డీఎస్సీ.. వాయిదాలేసి!

AP DSC 2018: Notification release date postponed? - Sakshi

మరోసారి తెరమీదకు టెట్‌ కమ్‌ టీఆర్టీ 

గందరగోళంలో నిరుద్యోగులు

సిలబస్‌ మార్పుతో మరింత ఆందోళన

వివాదాస్పదమవుతోన్న ‘ఆన్‌లైన్‌’ నిర్ణయం

ప్రభుత్వ తీరుతో అభ్యర్థుల ఆగ్రహం

డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వాలని డిమాండ్‌

టెట్‌కు హాజరైన అభ్యర్థులు    : 37వేలు
ఎస్జీటీ అభ్యర్థులు                 : 13వేలు
జిల్లాలో ప్రతిపాదిత పోస్టులు   : 604
ఆమోదం                            : 464
కేటాయించిన పీఈటీ పోస్టులు  : 103
చూపిన ఖాళీలు                    : 10

అనంతపురం ఎడ్యుకేషన్‌/ఎస్కేయూ: డీఎస్సీ ప్రకటన దోబూచులాడుతోంది. అదిగో.. ఇదిగో అనే హడావుడి నిరుద్యోగులను మానసిక సంఘర్షణకు లోనుచేస్తోంది. పోస్టుల విషయంలోనూ ఇప్పటికీ స్పష్టత కొరవడింది. అంకెల గారడీతో ప్రభుత్వం నిరుద్యోగులను అయోమయానికి గురి చేస్తోంది. మొదట 20వేల పోస్టులతో ప్రచారం ప్రారంభించి.. ఆ తర్వాత 14వేలు, 12,400, 9,500.. తాజాగా 6,100 పోస్టులు భర్తీ చేస్తామనడంతో అసలు ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్‌ ఇస్తారనే విషయంలో స్పష్టత కరువైంది. ప్రాథమిక షెడ్యూల్‌ ప్రకారం డీఎస్సీ ప్రకటన మంగళవారం విడుదల కావాల్సి ఉంది. 

అయితే వాయిదా పడింది. ఇంతవరకు ఎన్ని పోస్టులు ఉన్నాయి? రిజర్వేషన్, రోస్టర్‌ పాయింట్లపై స్పష్టత రాలేదని కొత్త నాటకాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. ఉద్యోగ నియామకాలకు షెడ్యూల్‌ ప్రకటించడం, ఆ తర్వాత వాయిదాలు వేయడంపై నిరుద్యోగ అభ్యర్థులు గుర్రుమంటున్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు అధికారికంగా షెడ్యూల్‌ను ప్రకటించిన విద్యా శాఖ నోటిఫికేషన్లు ఇవ్వకుండానే వాయిదా వేసింది. తాజాగా మూడో దఫా వాయిదా వేయడం గమనార్హం.

ఎ‘ట్టెట్టా’..
డీఎస్సీ రాత పరీక్షకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్‌ ఇస్తామని స్వయంగా మంత్రి గంటా శ్రీనివాసరావు 2017 నవంబర్‌లో ప్రకటించారు. టెట్‌ కమ్‌ టీఆర్టీ ఒకే పరీక్ష కాకుండా పాత పద్ధతిలోనే టెట్, డీఎస్సీని వేర్వేరుగా నిర్వహిస్తామని టెట్‌కు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. టెట్‌ ఫలితాలు ప్రకటించిన వెంటనే డీఎస్సీ ప్రకటన చేశారు. మొదటి దఫా ఆన్‌లైన్‌లో టెట్‌ నిర్వహించడంతో సాంకేతిక లోపాలు అధికం కావడానికి తోడు, తిరిగి టెట్‌ నిర్వహించాలని అభ్యర్థుల కోరిక మేరకు నెల రోజుల వ్యవధిలోనే టెట్‌ను నిర్వహించారు. ఫలితాలు విడుదల చేసిన తర్వాత అదిగో డీఎస్సీ.. ఇదిగో డీఎస్సీ అంటూ తేదీలు ప్రకటించడం మినహా.. ప్రకటన ఇవ్వకుండా ఊరిస్తూ వస్తున్నారు. దీంతో నిరుద్యోగులు ఆశతో కోచింగ్‌ సెంటర్‌లను వదలకుండా శిక్షణ తీసుకుంటూనే ఉన్నారు. ఇంటికి తిరిగి వెళ్లలేక.. కోచింగ్‌ సెంటర్‌లలో ఉండలేక నలిగిపోతున్నారు.

