ముగిసిన చంద్రబాబు చైనా పర్యటన | AP cm chandra babu china trip completed on friday | Sakshi
Sakshi News home page

ముగిసిన చంద్రబాబు చైనా పర్యటన

Apr 18 2015 12:55 AM | Updated on Mar 19 2019 7:01 PM

ముగిసిన చంద్రబాబు చైనా పర్యటన - Sakshi

ముగిసిన చంద్రబాబు చైనా పర్యటన

ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆరు రోజుల చైనా పర్యటనను ముగించుకుని శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్ చేరుకుంది.

  • అర్ధరాత్రి హైదరాబాద్‌కు సీఎం బృందం
  • ఆరు రోజుల పాటు చైనాలో పర్యటన
  • చైనా ప్రభుత్వం, పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో పలు ఒప్పందాలు
  •  
    సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆరు రోజుల చైనా పర్యటనను ముగించుకుని శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్ చేరుకుంది. చైనాలోని బీజింగ్, చెంగ్డు, షాంఘై నగరాల్లో పర్యటించిన బృందం మధ్యాహ్నం మూడున్నర గంటలకు షాంఘై నుంచి బయలుదేరి మలేసియా రాజధాని కౌలాలంపూర్ మీదుగా అర్ధరాత్రి 12.10 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. పర్యటనలో భాగంగా ఏపీ, చైనాల మధ్య పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులతో పాటు వివిధ రంగాల్లో సహకారానికి అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుంది. సీఎం వెంట వెళ్లిన పారిశ్రామికవేత్తలు కూడా పలు అంశాలపై ఒప్పందాలు చేసుకున్నారు. పర్యటన చివరి రోజు శుక్రవారం చంద్రబాబు బృందం చైనా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శితో పాటు వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమైంది.
     
    సీసీపీకార్యదర్శి హాంగ్‌జంగ్‌తో భేటీ
    చైనా కమ్యూనిస్టు పార్టీ(సీసీపీ) కార్యదర్శి హాంగ్‌జంగ్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు. టీడీపీ 33 సంవత్సరాల ప్రస్తానాన్ని జంగ్‌కు వివరించారు. భవిష్యత్తులో ఏపీ ప్రభుత్వంతో పాటు టీడీపీకి ఇదే విధమైన సహయం అందించాలని కోరారు.
     
    ఏపీలో మీరేంటో ప్రపంచానికి చాటండి
    ఏపీకి వచ్చి కొత్త రాజధాని అమరావతిని నిర్మించి ప్రతిభ, నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటే అద్భుత అవకాశం చైనా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలకు వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. 20 ఏళ్ల కిందట తాను చూసిన షాంఘై నగరానికి ప్రస్తుతం చూస్తున్న నగరానికి పోలికే లేదన్నారు. షాంఘైలో జరిగిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం మాట్లాడారు.
     
    హైటెక్ పార్కులు అభివృద్ధి చేస్తాం: యుయాంగ్
    ఏపీలో హైటెక్ పార్కుల అభివృద్ధికి చైనా కంపెనీలను ప్రోత్సహిస్తామని షాంఘై కామర్స్ కమిషన్ డెరైక్టర్ జనరల్ షాంగ్ యుయాంగ్ తెలిపారు. కొత్త రాజధాని నిర్మాణంలో చైనా నిపుణుల సహకారం ఉంటుందన్నారు. తమ నిపుణులు ఏపీ నగరాల నిర్మాణానికి అవసరమైన డిజైనింగ్ చేయడంలో సహ కరిస్తారన్నారు. రౌండ్ టేబుల్‌కి హాజరైన వారి సందేహాలకు ఐఏఎస్ అధికారులు అజయ్‌జైన్, రావత్‌లు సమాధానమిచ్చారు.
     
    నచ్చిన ప్రాంతాన్ని ఎంపిక చేసుకోండి
    వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీల్లో చంద్రబాబు మాట్లాడుతూ అమరావతి నగరంలో ఐకానిక్ బిల్డింగులు నిర్మించాల్సి ఉందని, ఇందుకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన కంపెనీల కోసం తాము ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. ఏపీలో వెంటనే పర్యటించి వారికి నచ్చిన ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని నూతన అభివృద్ధి ఆలోచనలతో ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. జేఏ సోలార్ కంపెనీ అధ్యక్షుడు జీ జియాస్ హర్మన్ ఝా ఏపీలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. భేటీల్లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, కార్మిక మంత్రి కె.అచ్చెన్నాయుడు, ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు, ఎంపీలు సీఎం రమేష్, గల్లా జయదేవ్, ఉన్నతాధికారులు సతీష్ చంద్ర, పీవీ రమేష్, రావత్, అజయ్ జైన్, కార్తికేయ మిశ్రా, వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.
     
    ఆఖరి రోజు ఒప్పందాలివే..
    ఏపీ ప్రభుత్వం చేసుకున్నవి

    •  సోలార్ సెల్, సోలార్ మాడ్యుల్ ఉత్పత్తి చేసే జేఏ సోలార్ ఇన్‌వెస్ట్‌మెంట్(హాంగ్‌కాంగ్) లిమిటెడ్ సంస్థతో ఏపీ ప్రభుత్వ ఇంధన, మౌలిక సదుపాయాల కల్పనా శాఖ ఒప్పందం చేసుకుంది.
    • సోలార్ సెల్స్, మాడ్యుల్స్ తయారు చేసే లె ర్రీ సోలార్ టెక్నాలజీ కంపెనీ లిమిటెడ్‌తో ఏపీ ప్రభుత్వ మౌలిక సదుపాయాల కల్పన, ఇంధన శాఖ ఒప్పందం.
    •  చైనా సోలార్ ఎన ర్జీ లిమిటెడ్‌తో ఏపీ మౌలిక సదుపాయాల కల్పన, ఇంధన శాఖ ఒప్పందం.
    • షాంఘై న్యూ ఎనర్జీ ఇండస్ట్రీస్ అసోసియేషన్, ఏపీ ఇంధన శాఖ మధ్య ఒప్పందం.
    • ఫోసన్ ఇండస్ట్రియల్ హోల్డింగ్స్ లిమిటెడ్, పరిశ్రమల శాఖ మధ్య జరిగిన ఒప్పందంలో ఏపీ ప్రభుత్వం తరపున పరిశ్రమల శాఖ కార్యదర్శి రావ త్ సంతకం చేశారు

     ప్రైవేటు రంగంలో...

    • కాకినాడ సెజ్(జీఎమ్మార్), హాంగ్జూ, హౌటాంగ్ మధ్య ఒప్పందం.
    • బాండిక్స్ ఇండియా, జియాంగ్జుకింగ్‌డే టెక్స్‌టైల్ కంపెనీ మధ్య ఒప్పందం.
    •  టెక్స్‌టైల్ రంగంలో జియాంగ్ హెంగ్యుయాన్ కెమికల్ ఫైబర్ గ్రూప్‌తో బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీ మరో ఒప్పందం.
    •  కునషాన్ రైజింగ్ టెక్స్‌టైల్ అండ్ గార్మెంట్ కంపెనీ లిమిటెడ్‌తో బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీ హోం టెక్స్‌టైల్స్ రంగంలో పెట్టుబడులకు సంబంధించి ఒప్పందం.
    •  సుమెక్ టెక్స్‌టైల్స్ అండ్ లైట్ ఇండస్ట్రీ కంపెనీ లిమిటెడ్‌తో కూడా బ్రాండిక్స్ ఒప్పందం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement