రాజకీయ పార్టీలతో.. 17న ఈసీ భేటీ 

AP election commission will hold a meeting with various political parties on Jan17th - Sakshi

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై చర్చ 

18 రాజకీయ పార్టీలకు లేఖలు 

అనంతరం ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన 

సాక్షి, అమరావతి : ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఈనెల 17వ తేదీ శుక్రవారం వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనుంది. దీనికి హాజరుకావాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలతో పాటు వివిధ రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీలకు లేఖలు రాసినట్లు ఎన్నికల కమిషన్‌ కార్యాలయ అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. ఈ సమావేశం ఉ.11గంటలకు విజయవాడ బందరు రోడ్డులో ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో జరుగుతుందన్నారు. గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీలుగా ఆర్హత సాధించిన వాటిలో అధికార వైఎస్సార్‌సీపీతోపాటు టీడీపీ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలను సమావేశానికి హాజరుకావాలంటూ అధికారులు లేఖ రాశారు.

జనసేన పార్టీకి గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీగా అర్హత లేకపోయినప్పటికీ.. నిర్ణీత గుర్తు కలిగి ఉన్న రిజస్టర్డ్‌ పార్టీగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వద్ద నమోదు చేసుకోవడంతో ఆ పార్టీని కూడా సమావేశానికి ఆహ్వానించారు. వీటితో పాటు రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, నేషనలిస్టు కాంగ్రెస్, బీఎస్పీలకు కూడా లేఖలు రాశారు. వీటితో పాటు, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వద్ద నమోదు చేసుకున్న తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకేతోపాటు వివిధ రాష్ట్రాలలో గుర్తింపు పొందిన మరో ఆరు పార్టీలను కూడా ఆహ్వానించినట్లు అధికారులు వివరించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల నిర్వహణపై ఆయా రాజకీయ పార్టీల అభిప్రాయం సేకరించిన తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తారని అధికారులు చెబుతున్నారు. కాగా, శుక్రవారం సాయంత్రమే ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించే అవకాశం ఉంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top