అభ్యర్థుల ఖర్చు తడిసి మోపెడు
డీఎస్సీ షెడ్యూల్‌ తరచూ వాయిదా పడుతుండటంతో నిరుద్యోగ అభ్యర్థులకు ఖర్చు  భారంగా మారుతోంది. అనంతపురం నగర కేంద్రంలోనే కాకుండా.. అవనిగడ్డ, కర్నూలులో ప్రత్యేకంగా డీఎస్సీ శిక్షణ తీసుకుంటున్నారు. గతంలో చివరిసారిగా నిర్వహించిన టెట్‌కు అనంతపురం జిల్లాలో 37వేల మంది పరీక్ష రాశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో బీఈడీ అభ్యర్థులకు డీఎస్సీలో ఎస్జీటీకి అవకాశం కల్పించారు. దీంతో డీఎస్సీ అభ్యర్థుల సంఖ్య 50 వేలకు చేరుతోంది. ఇందులో 40వేల మంది దాకా ఇప్పటికే కోచింగ్‌ తీసుకున్నారు. అనంతపురం నగరంలో డీఎస్సీకి ఒక్కో అభ్యర్థికి రూ.15 వేల ఫీజు, నెలకు హాస్టళ్లకు రూ.2,500, ఇతరత్రా ఖర్చులు రూ.2,500.. ఇలా గత రెండు సంవత్సరాల నుంచి సన్నద్ధమవుతున్నారు. ఏడాదికి ఒక్కో అభ్యర్థికి ఒక లక్షదాకా ఖర్చయింది. అవనిగడ్డ కోచింగ్‌ సెంటర్‌లో ఫీజు రూ.30 వేలు, నెలకు హాస్టల్‌కు రూ.5 వేల దాకా ఖర్చయినట్లు అభ్యర్థులు పేర్కొన్నారు. ఇలా నిరుద్యోగ అభ్యర్థులు అప్పులు చేసి.. శిక్షణ తీసుకుంటున్నప్పటికీ ఫలితం లేకుండా పోతోందని ఆవేదన చెందుతున్నారు.

నిర్దిష్టమైన సిలబస్‌ అయినప్పటికీ ‘ఆన్‌లైన్‌’
డీఎస్సీ ఒక నిర్దిష్టమైన సిలబస్‌(లిమిటెడ్‌ సిలబస్‌) ఉన్న రాత పరీక్ష. డీఎస్సీ నూతనంగా ఆన్‌లైన్‌లో జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల షెడ్యూల్‌ ప్రకటించడమే ఇందుకు తార్కాణం. ఎస్జీటీ రాత పరీక్షకు సాధారణంగా సింహభాగం ఉంటారు. దీంతో ఒక వారం రోజుల పాటు 14 సెషన్లలో పరీక్ష జరుగుతుంది. లిమిటెడ్‌ సిలబస్‌ ఉన్న పరీక్ష  ఒకే రోజు.. ఒకే సమయంలో.. అభ్యర్థులందరికీ ఏకకాలంలో జరపాలి. కానీ ఇక్కడ విరుద్ధంగా ఆన్‌లైన్‌లో జరపాలనే నిర్ణయం వివాదాస్పదమవుతోంది. లిమిటెడ్‌ సిలబస్‌లో ఉన్న సబ్జెక్టులకు తరచూ ఆన్‌లైన్‌ పరీక్ష జరగడంతో ఆఖరు రోజున జరిగే పరీక్ష అభ్యర్థులకు ఏ రకమైన ప్రశ్నలు వస్తాయో అంచనా వేసే అవకాశం ఉంది. కొన్ని ప్రశ్నలు రిపీట్‌ అయ్యే ప్రమాదం ఉంది. ఇటీవల జరిగిన టెట్‌ ఆన్‌లైన్‌లో జరగడంతో ఇలాంటి లోపాలు బహిర్గతమయ్యాయి. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న సెంటర్లలో మూకుమ్మడిగా ప్రతిపాదన చేసుకుని.. అక్కడి సెంటర్లలో పరీక్షలు రాసి.. మాస్‌కాపీయింగ్‌కు పాల్బడినట్లు ఆరోపణలు రావడంతో ప్రకాశం జిల్లాలో ఇటీవలే ఒకర్ని సస్పెండ్‌ చేశారు. ఇలాంటి లోపాలు ఉన్నప్పటికీ ఆన్‌లైన్‌ పరీక్షకు మొగ్గు చూపడం.. పాయింట్‌ మార్క్‌ వ్యత్యాసంతో ఉద్యోగాలు కోల్పోయే డీఎస్సీ లాంటి పరీక్షలో ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. గతంలో ఆఫ్‌లైన్‌ పరీక్షలు జరిపినప్పుడు రెస్పాన్స్‌ షీట్‌ ఇచ్చినట్లే.. ఆన్‌లైన్‌ పరీక్షలకు రెస్పాన్స్‌ షీట్‌లు ఇవ్వకపోవడం కొసమెరుపు. దీన్ని బట్టి ఆన్‌లైన్‌ పరీక్షలకు ఎలాంటి విశ్వసనీయత, ప్రామాణికత ఉందో అర్థమవుతోందని అభ్యర్థులు వాపోతున్నారు. 

టెట్‌ రెండుసార్లు నిర్వహించారు  
డీఎస్సీ షెడ్యూల్‌ను ప్రకటిస్తామని ఇప్పటికి రెండు సార్లు టెట్‌ను నిర్వహించారు. తిరిగి టెట్‌ కమ్‌ టీఆర్టీ పేరుతో డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటిస్తున్నారు. దీంతో గందరగోళం నెలకొంది. నాకు టెట్‌లో 128 మార్కులు వచ్చాయి. 2016 ఆగస్టు నుంచి డీఎస్సీకి సన్నద్ధమవుతున్నాను. నిర్దిష్టమైన సిలబస్‌ను ఇంతవరకు వెల్లడించలేదు. ఇప్పటికైనా కచ్చితమైన డీఎస్సీ షెడ్యూల్‌ను ప్రకటించాలి.                  
  –శ్రీజ,  ధర్మవరం, డీఎస్సీ అభ్యర్థిని 

ఆన్‌లైన్‌తో భవిత తారుమారు 
డీఎస్సీ మా భవితను నిర్ణయించే పరీక్ష. పైగా నిర్దిష్టమైన సిలబస్‌ ఉంటుంది. దీంతో రోజుల తరబడి పరీక్ష నిర్వహిస్తే.. పరీక్షకు ఉన్న విశ్వసనీయత పోతుంది. ఫలితాలు తారుమారవుతాయి. ఒక రోజు ప్రశ్నాపత్రం సులువుగా ఇచ్చి.. తర్వాతి రోజు కఠినంగా ఇస్తే మార్కుల్లో వ్యత్యాసం వచ్చి.. భవిత తారమారయ్యే ప్రమాదం ఉంది.  
– అనూష, గరిమేకలపల్లి, పేరూరు 

ఏటా డీఎస్సీ నిర్వహిస్తామన్నారు 
ప్రతి ఏడాది ఉపాధ్యాయ దినోత్సవానికి డీఎస్సీ ప్రకటన జారీ చేస్తామని స్వయానా మంత్రి గంటా హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడి నాలుగున్నరేళ్లవుతున్నా... కేవలం ఒక డీఎస్సీ నిర్వహించారు. మరోసారి డీఎస్సీ నిర్వహణకు రెండేళ్ల నుంచి దోబూచులాట అడుతున్నారు. మాది నిరుపేద కుటుంబం. ఇప్పటికే రూ.లక్ష దాకా ఖర్చుయ్యింది. నిరుపేదల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోంది.  
– రామాంజినేయులు నాయక్, కేకే తండా,
 గార్లదిన్నె మండలం 

అప్పులు చేసి హాస్టల్‌ ఫీజు  
మాది మధ్య తరగతి కుటుంబం. టీచర్‌ పోస్టుపై ఆశతో టెట్‌ రాయగా.. 120 మార్కులు వచ్చాయి. డీఎస్సీ శిక్షణ కోసం ఇప్పటికే  రూ.60 వేలు ఖర్చుచేశాను. ఇపుడు అప్పులు చేసి నగరంలోని ఓహాస్టళ్లలో ఉండి డీఎస్సీకి శిక్షణ పొందుతున్నాను. ప్రభుత్వం అదిగో..ఇదిగో అంటూ డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వకుండా మా జీవితాలతో చెలగాటమాడుతోంది.  సంవత్సరాలుగా ఎదురుచూస్తూ కాలం Výæడుపుతున్నాం. ఇప్పటికైనా మా బాధలు అర్థం చేసుకుని వెంటనే నోటిఫికేషన్‌ ఇవ్వాలి.
– భారతి, సంజీవపురం, గార్లదిన్నె మండలం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top