్ఛగా, పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తాం. 
- పోటీచేసే అభ్యర్థులకు ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టిస్తున్నారన్న సమాచారంతో బాధ్యులపై చిత్తూరు జిల్లా కలెక్టర్‌ ఫిర్యాదుతో కేసు నమోదైంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top