చంద్రబాబును ఓడించాలి

AP CPI Chief Ramakrishnan Comments On CM Chandrababu Naidu Kadapa - Sakshi

మైదుకూరు(వైఎస్సార్‌ కడప) : ‘టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 640 మండలాల్లో ఎక్కడా అభివృద్ధి జరగలేదు.. ఏ ఒక్కరికీ లబ్ధి చేకూరలేదు.. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేశారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ ప్రభుత్వం మారాల్సిన అవసరం ఉంది..వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబును ఓడించాలి’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పేర్కొన్నారు. సీపీఐ జిల్లా జిల్లా మహాసభల్లో భాగంగా సోమవారం రెండో రోజు మైదుకూరులోని ఏ–1 కల్యాణ మండపంలో మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ నాలుగేళ్లుగా చంద్రబాబు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకుండా అమరావతి, పోలవరం గురించే ఆలోచిస్తూ వచ్చారన్నారు. రాష్ట్రంలో ఇసుక, మైనింగ్, చీప్‌ లిక్కర్‌ మాఫియాలు పేట్రేగిపోతున్నాయన్నారు.

కర్నూలులో అక్రమంగా నిర్వహిస్తున్న మైనింగ్‌ ఫ్యాక్టరీలో 12 మంది దుర్మరణం చెందారన్నారు. అధికారుల నుంచి ఎమ్మెల్యే, ఎంపీలు, టీడీపీ నాయకులందరూ లంచాలకు పని చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజన తర్వాత రూ.94వేల కోట్ల రాష్ట్ర అప్పును చంద్రబాబునాయుడు రూ.2.49 లక్షల కోట్లు చేశారని, ఈయనకు అప్పులు చేయటమే తెలుసని, ప్రజలకు మేలు చేయటం తెలియదన్నారు. విద్య, వైద్య రంగాలను కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించారని, దీంతో ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. టీవీలు, పేపర్లలో గొప్ప ప్రకటనలు తప్ప చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కేవలం 90శాతం కార్పొరేట్‌ మీడియాను చేతిలో పెట్టుకుని అధిక ప్రచారం చేయించుకుని, ప్రజలను మభ్యపెట్టి గెలిచారన్నారు.

నిరుద్యోగులందరికి ఉద్యోగాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చి యువతకు పంగనామం పెట్టారన్నారు. నోట్లరద్దు, జీఎస్టీ ప్రభావంతో 2.64 లక్షల పరిశ్రమలు మూతపడ్డాయని, కోట్లాది ఉద్యోగులు వీధినపడ్డారన్నారు. వేల కోట్లు రుణాలు తీసుకున్న విజయ్‌ మాల్యా, నీరవ్‌మోదీ, లలిత్‌మోదీలు విదేశాల్లో జీవిస్తున్నారని, ఇలాంటి వారిపై చర్యలు తీసుకోలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలను ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఓబులేసు, జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆవులు వెంకటరమణ, పులి కృష్ణమూర్తి, ఎంవీ సుబ్బారెడ్డి, నాగసుబ్బారెడ్డి, చంద్ర, శేఖర్, వెంకటేష్, శివ, స్థానిక నాయకులు పి.శ్రీరాములు, షావల్లి, పుల్లయ్య, బీఓ రమణ, మహిళా నాయకురాలు మున్నీ, బండి అరుణ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top